జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ఠ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడాన్ని కెటిఆర్ ఎక్స్ వేదికగా ఖండించారు. తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తిగా సానుభూతి ఉందని… కానీ ఆ ఘటనలో వాస్తవంగా విఫలమయింది ఎవరు..? అని ప్రశ్నించారు. అల్లు అర్జున్‌కు నేరుగా ఎలాంటి సంబంధం లేని కేసులో… ఆయనను ఒక సాధారణ నేరస్తుడిగా చూడటం సరికాదని అన్నారు. సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం న్యాయమైతే ..హైడ్రా పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి మరణానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
చట్టం అల్లు అర్జున్‌తో పాటు రేవంత్ విషయంలోనూ సమానంగా ఉండాలి : హరీష్ రావు
జాతీయ ఉత్తమ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టును మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్‌రావు ఖండించారు. ఈ మేరకు హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..?.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు..? అని నిలదీశారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, కానీ దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులేనని ఆరోపించారు. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సిఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్‌ని ఎందుకు అరెస్టులు చేయరు..? అని ప్రశ్నించారు.
రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు..? అని అడిగారు. అరెస్ట్ చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలని అన్నారు. ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్ట్ చేయాలి..? ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు… దీనికి ఎవరిని అరెస్ట్ చేయాలి..? ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు… దీనికి ఎవరిని అరెస్ట్ చేయాలి..? అని ప్రశ్నించారు. చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలలి.. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదని అని హరీష్ రావు ట్వీట్ చేశారు.