Monday, December 16, 2024

భక్తులతో పోటెత్తిన యాదగిరిగుట్ట

- Advertisement -
- Advertisement -

స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
స్వామివారి నిత్యరాబడి రూ.57.65 లక్షలు

మనతెలంగాణ/యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆదివారం యాదగిరికొండ నిండిపోయింది. యాదగిరి కొండపైన, కొండ కింద పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీసత్యనారాయణస్వామి వారి వ్రత పూజలలో భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ఆదివారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం, అర్చనను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతించారు. అనంతరం ఆలయంలో జరిగిన శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, నిత్యబ్రహ్మోత్సవం, వెండి జోడి సేవ, స్వర్ణపుష్పార్చన పూజలలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి, అమ్మవార్ల శీఘ్రదర్శనం 5 గంటలు, అతిశీఘ్రదర్శనం 4 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. యాదాద్రి కొండపైన దర్శన క్యూలైన్లతో పాటు ప్రసాద విక్రయ కేంద్రం, శివాలయం, పలు కూడళ్లలో భక్తుల సందడి నెలకొంది. కార్తీకమాసం సందర్భంగా యాదగిరిగుట్ట కొండపైన కొలువైన శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకొని తరించారు.

శ్రీనారసింహుడి నిత్యరాబడి..

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి నిత్యరాబడిలో భాగంగా ఆదివారం రూ.57,65,859 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.7,24,300, బ్రేక్ దర్శనం ద్వారా రూ.3,62,100, వీఐపీ దర్శనం ద్వారా రూ.5,20,350, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.7,00,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.97,000, ప్రసాద విక్రయం ద్వారా రూ.21,79,740, కల్యాణకట్ట ద్వారా రూ.1,10,000తో పాటు వివిధ శాఖలు, పాతగుట్ట ఆలయం ద్వారా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

యాదగిరీశుడి సేవలో హైకోర్టు జడ్జి..

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్‌వీ శ్రవణ్‌కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చిన ఆయన ముందుగా శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజలలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ శ్రవణ్‌కుమార్‌కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఈవో భాస్కర్‌రావు స్వామి వారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News