రంగారెడి జిల్లా భూదాన్ లాండ్ స్కామ్‌లో కీలక పరిణామాలు జరిగాయి. బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ మర్రి జనార్థన్‌రెడ్డికి ఇడి నోటీసులు జారీ చేసింది. మర్రి జనార్దన్‌రెడ్డితోపాటు వంశీరాం బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డికి కూడా ఇడి నోటీసులు జారీ చేసింది. ఆమోద డెవలపర్స్‌కు చెందిన సూర్యతేజతో పాటు కెఎస్‌ఆర్ మైన్స్‌కు చెందిన సిద్ధారెడ్డి ఈ స్కామ్‌లో బాగా లాభపడినట్టు ఇడి గుర్తించింది. దీన్ని క్లారిఫై చేసుకునేందుకు విచారణకు పిలిచింది. వీరిని డిసెంబర్ 16న విచారణకు రావాలని ఇడి కోరింది. వీరి నుంచి సమా చారం తీసుకున్న తర్వాత మరికొందర్ని విచారణకు పిలిచే అవకాశమున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా నాగరంలోని సర్వే నెంబర్ 181, 182 లోని 102.2 ఎకరాలపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఇందులో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డ్‌కు చెందినదని బోర్డు వాది స్తోంది. అయితే ఈ భూమి జబ్బార్దస్త ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. తర్వాత కాలంలో జబ్బర్దస్తూ ఖాన్ కొడుకు హజీ ఖాన్ ఈ 50 ఎకరాలు ల్యాండ్‌ను భూదాన్ బోర్డ్‌కు దానం చేశారు.
అయితే 2021లో హజీఖాన్ వారుసరాలిని అంటూ 40 ఎకరాలు తనదేనని ఖాదురున్నీసా అనే మహిళ దరఖాస్తు చేసింది. దీంతో ఆగమేఘాల మీద ఆమె పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. క్షేత్ర స్థాయిలో ఆర్డీవో , తహసీ ల్దార్, ఆర్‌ఐలు, సీనియర్ అసిస్టెంట్ ఆమెకు అనుకూలంగా పని చేసినట్లు విచారణలో బయటపడింది. అనంతరం ఈ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మకాలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ భూమికి సంబంధించి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ భూమిపై క్రయవిక్రయాలు జరగకుండా ధరణిలో నిషేధిత జాబితాలో అధికారులు పెట్టారు. ఈ వ్యవహరం కోర్ట్‌కు చేరడంతో న్యాయస్థానం ఆదేశాలతో అప్పటి ఎమ్మార్వో జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్టార్, ఈఐపీఎల్ కన్స్‌ట్రాక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్‌పై కేసు నమోదైంది. రెండు కేసులో భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరగడంతో ఇడి రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ విచారణ కొనసాగుతోంది. కాగా.. 50 ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతం అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
విజిలెన్స్ విచారణలో భూదాన్ భూముల భాగోతం వెలుగులోకి వచ్చింది. ఇదే వ్యవహారంలో అప్పటి ఎమ్మార్వో జ్యోతిపై కేసు నమోదు అయిన సంగతి విధితమే. జ్యోతిపై కేసు నమోదైన తర్వాత విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విజిలెన్స్ విచారణ ఆధారంగా ఇడి దర్యాప్తు జరిపింది. ఈ క్రమంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్ ఉండటంతో ఆయనకు నోటీసు జారీ చేసిన ఇడి శుక్రవారం విచారణ చేపట్టింది. భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఇడి విచారణకు హాజరయ్యా రు. భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఐఏఎస్‌కు ఇప్పటికే ఇడి నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్ పనిచేశారు.