Monday, December 16, 2024

పేదరికం-బాలకార్మిక వ్యవస్థ!

- Advertisement -
- Advertisement -

కాల చక్రం తిరుగుతూనే ఉంది. పేదల, ధనికుల వ్యత్యాసం కొనసాగుతూనే ఉంది. ప్రజల విభజనే కాకుండా ప్రపంచ దేశాల మధ్య అ విభజన ఏర్పడింది. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలుగా ప్రపంచ విభజించబడింది. సామ్రాజ్యవాద దేశాలు మిగతా దేశాల, ముఖ్యంగా వెనుకబడిన దేశాల సహజ వనరులను, సంపదలను తరలించుకుపోతుంటే, సామ్రాజ్యవాదంతో కుమ్మక్కు అయిన వివిధ దేశాల బడా పెట్టుబడిదారులు, బడా భూస్వాములు, ఆ వర్గాలకు ప్రాతినిధ్య వహిస్తున్న ప్రజావ్యతిరేక ప్రభుత్వాలు ప్రజాసంపదలను దోచుకుంటున్నాయి. ఫలితంగా ప్రపంచంలో పేదరికం ఒక పక్క, కొద్ది మంది వద్ద సంపద కేంద్రీకరణ మరోపక్క ఉంది.

పేదరికం ఫలితంగా, పేద కుటుంబాలు ముఖ్యంగా వెనుకబడిన దేశాల పేదలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఫ్యాక్టరీల్లో, సేద్యపు భూముల్లో పగలు, రాత్రి పని చేసినా వారి కుటుంబ పోషణ సమస్యగా మారింది. ఆటపాటలతో, బడికి వెళ్లి చదువుకోవాల్సిన వారి పిల్లలను కుటుంబ పోషణలో భాగస్వాములుగా పనులకు పంపుతున్న ఫలితంగా వారు బాలకార్మికులుగా మారుతున్నారు. పేదల కుటుంబాల ఆదాయంలో, పిల్లల ద్వారా వచ్చే ఆదాయం 25 నుండి 40 శాతంగా ఉంది. ప్రపంచంలో పేద కుటుంబాల్లో కోట్లాది పిల్లలు ఉన్నారు. బాల కార్మికులు : 19వ, 20వ శతాబ్దంలో అనేక దేశాల్లోని 5 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాలకార్మికులు ఒకే విధంగా పని చేస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయం, గృహ ఆధారిత, కర్మాగారాల, మైనింగ్, రెస్టారెట్లు, పాడి పరిశ్రమ, న్యూస్ పేపర్ల బాయ్స్ వంటి పనులు చేస్తున్నారు. 2023 నాటికి ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు బాల కార్మికునిగా ఉన్నారు. వీరిలో అత్యధిక సంఖ్యలో సబ్ – సహారా ఆఫ్రికాలో నివసిస్తున్నారు.

ఇక్కడ ప్రతి నలుగురిలో ఒకరి కన్నా ఎక్కువ మంది పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారు. 2017లో ఆఫ్రికా దేశాలైన మాలి, బెవిన్, చాడ్, గినియా బస్వౌలలో 5 నుంచి 14 సంవత్సరాల పిల్లల్లో 50 శాతం పైగా బాల కార్మికులు పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది బాల కార్మికులు వ్యవసాయ రంగంలో పని చేస్తున్నారు. యునిసెఫ్, అంతర్జాతీయ కార్మిక సంస్థల లెక్కల ప్రకారం 2021లో ప్రపంచ వ్యాప్తంగా 5 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల బాల కార్మికులు 168 మిలియన్ల మంది ఉన్నారు. వీరితో పాటు కోవిడ్ 19 కాలంలో మరో 9 కోట్ల మంది బాల కార్మికులుగా మారారు. ఆసియా ఖండంలో 22%, ఆఫ్రికాలో 32%, లాటిన్ అమెరికాలో 17% మంది బాల కార్మికులుగా పని చేస్తున్నారు. ఆసియాలోనే 114 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నారు. మాపుల్ క్రాప్ట్ చైల్ లేబర్ ఇండెక్స్ 2012 ప్రకారం ప్రపంచ వ్యాపితంగా పని చేస్తున్న 76 కంపెనీలు విపరీతంగా బాల కార్మికులచేత పని చేస్తున్నాయి. ఫ్యాక్టరీ యజమానులు, పెద్ద గృహ యజమానులు, రెస్టారెంట్ల యజమానులు తక్కువ వేతనాలతో బాలకార్మికుల చేత ఎక్కువ పనిచేస్తున్నారు. వారి శ్రమ ద్వారా అధికంగా లాభం పొందుతున్నారు.

బాలలు మాత్రం శ్రమ దోపిడీకి గురవుతున్నారు. భారతదేశంలో : భారతదే శంలో పేదరికం, అధిక నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటి కారణాలతో లక్షలాది మంది పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. సేవ్ ది చిల్డ్రన్స్ నివేదిక ప్రకారం 14 -17 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు ప్రమాదకరమైన పనుల్లో ఉన్నారు. భారత శ్రామిక శక్తిలో బాల కార్మిక శక్తి 62.8 శాతంగా ఉంది. బాలికల కంటే బాలురు ఎక్కువగా ఉన్నారు. బాల కార్మికులు గ్రామీణ భారతంలో ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ 80% పిల్లలకు పని కల్పించింది. భారత దేశం వ్యవసాయ దేశం కావటం, అత్యధిక ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉండటమే అందుకు కారణం. పాలకుల విధానాల వల్ల గ్రామీణ ఉపాధి తగ్గుతూ ఉండటం వల్ల, బాల కార్మికులు గ్రామీణ ప్రాంతం నుంచి పెద్ద పట్టణాలకు వలసపోతున్నారు.

ఫలితంగా పట్టణాల్లో బాల కార్మికుల సంఖ్య పెరుగుతూ ఉంది. బాల కార్మికులపై జరిగిన ఒక అధ్యయనం ప్రకారం భారత దేశంలో 1,26,66,377 మంది బాల కార్మికులు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 19,27,997 ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో 10 లక్షల పైగా ఉన్నారు. భారత ప్రభుత్వ నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం దేశంలోని ముస్లిం జనాభాలోనే ఎక్కువ మంది బాల కార్మికులు ఉన్నారు. ఈ ఎక్కువ 40%గా ఉంది. అందుకు కారణం ఆర్థికంగా, సాంఘికంగా బాగా వెనుకబడి ఉండటం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటమే.

బాల కార్మికుల సమస్యలు: పిల్లలు బాల కార్మికులుగా మారటం వల్ల, వారిని బాల్యానికి దూరం చేస్తుంది. వారి భద్రత, శారీరక, మానసిక ఆరోగ్యం ప్రభావం చూపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వంద మంది పిల్లల్లో 16 మంది బాల కార్మికులుగా దోపిడీకి గురవుతున్నారు. గనులు, కర్మాగారాల్లో ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. అక్రమ రవాణా ద్వారా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. పిల్లలుగా విక్రయించబడుతున్నారు. కుటుంబ అప్పులు తీర్చటానికి పిల్లల చేత బలవంతంగా పని చేయిస్తున్నారు. గనుల్లో పని చేసే పిల్లలు సొరంగం కూలిపోవటం వల్ల, ప్రమాదవశాత్తు పేలుళ్లు జరగటం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదకర పదార్థాల వాసనలు పీల్చటం వల్ల ఊపిరి తిత్తుల వ్యాధులకు లోనవుతున్నారు. పెద్ద కార్మికులు ప్రవేశించలేని చిన్న సొరంగాల్లోకి బాల కార్మికులను పంపుతున్నారు.

ఫలితంగా వెన్నెముక గాయాలకు గురవుతున్నారు. నేరుగా నడవలేకపోతున్నారు. బాలికలు లైంగిక దోపిడీ గురికావటమే కాకుండా వ్యభిచారంలోకి లాగబడుతున్నారు. బాల కార్మిక (నిషేదం, నియంత్రణ) చట్టం1986లో ఈ చట్టం చేయబడింది. ఈ చట్టం 14 సంవత్సరాలు పూర్తి గాని పిల్లలను గుర్తించి, బాల కార్మికుల పని గంటలు, పని పరిస్థితులను నియంత్రించటం, ప్రమాదకరమైన పరిశ్రమల్లో బాల కార్మికులను ఉపయోగించకుండా నిషేధించటం ఈ చట్టం లక్ష్యం. ఈ చట్ట నిర్దేశాలు మాత్రం అమలు జరగటం లేదు. 14 సంవత్సరాల లోపు పిల్లలు అనేక పరిశ్రమల్లో బాల కార్మికులుగా పని చేస్తూనే ఉన్నారు.

బాల కార్మిక సవరణ చట్టం: 2016లో సవరించబడిన ఈ బాలకార్మిక చట్టం ఈ విధంగా పేర్కొంది. అన్ని వృత్తులలో పిల్లలచే పని చేయించటాన్ని నిషేధించటం, ప్రమాదర పనుల్లో, ప్రక్రియల్లో యుక్తవయస్కులు నిమగ్నమవ్వటాన్ని నిషేధించటంగా చెప్పింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన యజమానులకు కఠినమైన శిక్షలు విధిస్తుంది.అనేక సార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత చట్టంలో మరిన్ని సవరణలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. చైల్డ్ లేబర్ ( నిషేధం-, నియంత్రణ) సవరణ నియమాల కింద నిబంధనలు ఇలా ఉన్నాయి. పిల్లలు, కౌమార దశలో ఉన్న కార్మికుల నివారణ, నిషేధం, పునరావాసాన్ని విస్తృతం చేయటం, పని గంటలు, పని పరిస్థితులకు సంబంధించి చట్టప్రకారం పని చేయటానికి అనుమతించబడిన కార్మికుల రక్షణ కల్పించటం.

బాల కార్మికుల కోసం చేసిన కార్మిక చట్టాలు, వారి హక్కుల కోసం చేసిన చట్టాలు ఏవీ ఆచరణలో అమలు జరగటం లేదు. ప్రభుత్వాలు చట్టాలు చేయటానికే పరిమితం అవుతూ ఆచరణను పక్కన పెడుతున్నాయి. అసలు చట్టాల పట్ల పాలకులకు చిత్తశుద్ధే లేదు. అందువల్ల పాలక ప్రభుత్వాలు చేసిన చట్టాలు, బాల కార్మికులకు నిరుపయోగంగా మారాయి. చట్ట విరుద్ధంగా బాల కార్మికుల చేత పని చేయిస్తున్న ఫ్యాక్టరీల యజమానులు సంపన్న కుటుంబాల యజమానులు ఎటువంటి శిక్షలకు గురికావటం లేదు. పేదరికానికి, బాల కార్మిక వ్యవస్థకు అవినాభావ సంబంధం ఉంది. పేదరికం పోకుండా బాల కార్మిక వ్యవస్థ తొలగిపోదు. పేద కుటుంబాలు, తమ ఆర్థిక పరిస్థితుల వల్లే పిల్లలను పనులకు పంపుతున్నారు. పేదల ఆర్థిక పరిస్థితి మారితే, వారి పిల్లలు బాలకార్మికులుగా మారరు. అందుకు పేదలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు పరిష్కారం కావాలి. గ్రామీణ పేదలకు భూమి పంపిణీ జరగాలి. ఫ్యాక్టరీల్లో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. గ్రామీణ, పట్టణ పేదలకు ఉపాధి కల్పించాలి. నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి. పాలకుల వర్గ స్వభావం ఇందుకు విరుద్ధమైంది. గ్రామీణ, పట్టణ పేదలు ఐక్యంగా ఉద్యమించటం ద్వారా వాటిని సాధించుకోవాలి.

బొల్లిముంత సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News