ప్రజలు చరమగీతం పాడినా
బిఆర్ఎస్లో, కెసిఆర్లో మార్పు
రాలేదు దళితుడిని సిఎంను
చేస్తానని చెప్పి తిమ్మిని బమ్మిని
చేసి అందలం ఎక్కింది మీరే
మీ పాలనలో టెన్త్ నుంచి
ఉద్యోగ పరీక్షల వరకు అన్నీ
అవకతవకలే తొలి ఏడాదిలోనే
జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన
ఘనత మాదే ప్రతిపక్ష నేతగా
కెసిఆర్ అసెంబ్లీకి రావాలి
బహిరంగలేఖలో పిసిసి సారథి
మహేశ్‌కుమార్‌గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: నాటి పెత్తందారు బిఆర్ఎస్ ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు వారి పాలనకు చరమగీతం పాడినా కెసిఆర్లో గానీ, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతల్లో కానీ, ఎలాంటి మార్పు రాలేదని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే ఓర్వలేక బిఆర్ఎస్ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇదే పంథాలో సాగితే ప్రజలు మీకు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా బిఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చేందుకు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్‌కు ఆదివారం మహేశ్‌కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు.
తిమ్మిని బమ్మిని చేసిసిఎంగా అందలమెక్కారు…
తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పి తిమ్మిని బమ్మిని చేసి మీరే సిఎంగా అందలమెక్కారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఉద్యమించిన మీరు పీఠమెక్కాక మాయమాటలతో పాలించారు. కుటుంబ పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని మీ కుటుంబ సభ్యుల కబంధ హస్తాల్లో బంధించి, మీరు చేసిన ఆరాచకాన్ని ప్రజలు ఎన్నటికీ మరవలేరు.
జాబ్ క్యాలండర్ ఇచ్చిన ఘనత మాదే..
మీ అల్లుడు హరీశ్‌రావు పెట్రోల్ డబ్బాతో, అగ్గిపులతో డ్రామాలు చేసి అమాయక యువతను బలిదానాలవైపు ప్రోత్సహించారన్నది వాస్తవం కాదా? అని కెసిఆర్‌ను లేఖలో మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మీ కుటుంబ రాజకీయ ఉపాధి కల్పించుకున్నారన్నారు. మీ హయాంలో ఇచ్చిన అరకొర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను పూర్తి చేయలేకపోయారన్నారు. నోటిఫికేషన్ ఇచ్చాక మీ అనుచరులతోనే కోర్టుల్లో కేసులు వేయించి ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పదో తరగతి మొదలు గ్రూప్-1 పరీక్షల వరకు అన్నింటా అవకతవకలు, గందరగోళమేనని ఆయన ఆ లేఖలో గుర్తుచేశారు.
మీ పాలనకు భిన్నంగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలండర్ విడుదల చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని ఆయన స్పష్టంచేశారు. మీ హయాంలో అవినీతిమయమైన టిజిపిఎస్సీని ప్రక్షాళన చేయడమే కాకుండా గ్రూప్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో 54 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు నెలకొల్పామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్, ఆయన అనుచరులకు ఒక ఏటిఎంలా మారిందన్నది అక్షరాల సత్యమని ఆయన స్పష్టంచేశారు. ఇలా మీరు చేసిన దౌర్భాగ్యపు పనులను ఒక్కోక్కటి చక్కదిద్దుటుంటే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన మీరు మాపై మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలను ఉసిగొల్పడం సమంజసమానని కెసిఆర్‌ను లేఖలో మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
కెసిఆర్ ఫాంహౌస్‌కు ఎందుకు పరిమితమయ్యారు…
అధికారంలో ఉన్న పదేళ్లు పలు మీడియా సమావేశాలు నిర్వహించి కాకమ్మ కథలు చెప్పిన మీరు, ఇప్పుడు మౌనవ్రతం చేపట్టి ఫాంహౌస్ ఎందుకు పరిమితమయ్యారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని కెసిఆర్‌కు మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి మీ సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుందని పిసిసి అధ్యక్షుడు హితవు పలికారు. కానీ మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజారంజక కార్యక్రమాలను విమర్శిస్తూ పోతే ప్రజలు హర్షించరని, తరిమి కొడుతారని మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ తల్లి రూపురేఖలపై విమర్శలు చేయడం మీ దిగజారుడు తనానికి నిదర్శనమని ఆయన చురకలంటించారు. మూసీ సుందరీకరణపైనా అసత్య ఆరోపణలు చేయడం తగదని ఆయన ఆ లేఖలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారన్న వాస్తవాన్ని తెలుసుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టంచేశారు. ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికైనా అవాకులు చవాకులు చేయడం మాని ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ
వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌లో భాగంగా రూ.21 వేల కోట్లు రైతు రుణ మాఫీ చేశామన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు రుణమాఫీ సహాయాన్ని పొందడాన్ని తాము గర్వంగా భావిస్తున్నామన్నారు. ఖరీఫ్ సీజన్లో 66.76 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసేలా సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది ఆయన తెలిపారు. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ల రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మీరు మార్చింది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవ సుందరీకరణలో అవినీతి జరిగిందని మీ పుత్రరత్నం గగ్గోలు పెడుతున్నారన్నారు. ఈ ప్రాజెక్టు డిపిఆర్ కోసం రూ.150 కోట్లే ఖర్చు చేశామని, మూసీ కోసం అదనంగా ఖర్చు చేయలేదని మీరు గుర్తించాలని పిసిసి అధ్యక్షుడు సూచించారు.