Monday, January 6, 2025

సమైక్య భావనతోనే పురోగమనం

- Advertisement -
- Advertisement -

ఆనంద్, వజ్జిలు సామరస్యంగా జీవిస్తూ, సామరస్యంగా సమావేశమవుతూ సామరస్యపూర్వకమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారా? అంటూ గౌతమ బుద్ధుడు తన ప్రథమ శిష్యుడైన ఆనందున్ని అడిగాడు. చాలా గౌరవ పూర్వకంగా ఆనందుడు అవునని సమాధానమిచ్చాడు. ‘వజ్జిలు అటువంటి జీవనాన్ని సమైక్య భావనను కొనసాగించినంత కాలం వాళ్ళు పురోగమిస్తుంటారే తప్ప ఓటమి పొందలేదు’ అంటూ గౌతమ బుద్ధుడు నిర్ధారించాడు. అట్లానే వారి పిల్లలు, మహిళలు, వృద్ధులు, గురువుల పట్ల గౌరవం చూపుతారని, వారి సంక్షేమం వజ్జిలకు ప్రథమ ప్రాధాన్యత అవుతుందని కూడా గౌతమి బుద్ఢుడు ఆనందుని ద్వారా చెప్పించాడు.

ఇది నిజానికి గౌతమ బుద్ధుడు ఆనందునికి మధ్య జరిగిన సంభాషణ మాత్రమే కాదు, మగధ రాజ్యమంత్రి వస్యకారకు పరోక్షంగా వివరించిన నిజాలు. మగధ రాజు అజాతశత్రువు తన పొరుగున ఉన్న వైశాలి రాజధానిగా కొనసాగుతున్న వజ్జిల సమాఖ్య, లిచ్చలి తెగల రాజ్యాన్ని కబళించాలని ఆలోచించి గౌతమ బుద్ధుడు సలహా కోసం తన మంత్రి ఆయన దగ్గరికి పంపించారు. ఆ సమయంలో మగధ రాజధాని పాటలీపుత్రానికి సమీపంలోని రాజ్‌గిరిలో ఉంటున్నారు. అక్కడ వస్సకార సమక్షంలో జరిగిన సంభాషణ సారాంశమిది. వజ్జిలు అప్పుడు గణ రాజ్యపాలనలో ఉన్నారు. ప్రజలు ఎన్నుకున్న గణసభ అప్పుడు వజ్జి రాజ్యాన్ని పాలిస్తుండేది.

వజ్జలు అప్పుడు రాజరికంలో లేరు. ప్రజలందరి భాగస్వామ్యంలో వాళ్ళ ఎన్నుకున్న 700 మంది ప్రతినిధులతో నిత్యం సమావేశమవుతూ, సమష్టి నిర్ణయాలు తీసుకుని, సమిష్టిగా అమలు చేస్తూ, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను విజయవంతంగా కొనసాగించిన కాలమది. ఇది క్రీ.పూ. 6వ శతాబ్దంలో జరిగినట్టు బౌద్ధ సాహిత్యం ద్వారా మనకు తెలుస్తున్నది. ఈ రోజున మనం అమలు చేస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థకు వైశాలిలో కొనసాగిన గణ రాజ్య పాలన ప్రపంచంలోనే మొట్ట మొదటిదని చరిత్రకారులు చెబెతున్నారు. గ్రీకులోని ఎథెన్స్‌లో మొట్టమొదట డెమ్రోక్రసి అంటే ప్రజాస్వామ్యం అవతరించిందనే వాదన కూడా ఉంది. ఇవి రెండు కొద్దిగా అటుఇటుగా ప్రజాస్వామ్య వ్యవస్థలను అమలు చేశాయి.

ఎథెన్స్ కన్నా వైశాలి వంద సంవత్సరాల ముందరనే అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేసిందని కూడా చరిత్రకారుల అభిప్రాయం. ఇటీవల ఢిల్లీలో జరిగిన జి20 దేశాల సమావేశాల సందర్భంలో ‘భారత దేశం ప్రజాస్వామ్య వ్యవస్థకు తల్లి అంటూ ప్రకటించారు.

ఎథెన్స్, వైశాల వివాదం అట్లా ఉంచితే రెండు వ్యవస్థల ఆవిర్భావం విషయంలో ఎవరికి భేదాభిప్రాయాలు లేవు. బ్రిటిష్ పురాతత్వవేత్త లాండ్ కన్సింగ్ హామ్ జరిపిన తవ్వకాలలో వైశాలి గణ రాజ్య సభ భవనం అవశేషాలు బయటపడ్డాయి.
అటువంటి చరిత్ర కలిగిన ప్రదేశాన్ని నేను రెండు రోజుల క్రితం చూడడడం జరిగింది. బౌద్ధ అంతర్జాతీయ సమావేశానికి హాజరైన సందర్భంగా నాకు ఆ అవకాశం లభించింది. వైశాలి ఒక అరుదైన భారతీయ చరిత్ర వారసత్వ సంపద. చాలా మందికి ఈ తవ్వకాలు ఎలా జరిగాయనే అనుమానాలు ఉన్నాయి. ఒక్క ఇక్కడే కాదు. బౌద్ధానికి బుద్ధునికి సంబంధించిన అవశేషాలు ఎన్నో బయట పడ్డాయి.

గౌతమి బుద్ధుడు సంచరించిన ప్రదేశాలు, జన్మించిన, నిర్వాణం పొందిన స్థలాలను గుర్తించడంలో సామ్రాట్ అశోకుని పాత్ర ఒక్కటే కారణం. అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించిన అనంతరం తన పాలనలో బౌద్ధ ధమ్మాన్ని (ధర్మాన్ని) అనుసరించడంలో పాటు బుద్ధుని చరిత్ర సర్వస్వాన్ని పరిరక్షించడానికి, భవిష్యత్ తరాలకు అందించడానికి 84 వేల స్థూపాలను నిర్మించినట్టు బౌద్ద సాహిత్యం ద్వారా తెలుస్తున్నది. అయితే కాలక్రమేణ దాడుల ద్వారాగానీ, నిర్లక్షం వల్లగానీ శిథిలమైపోయాయి. అయితే ఇవి బయటపడడానికి, ఎక్కడెక్కడ ఇది నిర్మాణమయ్యాయో తెలియడానికి దోహదపడిన అంశం చైనా యాత్రికులైన ఫాహియాన్, హుయాన్ త్సాంగ్ యాత్ర విశేషాలు. వాళ్ళు పర్యటించే నాటికి ఇవి సజీవంగా ఉన్నాయి. అవి వాళ్ళ రచనలలో పొందుపరచడం వల్ల ఆ వివరాలు లభించాయి. ఈ వివరాల ఆధారంగా జాన్, ఫిన్సిప్, లార్డ్ కన్నింగ్ హామ్‌లు ప్రస్తుతం మనం చూస్తున్న బౌద్ధ వారసత్వ స్థలాలలో తవ్వకాలు జరిపి చరిత్రను సృష్టించారు. చరిత్రను రక్షించారు. లార్డ్ కన్నింగ్ హామ్‌ను భారత పురాతత్వ రంగం పితామహుడుగా చెప్పుకుంటారు. అట్లా వైశాలి చరిత్ర భౌతికంగా మనకు ఈ రోజు కనిపిస్తున్నది.

గౌతమ బుద్ధునికి వైశాల నగరం మీద అమితమైన ప్రేమ ఉండేది. ఎందుకంటే ప్రజలందరు భాగస్వాములుగా నడుస్తున్న గణ రాజ్యం మీద కూడా ఆయనకు వాత్సల్యం. ఆయన జన్మించిన కపిలవస్తు కూడా గణ రాజ్యమే. దానికి సంబంధించిన విశేషాలను బౌద్ధ చరిత్రకారుడు, డి.డి. కోశాంబి, తండ్రి ధర్మానంద్ కోశాంబి, బాబాసాహెబ్ అంబేడ్కర్‌లు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. వైశాలి నగరం మీద ప్రేమతో గౌతమ బుద్ధుడు తన చివరి మజినీని వైశాలిని ఎన్నుకున్నాడు. తన మహాపరి నిర్వాణాన్ని ఆయన వైశాలిలోనే ప్రకటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. తాను కొద్ది నెలల్లోనే మహాపరి నిర్వాణాన్ని పొందబోతున్నానని ప్రకటించింది అక్కడే. ఆ సమయంలో ఇక్కడే గౌతమ బుద్ధుడు ముఖ్యమైన, చివరిదైన ప్రసంగాన్ని చేశారు.

దాదాపు అయిదు వందల మంది బిక్కులతో సమావేశమయ్యారు. నేను కొద్ది నెలల్లోనే మిమ్మల్ని విడిచి వెళ్లిపోతున్నాను. ఆ తర్వాత నేను మీతో ఉండను. ఏవైనా సందేహాలుంటే ఇప్పుడే అడగండడి” అంటూ ఆపారు. కాని ఎవరూ మాట్లాడలేదు. ప్రశ్నలు అడగలేదు. మళ్లీ పదేపదే గౌతమ బుద్ధుడు వారిని అడిగాడు. కానీ సమాధానం లేదు. అప్పుడు ఆనందుడు కలుగజేసుకొని “భంతే ప్రశ్నలు ఏమి లేవు గాని తర్వాత నాయకుడెవరు” అని అడిగాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు ధమ్మమ్ మీకు నాయకుడు. అందరూ ధమ్మాని మాత్రమే విశ్వసించాలి. అనుసరించాలి. మీలో మీరు తర్కించుకోవాలి. ధమ్మాన్ని వెలుగుగా మీలో మీరే ఆలోచించుకోవాలి” అంటూ ఉద్బోధించారు. దీని నుంచే ఒక సూక్తి బహుళ ప్రచారంలోకి వచ్చింది. నీకు నీవే యజమానివి, నీ భవిష్యత్తును నీవే నిర్మించుకో” అనే ఒక బ్రహ్మాండమైన తాత్వికతను గౌతమ బుద్ధుడు అందించింది వైశాలిలోనే.

అక్కడి నుంచి ఉత్తరం వైపు పయనించి కుష నగర్‌గా మనం పిలుస్తున్న ఆనాటి కుషి నగరానికి చేరుకొని తమ మహాపరి నిర్వాణాన్ని పొందారు. ఆయన పయనించిన మార్గాన్ని సూచించే విధంగా సామ్రాట్ అశోకుడు ఒక స్తంభాన్ని ఒకే సింహం ముఖంతో నిర్మించారు. ఇక్కడ అశోకుని స్తంభం ఒక సింహం ముఖంతోనే ఉంటుంది. ఆ సింహం ముఖం కుషి నగర్ వైపుకు ఉంటుంది.

వైశాలికి దక్కిన మరో అరుదైన గౌరవం బుద్ధుడి తన అన్న పాత్రను వైశాలి గణ సభకు ఇచ్చి వెళ్లాడు. బౌద్ధంలో మరో ముఖ్య ఘట్టమైన మహిళలను సంఘంలో చేర్చుకోవడం ఇక్కడ ప్రారంభమైంది. వైశాలి గణ రాజ్య రాజనర్తికి ఆమ్రపాలితో పాటు గౌతమ బుద్ధుని పెంపుడు తల్లి మహా ప్రజాపతి గౌతమి, గౌతమ బుద్ధుని భార్య యశోధరలు బిక్కునిలుగా మారింది అక్కడే. అదే విధంగా గౌతమ బుద్ధుని ప్రథమ శిష్యుని స్థూపం ఇక్కడే అశోకుడు నిర్మించారు. అదే విధంగా గౌతమ బుద్ధుని మహా పరి నిర్వాణ అనంతరం ఆయన అస్థికలను ఎనిమిది భాగాలుగా చేశారు. అందులో ఒక భాగం వజ్జిలకు, వైశాలికి ఇచ్చారు. అటువంటి పవిత్రమైన అస్థికలను వజ్జిలు చాలా సురక్షితంగా మట్టి స్థూపం నిర్మించి అందులో భద్రపరిచారు. ఆ అవశేషాలు కూడా మనకు అక్కడ దర్శనమిస్తాయి.

అయితే భారత దేశ చరిత్రకారులు మన దేశ వారసత్వ సంపదను పరిరక్షించడంలో చూపుతున్న అశ్రద్ధ క్షమించరానిది. మన వారసత్వాన్ని భౌతికంగా గాని, మేధోపరంగా గాని సొంతం చేసుకోలేకపోయారు. గ్రీకులు వాళ్ల ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంతో ఉన్నతంగా నిలబెట్టుకున్నారు. అటువంటి విషయాల మీద ఎన్నో అధ్యయనాలు జరిపి ప్రజాస్వామ్యమంటే గ్రీకుల శక్తిగా చెప్పుకుంటున్నారు. గ్రీకులు ముందుగా మనం గణ రాజ్యాన్ని స్థాపించి ప్రజాస్వామ్య వ్యవస్థకు తల్లిగా విలసిల్లిన ఆ వారసత్వాన్ని మనం సొంతం చేసుకోలేకపోయాం. పైగా బ్రిటిష్ పరిశోధకులు వచ్చేంత వరకు అశోక్ సామ్రాట్ గురించే మనకు తెలియదు. శ్రీలంకలోని మహవంశం, దీప వంశం లాంటి పుస్తకాల్లో అశోకుడి గురించి ఉన్నదని తెలిపిన బ్రిటిష్ పరిశోధకులకు మనం ఎంతైనా రుణపడి ఉన్నాం.

బౌద్ధ వారసత్వాన్ని, బౌద్ధం అందించిన జ్ఞానాన్ని ధ్వంసం చేయడంలోనే మన గత శాస్త్రకారులు, చరిత్రకారులు దృష్టి పెట్టారు. ఇప్పుడిప్పుడే ఆ సత్యాలన్ని బయటకొస్తుంటే మళ్లీ దాన్ని ఇంకొక రకంగా వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా వైశాలి అందించిన వారసత్వాలను మనం పదిల పరచుకోవడానికి కృషి చేయాలి. చివరిగా ఇంకొక మాట చెప్పాలి. బౌద్ధంతో పాటు, జైనం కూడా భారత దేశంలో ఎన్నో తాత్విక విషయాలను అందించింది. అటువంటి జైన మత తీర్థంకరుల్లో ప్రముఖడైన మహావీరుడు జన్మించింది వైశాలిలోనే. అందువల్ల వైశాలి ఘనమైన భారతీయ వారసత్వ సంపద సంగమ స్థలం.

మల్లేపల్లి లక్ష్మయ్య

దర్పణం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News