విహెచ్‌పి కార్యక్రమంలో వ్యాఖ్యల నేపథ్యం
న్యూఢిల్లీ : ఒక విహెచ్‌పి కార్యక్రమంలో వివాదాస్పద ప్రకటనలు చేసినట్లుగా భావిస్తున్న జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఆ వివాదంపై తన వైఖరి వివరించేందుకు త్వరలో సుప్రీం కోర్టు కొలీజియం ముందు హాజరు కావచ్చు. శేఖర్ యాదవ్ ప్రకటనలపై పత్రికా వార్తలను సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 10న పరిగణనలోకి తీసుకుని, మొత్తం వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు నుంచి నివేదికను కోరింది. ‘అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఇచ్చిన ఉపన్యాసానికి సంబంధించిన పత్రికా వార్తలను సుప్రీం కోర్లు పరిగణనలోకి తీసుకున్నది.
హైకోర్టు నుంచి వివరాలు కోరింది. ఆ విషయం పరిశీలనలో ఉంది’ అని అధికార ప్రకటన తెలియజేసింది. ఆనవాయితీ ప్రకారం, సంబంధిత హైకోర్టు నుంచి ఏదైనా వివాదాస్పద అంశంపై సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం ఎవరిపై నివేదిక కోరిందో సదరు న్యాయమూర్తికి భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సారథ్యంలోని సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం ముందు తన అభిప్రాయం వినిపించేందుకు అవకాశం ఇస్తారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిని ఆనవాయితీ ప్రకారం కొలీజియం ముందు హాజరై, తన అభిప్రాయం వినిపించాలని కోరవచ్చు. ఈ నెల 8న విహెచ్‌పి కార్యక్రమంలో జస్టిస్ యాదవ్ మాట్లాడుతూ, ఏక శిక్షా స్మృతి (యుసిసి) ప్రధాన లక్షం సామాజిక సామరస్యం, లింగ సమానత్వం, లౌకికవాదం పెంపొందించడమేనని చెప్పారు.