జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో సినీనటుడు మోహన్‌బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద జరిగిన గొడవను కవర్ చేసేందుకు మంగళవారం వెళ్లిన జర్నలిస్టులపై మోహన్‌బాబు, అతడి అనుచరులు దాడికి దిగారు. ఈ సంఘటనలో ఓ రిపోర్టర్ తలకు గాయాలుకాగా, వీడియోజర్నలిస్టు కిందపడడంతో గాయపడ్డాడు. గాయపడిన వారు పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగా మోహన్‌బాబు, అతడి బౌన్సర్లపై పోలీసులు ముందుగా 118(1) బిఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేశారు. తర్వాత పోలీసులు న్యాయ సలహా తీసుకుని 109బిఎన్‌ఎస్ సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
కాగా గత రెండు రోజుల నుంచి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందిన మోహన్‌బాబు గురువారం డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం రాత్రి జల్పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం మోహన్‌బాబు ఆస్పత్రిలో చేరారు. ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారని, వైద్య పరీక్షల అనంతరం కంటి దిగువభాగంలో గాయమైనట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. బీపీ ఎక్కువగా ఉందని, గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయని వెల్లడించారు. తన నివాసం వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి విచారణకు హాజరు కావాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు నోటీసులు జారీ చేశారు. దీనిపై మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈనెల 24 వరకు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.
కొట్టాలను కోలేదుః మోహన్‌బాబు, సినీనటుడు….
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్‌బాబు ఓ ఆడియో విడుదల చేశారు. జర్నలిస్ట్‌పై తాను దాడి చేశానని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. తాను కావాలని జర్నలిస్టులను కొట్టలేదని, దైవసాక్షిగా చెబుతున్నానని మోహన్‌బాబు తెలిపారు. ఇంట్లో నుంచి వచ్చిన తాను మొదట జర్నలిస్టుకు నమస్కారం పెట్టానని, అయినా అతను తన వద్ద మైక్ పెట్టారని తెలిపారు. ఆ మైక్ తన కన్నుకు తగలబోయిందని, తృటిలో తాను తప్పించుకున్నట్లు చెప్పారు. విజయవాడలో తాను ఒకపప్పుడు ఉద్యోగినేనని గుర్తు చేశారు. తన ఇంటికి వచ్చినవారు మీడియా వారా వేరే వారు ఎవరైనా వచ్చారా అనే విషయం తనకు తెలియదన్నారు. జరిగిన సంఘటనకు తాను మనస్ఫూర్తిగా చింతిస్తున్నట్లు తెలిపారు. జరిగిన ఘటనకు బాధపడుతున్నానని, ఆ జర్నలిస్టు తనకు తమ్ముడులాంటి వారన్నారు.
అన్ని విషయాలను పైన భగవంతుడు చూస్తున్నారని మోహన్ బాబు తెలిపారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, తాను చేసిన మంచి పనులను ఎవరూ అర్థం చేసుకోవడంలేదన్నారు. జర్నలిస్టులను కొట్టడం మాత్రం తప్పే అయినప్పటికీ.. సందర్భాన్ని అర్థం చేసుకోవాలని మోహన్‌బాబు తన ఆడియో సందేశంలో పేర్కొన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా కొట్టలేదన్నారు. మైకులు లాక్కుని కొట్టేంత మూర్ఖుడిని తాను కాదన్నారు. పోలీసులంటే తనకు ఎంతో ఇష్టమని, వారు శాంతి భద్రతలను కాపాడాలన్నారు. కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని మోహన్‌బాబు తెలిపారు. ఇది న్యాయమా.. అన్యాయమా అనేది ఆలోచించాలన్నారు.
అసలు ఏం జరిగిందంటే…
తనపై తండ్రి మోహన్ బాబు, అతడి అనుచరులు దాడి చేశారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత మంచు మోహన్‌బాబు తన కుమారుడు తనపై దాడికి పాల్పడ్డారని మనోజ్ కుమార్, మౌనికపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మోహన్‌బాబు ఇంటి వద్ద న్యూస్ కవరేజ్ చేస్తున్న ఓ జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు.