గురుకులాల్లో చిన్నారులు చనిపోతే ఎవరిది బాధ్యత?
గురుకులాల ప్రక్షాళనకు సర్కార్ సిద్ధం
విద్యార్థులతో మెస్ కమిటీలు వేయండి
చిలుకూరు గురుకుల పాఠశాలలో కామన్ డైట్ ప్లాన్
ప్రారంభించిన అనంతరం సిఎం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సంబంధించిన నిధులు ప్రతి నెల 10లోపు గ్రీన్‌ఛానల్ ద్వారా వస్తాయని ముఖ్యమంత్రి రేవల్ రెడ్డి ప్రకటించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఉచితంగా కరెంట్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రతి రోజు అధికారులు డైట్ తిని, నాణ్యత చూడాలని సూచించామని చెప్పారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని శనివారం హైదరాబాద్ చేరుకున్న సిఎం నేరుగా రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను సందర్శించారు.
అనంతరం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుండి తాను ఎక్కడికి వెళ్ళినా గురుకులాలను సందర్శిస్తానని, తప్పు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ ప్రభుత్వం గురుకులాల డైట్ ఛార్జీలు ఇటీవల పెంచిందని గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు గురుకులాల విద్యార్థుల కంటే ఎక్కువనే భావన ఉందని, గురుకులాలు అంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలని ముఖ్యమంత్రి అన్నారు. గురుకులాల వ్యవస్థను పివి నరసింహారావు హయాంలో తెచ్చారని, టిజిపిఎస్సి ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఒకప్పటి గురుకుల విద్యార్థేనని, మాజీ డిజిపి మహేందర్ రెడ్డి కూడా గురుకులాల విద్యార్తేనని సిఎం తెలిపారు. గురుకులాల విద్యార్థులు ఎందరో ఉన్నతస్థాయికి వెళ్లారని ఆయనన్నారు.
గురుకులాల ప్రక్షాళన కోసం ప్రభుత్వం సిద్ధం:
ప్రైవేట్ స్కూళ్లు వచ్చాక కొంతవరకు గురుకులాల ప్రభావం తగ్గిందని ముఖ్యమంత్రి అన్నారు. గురుకులాల ప్రక్షాళన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. పదేళ్లుగా బిఆర్ఎస్ ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచలేదన్న ముఖ్యమంత్రి తాము అధికారంలోకి వచ్చాక గురుకులాల డైట్ ఛార్జీలు పెంచామని చెప్పారు. 40 శాతం డైట్ ఛార్జీలు, 200 శాతం కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం చరిత్ర అని ఆయనన్నారు. 16 ఏళ్లలో ఒక్కసారైనా కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్రంలో 26వేల ప్రభుత్వ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని సిఎం తెలిపారు. 26 వేల ప్రభుత్వ స్కూళ్లల్లో 11లక్షల మంది చదువుతుంటే.. తక్కువ ఉన్న ప్రైవేట్ స్కూళ్లల్లో 33 లక్షల మంది చదువుతున్నారని సిఎం అన్నారు. తక్కువగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లల్లో ఎక్కువమంది చదువుతున్నారని అన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో టీచర్లు ఆలోచించాలని సిఎం రేవంత్ తెలిపారు. చదువుపై పెట్టే పెట్టుబడి భవిష్యత్ పై పెట్టేదే అని రేవంత్ అన్నారు. గురుకులాలు, హాస్టల్స్ లో విద్యార్థులు చనిపోతే బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సిఎం సూచించారు. డైట్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామన్నారు.
ఇక్కడి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలను హాస్టళ్లలో ఉంచుతున్నారని, తల్లిదండ్రులు మనలను నమ్మి పిల్లలను గురుకులాల్లో వేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల మృతిపై మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, సిబ్బందిపై ఉందన్నారు. గతంలో డైట్ విషయంలో బిల్లులు రాలేదని నాణ్యత తగ్గిస్తున్నామని చర్చలు జరిగాయని, ప్రతి నెల 10లోపు గ్రీన్‌ఛానల్ ద్వారా అన్ని విద్యాసంస్థలకు సంబంధించిన నిధులు వస్తాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఉచితంగా కరెంట్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. ప్రతి రోజు అధికారులు డైట్ తిని, నాణ్యత చూడాలని సూచించాం. అని రేవంత్ రెడ్డి అన్నారు.
స్కిల్ వర్సిటీ దేశానికే ఆదర్శం
రాష్ట్రంలో 75 ఐటీఐలను ఎటిసిలుగా అప్‌గ్రేడ్ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటిఐల్లో చేరితే కచ్చితంగా ఉద్యోగం వస్తుందని అవగాహన కల్పించాలని సిఎం అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలోనే యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ ఉందని గుర్తు చేశారు. స్కిల్స్ వర్సిటీ దేశానికే ఆదర్శమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భుత్వ విప్ ఎంఎల్‌సి పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంఎల్ఎ కాలె యాదయ్య, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.