జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి విదితమే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మోహన్‌బాబు అభ్యర్థించారు. దీనిని కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. కాగా, మంచు ఫ్యామిలీ వివాదాల నేపథ్యంలో గత ఆదివారం నుంచి మూడ్రోజులపాటు హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. తనపై దాడి జరిగిందంటూ పోలీసులను మనోజ్ ఆశ్రయించగా, కుమారుడు మనోజ్ అతని భార్యతో తనకు హాని ఉందని రాచకొండ పోలీసులకు మోహన్ బాబు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
దీంతో తండ్రికొడుకులపై కేసులు అయ్యా యి. అయితే మంచు ఫ్యామిలీ ఘర్షణల నేపథ్యంలో ప్రశ్నించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ విలేకరి చెవి ఎముక మూడు చోట్ల విరిగింది. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్‌గా మారింది. ఈ దాడిపై ఆ వార్తా సంస్థ యాజమాన్యం రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. వారి ఫిర్యాదు మేరకు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. అయితే విచారణకు రావాలంటూ ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా, మూడ్రోజులపాటు జరిగిన తీవ్ర ఘర్షణలతో ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ సమయంలోనే తనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంపై హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. కాగా, శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం మోహన్‌బాబు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలురించింది.