గ్రామస్థాయిలో ఆధ్యాత్మికతను వెల్లి విరియాలని, ఆలయాలను ఎంతో పవిత్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఆయన శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల దర్శనార్ధం యాదగిరగుట్టకు వచ్చిన ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకొని ప్రధానాలయ ముఖమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గవర్నర్‌కు వేదాశీర్వచనం చేయగా, ఇఒ భాస్కర్‌రావు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం హర్యానా గవర్నర్ విలేఖరులతో మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం దివ్యక్షేత్రంగా వెలుగొందుతోందని తెలిపారు.
దేశంలో, రాష్ట్రంలో ఆర్ధిక ప్రగతి పెరుగుతోందని, కానీ ప్రజల్లో ధార్మికత, నీతి, నిజాయితీ, నైతిక విలువలు లాంటి మానవ వనరుల శక్తి ఎంత పెరిగితే దేశం అంత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. నీతి, నిజాయితీ లేకుండా అవినీతి ఎక్కువైపోతే సమాజ పతనానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య డ్రగ్ మాఫియా, మత్తుపదార్ధాలని, యువత, విద్యార్థుల్లో మార్పు రావాలని, వీటి నుంచి బయటపడాలని హితవు పలికారు. సమాజంలో మహిళలపై రోజురోజుకు జరుగుతున్న అత్యాచారాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామగ్రామాన ధర్మజాల కార్యక్రమాన్ని యాదగిరిగుట్ట దేవస్థానం ప్రారంభించాలని, తద్వారా యువత, విద్యార్థుల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట కలెక్టర్ హనుమంతరావు, బిజెపి నేతలు గూడూరు నారాయణరెడ్డి, రచ్చ శ్రీనివాస్, గుంటిపల్లి సత్యనారాయణ, కర్రె ప్రవీణ్‌తో పాటు స్థానిక నేతలు ఉన్నారు.