Monday, December 16, 2024

నిధులివ్వండి

- Advertisement -
- Advertisement -

వెనుకబడిన జిల్లాలకు పెండింగ్‌లో ఉన్న రూ.1800
కోట్లు వెంటనే ఇవ్వండి ఉమ్మడి సంస్థల నిర్వహణ
వ్యయంలో ఆంధ్రా వాటా ఇప్పించండి కేంద్ర ఆర్థిక
మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరిన సిఎం రేవంత్
కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
చేయండి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతి

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండోరోజూ ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఇద్దరు కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలు అందించారు. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. అ లాగే ఇండియా టుడే నిర్వహించిన చర్చావేదికలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో పార్లమెంట్‌లోని ఆమె ఛాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి రావల్సిన గ్రాంటుపై చర్చించారు. పునర్విభజన చట్టంలో తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు ఏటా రూ.450 కోట్ల చొప్పున గ్రాంటు విడుదలకు అంగీకరించారని ఆయన గుర్తుచేశారు.

2019 -20, 2021 -22, 2022 -23, 2023-24 సంవత్సరాలకు సంబంధించిన గ్రాంటును ఇప్పటి వరకు విడుదల చేయలేదని, నాలుగేళ్లకు కలిపి పెండింగ్లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత హైదరాబాద్లోని హైకోర్టు, రాజ్ భవన్, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జ్యుడీషియల్ అకాడమీ సహా ఇతర ఉమ్మడి సంస్థల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు. ఆయా సంస్థల విభజన పూర్తయ్యే వరకు నిర్వహణకు అయిన రూ.703.43 కోట్లను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని.. అందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.408.49 కోట్లను తెలంగాణకు చెల్లించాల్సి ఉందని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ మొత్తం చెల్లింపునకు ఆంధ్రప్రదేశ్ సమ్మతి తెలిపిందని, కేంద్ర హోం శాఖ సైతం ఆ మొత్తం తెలంగాణకు చెల్లించాలని ఏపీకి లేఖలు రాసిందని సీఎం వివరించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఆ మొత్తాన్ని తెలంగాణకు చెల్లించలేదని…ఆ రూ.408.49 కోట్లను వడ్డీతో సహా తెలంగాణకు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రుణాల పంపిణీ విషయంలో తెలంగాణ నుంచి ఏకపక్షంగా రూ.2,547.07 కోట్ల రికవరీకి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిరసన తెలిపినా పట్టించుకోలేదని, ఈ విషయంపై మరోసారి సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన నిధులన్నింటిని 2014-15లో కేవలం ఆంధ్రప్రదేశ్కే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పునర్విభజన చట్టంలోని జనాభా ప్రాతిపదికన ఆ మొత్తంలో ఏపీ నుంచి తెలంగాణకు రూ.495.20 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. అకౌంటెంట్ జనరల్, ఆంధ్రప్రదేశ్కు తాము పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆ మొత్తాన్ని తెలంగాణకు సర్దుబాటు చేయడం లేదని, ఈ విషయంలో జోక్యం చేసుకొని తెలంగాణకు రావల్సిన నిధులు ఇప్పించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పండి
కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పానలి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును పేర్కొన్న విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. కాజీపేటలో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీవోహెచ్) వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ తరువాత సైతం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోరుతూ తాను లేఖ రాశానని సీఎం వివరించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది కాజీపేట వాసుల కల మాత్రమే కాదని, యావత్ తెలంగాణ స్వప్నమని సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. వికారాబాద్- కృష్ణా స్టేషన్ మధ్య పూర్తిగా రైల్వే శాఖ వ్యయంతో నూతన రైలు మార్గం నిర్మించాలని రైల్వే శాఖ మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. ఈ మార్గం నిర్మిస్తే దక్షిణ తెలంగాణలో మారుమూల వెనుకబడి ఉన్న పరిగి, కొడంగల్, చిట్లపల్లె, చిట్లపల్లె కోడ్, రావులపల్లి, మాటూరు, దౌల్తాబాద్, దామరగిద్ద, నారాయణ్‌పేట మక్తల్ అభివృద్ధి చెందడంతో పాటు తాండూర్ సమీపంలోని సిమెంట్ క్లస్టర్, ఇతర పరిశ్రమల అభివృద్ధికి అవకాశం ఉంటుందని వివరించారు.

ఈ మార్గంతో వికారాబాద్ జంక్షన్ నుంచి కృష్ణా స్టేషన్ల మధ్య 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు. కల్వకుర్తిమాచర్ల మధ్య నూతన రైలు మార్గం మంజూరు చేయాలని రైల్వే శాఖ మంత్రిని సీఎం కోరారు. కల్వకుర్తి నుంచి వంగూరు-, కందుకూరు, దేవరకొండ, చలకుర్తి, తిరుమలగిరి మీదుగా మాచర్ల వరకు తాము ప్రాతిపదించే నూతన మార్గం ప్రతిపాదిత గద్వాలడోర్నకల్, ఇప్పటికే ఉన్న మాచర్ల మార్గాలను అనుసంధానిస్తుందని సీఎం వివరించారు. ఈ మార్గం నిర్మిస్తే సిమెంట్ పరిశ్రమలతో పాటు అటవీ ఉత్పత్తుల విక్రయానికి ప్రయోజనం ఉంటుందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఈ మార్గంతో సికింద్రాబాద్, గుంటూరు, డోన్ సెక్షన్ల మధ్య అనుసంధానత కలిగి శ్రీశైలం వెళ్లే భక్తుల సులభతర ప్రయాణానికి అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. డోర్నకల్‌మిర్యాలగూడ, (పాపటపల్లి జాన్ పహడ్), డోర్నకల్‌గద్వాల ప్రతిపాదిత రైలు మార్గాలను పునఃపరిశీలించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైఫ్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ రెండు రైలు మార్గాలు ఖమ్మం జిల్లాలోని సారవంతమైన భూములు, చెరకు పరిశ్రమలు, సైబరియన్ వలస పక్షుల కేంద్రం, భారతదేశంలోని అతి పెద్ద బౌద్ధ స్తూపం, పాలేరు రిక్రియేషన్ ప్రాంతాల మీదుగా ఉన్నాయని సీఎం తెలిపారు. పాలేరు శాసనసభ నియోజక వర్గంలోని భూముల ధరలు భారీగా ఉన్నాయని, అత్యధికులు బీసీ,

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన రైతులే అని సీఎం వివరించారు. ఇక్కడ విలువైన భూముల సేకరణ రైల్వే శాఖకు భారంగా మారుతుందని, ఆ ప్రతిపాదిత మార్గాలను మార్చి డోర్నకల్ నుంచి వె న్నారం-, మన్నెగూడెం-, అబ్బాయిపాలెం-, మరిపెడ మీదుగా మోతె వరకు రైల్వే లైన్లను మార్చాలని సీఎం కోరారు. ఈ ప్రాంతాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయని, రైలు మార్గాలు కూడా లేవని తెలిపారు. ఈ రెండు మార్గాల అలైన్‌మెంట్‌ను పునఃపరిశీలించాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ అయిన కార్యక్రమంలో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, బలరాం నాయక్, ఎం. అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ కడియం కావ్య, మాజీ ఎంపీ వి.హనుమంతరావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News