బంగ్లాదేశ్ లోని హిందువుల రక్షణకు భారత్ తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని మోడీ పార్లమెంటుకు తెలియజేయాలని శివసేన (యూబీటీ ) అధ్యక్షుడు , మాజీ సిఎం ఉద్ధవ్ థాకరే కోరారు. ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ , బీజేపీ పాటించే హిందుత్వం కేవలం ఓట్ల కోసం మాత్రమేనని మండి పడ్డారు. “బంగ్లాదేశ్లో హిందువులు అణచివేతకు గురవుతున్నారు. ఇస్కాన్ కార్యాలయాలను తగలబెట్టారు. అయినా ప్రధాని మోడీ మౌనంగానే ఉన్నారు. ఒక్కఫోన్ కాల్తో రష్యాఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్న ప్రధాని మోడీ… బంగ్లాదేశ్లో హింసను మాత్రం ఆపలేరా ? ” అని ఉద్ధవ్ థాకరే ప్రశ్నించారు.
బంగ్లాలో జరుగుతున్నసంఘటనలకు వ్యతిరేకంగా నిలబడాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరి తరఫున మోడీని అభ్యర్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఐక్యత గురించి మనదేశంలో ప్రసంగాలు చేయడంతో ఉపయోగం లేదని, భారతీయులను హింసకు గురి చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ ప్రపంచ దేశాలను చుట్టి వచ్చే కార్యక్రమాలలో బిజీగా ఉండటం వల్ల ఆయనకు ఎంపీలను కలిసే సమయం కూడా ఉండట్లేదని ఎద్దేవా చేశారు. మోడీ తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్తుండడం వల్ల ఆయనకు మణిపూర్ అల్లర్లు, బంగ్లాదేశ్లో జరుగుతున్న హింస గురించి తెలిసి ఉండకపోవచ్చని అన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో సురక్షితంగా ఉన్నారని మరి ఆ దేశంలో కష్టాలు పడుతున్న హిందువుల సంగతి ఏంటి ? అని ప్రధానిని ప్రశ్నించారు.