గ్రామ గ్రామానా తెలంగాణ తల్లి విగ్రహాలను
ప్రతిష్టించే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం
తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో
బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత
మనతెలంగాణ/హైదరాబాద్: ఉద్యమకాలం నాటి నుంచి తెలంగాణ తల్లినే తాము ఆరాధిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాలను గ్రామ గ్రామానా ప్రతిష్టించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. బతుకమ్మ అగ్రవర్ణాల పండుగ అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ జాతికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం, బతుకమ్మను కించపరిచే విధంగా కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలు చేయడం నేపథ్యంలో తెలంగాణ అస్తిత్వంపై శనివారం నాడు తెలంగాణ జాగృతి సంస్థ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు.
ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ, మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టి సిఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారని విమర్శించారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లుంటుందని అన్నారు. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది… అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ అని, అలాంటి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే తెలంగాణ సమాజంలో స్నేహశీలత, సుహృధ్భావం ఎలా కనిపిస్తుంది ..? అని ప్రశ్నించారు. మహిళలు జరుపుకునే బతుకమ్మను ముఖ్యమంత్రి అవమానించిన విషయం సోనియాగాంధీకి తెలిసిందా లేదా..?.. లేదంటే ఆమె సమ్మితితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారా అన్నది సోనియాగాంధీ తెలంగాణ సమాజానికి చెప్పాలని ఎంఎల్‌సి కవిత డిమాండ్ చేశారు.
ప్రియాంకా గాంధీ కేరళ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు కాబట్టి అక్కడి చీర కట్టుకొని పార్లమెంటులో మాట్లాడారని, మరి తెలంగాణ సిఎం బతుకమ్మను అవమానం చేస్తూ తెలంగాణ తల్లి చేతుల్లోని బతుకమ్మను మాయం చేశారని, దీనికి ప్రియాంకా గాంధీ మద్ధతిస్తున్నారా..? అని ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వచ్చి గ్యారంటీ కార్డులపై సంతకాలు చేసి తెలంగాణ ప్రజలను గౌరవిస్తామని చెబితే ప్రజలు నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లు చేశారని అన్నారు. బిసి వర్గాలకు చెందిన మహేశ్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నా కూడా బహుజనులను కించపరిచే విధంగా మాట్లాడిన ఎంఎల్‌ఎపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నడూ జై తెలంగాణ అని అనని వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమని పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదని, ఆయన ఉద్యమంలో లేరు కాబట్టి తెలంగాణ హృదయం అర్థమవ్వడం లేదని చెప్పారు.
బతుకమ్మ పూర్తిగా బహుజన కులాల పండుగ: దేశపతి శ్రీనివాస్
బతుకమ్మ పూర్తిగా బహుజన కులాల పండుగ అని, అగ్రవర్గాల పండుగ కానేకాదు బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సిఎం రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణ తల్లిపైనే కాకుండా బతుకమ్మపై కూడా దాడి చేస్తున్నారని విమర్శించారు. ఆదిమ సంస్కృతి నుంచి వచ్చిన బతుకమ్మ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమని చెప్పారు.
శిల్ప శాస్త్రం ప్రకారం కెసిఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారు: ఎంఎల్‌సి వాణిదేవి
శిల్ప శాస్త్రం ప్రకారం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి వాణిదేవి తెలిపారు. తెలంగాణ తల్లి గొప్పగా ఉండాలి.. కానీ బీదగా ఉండవద్దని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసే కుట్ర చేస్తున్నది ఆరోపించారు.
చేతి గుర్తు కోసం.. బతుకమ్మను మాయం చేశారు: వీ ప్రకాశ్
చేతి గుర్తు కోసం తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను మాయం చేశారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్ ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సచివాలయంలోపల తెలంగాణ తల్లిని బంధీ చేశారని అన్నారు.
సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు
ప్రస్తుతం రేవంత్ రెడ్డి రూపొందించిన విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు. ఒక చేతిలో జొన్నకర్ర, మరొక చేతిలో బతుకమ్మ ధరించిన తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు, కవితలు రచించి పుస్తకాలు వెలువరిస్తామని, పిల్లలు వాడే నోట్ బుక్స్, రైటింగ్ ప్యాడ్స్ అన్నింటిపై తెలంగాణ తల్లిని ముద్రించి పిల్లలకు ఇచ్చే ప్రయత్నం చేస్తామని తీర్మానించారు. తెలంగాణ తల్లికి ఆరాధానతో కార్యక్రం మొదలుపెట్టే సంప్రదాయాన్ని ఇకముందూ కొనసాగిస్తామని తీర్మానం చేశారు.