మీ సుప్రీం లీడర్ సావర్కర్‌ను అవహేళన చేస్తున్నారు
రాజ్యాంగం తెరిస్తే గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ ఆలోచనలే అందులో కనిపిస్తాయి
ఏకలవ్యుడి బొటనవేలులా అన్ని వర్గాల వేళ్లను కత్తిరిస్తున్నారు
హథ్రాస్ దుండగులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు
రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఇండియా కూటమి ఏర్పాటు
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : రాజ్యాంగం ఆధునిక భారతావనికి సంబంధించిన ఒక సమగ్రపత్రం అని, అందులో ప్రాచీన భారతీయ విలువలు, ఆలోచనలు ఉన్నాయని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యంగానికి, మనుస్మృతికి మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోందన్నారు. మనుస్మృతి సిద్ధాంతాలను అనుసరించి రాజ్యాంగం ఉండాలని సావర్కర్ విశ్వసించారని, మనుస్మృతి రాజ్యాంగానికి అతీతమైనదని తన రచనల్లో చాలా స్పష్టంగా ఆయన పేర్కొన్నారని అన్నారు. ‘మీ సుప్రీం లీడర్ సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శిస్తే మీరు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. మీ సుప్రీం లీడర్‌ను అవహేళన చేసినట్టు అనిపించడం లేదా? మీ నాయకుడి మాటలను మీరు సపోర్ట్ చేస్తారా?’ అని బిజెపి ఎంపిలను రాహుల్ ప్రశ్నించారు.
భారత రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో రాహుల్ శనివారంనాడు పాల్గొన్నారు. రాజ్యాంగం తెరిచినప్పుడు అంబేద్కర్, మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచనలు, వారి మాటలు అందులో కనిపిస్తాయని అన్నారు. మన రాజ్యాంగం ఆలోచనల సమాహారమని, జీవిత తత్వశాస్త్రం, మన సంస్కృతికి సంబంధించిన ఆలోచనలో రాజ్యాంగంలో ప్రతిబింబిస్తాయని చెప్పారు. గురువు ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు బొటనవేలును గురుదక్షిణగా సమర్పించిన కథను రాహుల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘మీరు అగ్నివీర్‌ను అమలు చేసినప్పుడు యువకుల బొటనవేళ్లు కత్తిరించారు. దేశవ్యాప్తంగా 70 పేపర్ లీకేజీలు జరిగాయి. అదానీకి ధారావి ప్రాజెక్టును అప్పగించినప్పుడు ఇక్కడి చిన్న, మధ్య తరహా వ్యాపారుల బొటనవేళ్లను కోసేశారు. దేశంలోని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రక్షణ పరిశ్రమను అదానీకి అప్పగించినప్పుడు దేశంలో నిజాయితీగా పనిచేసే వ్యాపారుల వేళ్లు కత్తిరించారు. ఇవాళ ఢిల్లీ వెలుపల రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. రైతులపై లాఠీలు ఝళిపిస్తున్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా‘ అని రాహుల్ దుయ్యబట్టారు.
హథ్రాస్ బాధితురాలికి ఆరేళ్లుగా న్యాయమేదీ..?
హాథ్రాస్ సామూహిక అత్యాచార బాధితురాలి ఇంటికి వెళ్లి తాను పరామర్శించానని రాహుల్ చెప్పారు. .నేరానికి పాల్పడిన వారు నిర్భయంగా ఇప్పుడు వీధుల్లో తిరుగుతున్నారని, బాధితులు మాత్రం ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉందన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తోంది… బీజేపీ మాత్రం దానిపై దాడి చేస్తూనే ఉంది అని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే కచ్చితంగా కులగణన చేపడతామని పునరుద్ఘాటించారు. కలిసికట్టుగా రాజ్యాంగ పరిరక్షణ ఆలోచనతోనే ‘ఇండియా’ కూటమి ఏర్పాటైందని, ఇవాళ రాజకీయ సమానత్వం లేదని, దేశంలోని సంస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్నారని, సామాజిక సమానత్వం లేదని, ఆర్థిక సమానత్వం అంతకంటే లేదని రాహుల్ విమర్శించారు. ఆ కారణంగానే కులగణనతో తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తద్వారా కొత్త తరహాలో రాజకీయాలు జరగనున్నాయని, 50 శాతం రిజర్వేషన్ గోడలు బద్ధలుకొడతామని స్పష్టం చేశారు.
రాజ్యాంగ రూపకల్పనలో ఆర్‌ఎస్‌ఎస్ సహకారం ఎంత?: డిఎంకె నేత రాజా
రాజ్యాంగ రూపకల్పనలో ఆర్‌ఎస్‌ఎస్, హిందూమహాసభ ఎంతవరకు తమ సహకారం అందించాయో చెప్పాలని డిఎంకె నేత ఎ. రాజా బిజెపిని నిలదీశారు. రాజ్యాంగంపై చర్చలో ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీ కాలంలో మీసా(మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ) చట్టం అమలులోకి తెచ్చినప్పుడు ప్రజాసావమ్యంపై మాత్రమే దాడి జరగ్గా, బీజేపీ నేతృత్వం లోని ప్రభుత్వంలో మొత్తం రాజ్యాంగం మౌలిక వ్యవస్థ పైనే దాడి జరిగిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, చట్టం పాలన, , సమానత, ఫెడరలిజం, న్యాయ నిష్పాక్షికత, ఇలా మొత్తం తుడిచిపెట్టుకుపోయాయని విమర్శించారు.
రాజ్యాంగంపై దాడిచేసినవారే చాంపియన్లుగా నటన: తేజస్వి సూర్య
రాజ్యాంగంపై రెండో రోజు చర్చలో పాల్గొన్న బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. రాజ్యాంగంపై దాడి చేసిన వారే ఇప్పుడు చాంపియన్లుగా నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగానికి రక్ష, ప్రాంతీయ సమగ్రత బీజేపీయేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ వంటి ఇతర పార్టీలు భారతదేశాన్ని నాగరిక దేశంగా పరిగణించకుండా రాష్ట్రాల కలగూరగంపగా భావిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగంలో సోషలిస్టు, సెక్యులర్ పదాలను చేర్చడానికి ప్రయత్నించడం మరింత కఠినత్వం చేయడమేనని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ కూడా ఆనాడు దీనికి వ్యతిరేకించారని ఉదహరించారు.