ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్‌పూర్ జిల్లా లోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది,మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్ లోని నారాయణ్‌పూర్,దంతెవాడ,జగదల్‌పూర్, కొండగావ్ జిల్లాల భద్రతా బలగాలు బస్తర్ పరిధి లోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. డీఆర్‌జీ ,ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో దండకారణ్యంలో కూంబింగ్ చేస్తుండగా భద్రతా బలగాలపైకి మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో దళాలు ఎదురుకాల్పులు జరిపాయి.
తెల్లవారు జామున 3 గంటల నుంచి ఈ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న అబూజ్‌మట్ అటవీ ప్రాంతం టార్గెట్‌గా భద్రతా బలగాలు అడుగులు వేస్తున్నాయి. సుమారు లక్షల మంది పారామిలిటరీ బలగాలు వరుస ఎన్‌కౌంటర్లకు దిగుతున్నారు. దీంతో తెలంగాణఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీతోపాటు మొత్తం గోదావరి పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణలో రెండు భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. సెప్టెంబర్ 5న కొత్తగూడెం ఎన్‌కౌంటర్, డిసెంబర్ 1న చలపాక ఎన్‌కౌంటర్ జరిగాయి.