Monday, January 6, 2025

చాయ్‌తో ఊరట మెసేజ్‌లతో జీవనం

- Advertisement -
- Advertisement -

ఇంటా బయటా అడుగడుగున కనిపించే దృశ్యాలు చాయ్ చప్పరిస్తూ సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు చూస్తూ కలవరపడటం, ఆశ్చర్యపడటం, బాధపడటం, ఆనందపడటం. డిజిటలైజేషన్ పుణ్యమా అంటూ మనిషి జీవనయానం సెల్‌ఫోన్‌లో వొదిగిపోయింది. నిత్యజీవితంలో తరతరాలుగా చాయ్‌తో పెనువేసుకుపోయిన బంధం, సిఫ్ చేస్తూ ప్రపంచ వ్యాప్త సమాచారంతో ఆలోచనలకు పరిధి గీసుకుంటున్నాం. సాంఘిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలన్నీ కృత్రిమ మేధతో రూపుదిద్దుకుంటున్నాయి. చేయదలచుకున్న పని, ఎన్నుకోవలసిన మార్గం ఒకే ఒక్క ‘క్లిక్’తో వచ్చే సమాచారంతో ముడిపడి ఉంటున్నాయి. మెదడుకు పని కల్పించకుండా ఉన్నచోటి నుంచే ఖండాంతరాలు పయనిస్తున్నాం. పనికి వచ్చీరానీ సందేశాలు కళ్లను నమ్మింపజేస్తున్నాయి.

దీంతో ప్రయోజనాల కంటే అనర్థాలే ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. అలసిన మనస్సును కప్పు చాయ్‌తో ఊరడింప జేసుకుంటున్నాం. కానీ సెల్‌ఫోన్‌లో వచ్చే మెసేజ్‌లతో చాయ్‌లోని కమ్మదనం మటుమాయమై తీపి, చేదు, వెగటును పుట్టిస్తున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. ‘నిశి నక్షత్రాలను కాంచలేడు, బంగారు కాంతిని దర్శించలేడు’ అంటూ యాంత్రికమైపోయిన జీవితంలో భాగంగా ‘ఏమరుపాటుగా కుర్చీలో కూర్చొని, ఒక కప్పు చాయ్ సిఫ్ చేస్తూ, సెల్లో ఎంగిలి మెసేజ్‌లు చదువుతూ, కొత్త ప్రపంచంలోకి ప్రవేశం’ చేస్తున్న దృశ్యాన్ని తాజాగా వచ్చిన ‘ఒక కప్పు చాయ్ నాలుగు మెసేజ్‌లు’ కవితా సంపుటిలో జూకంటి జగన్నాథం మన ముందుంచాడు.

నాలుగు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్న జగన్నాథంకు ఇది 17వ కవితాసంపుటి. 1993లో ‘పాతాళ గరిగె’ కవితా సంపుటితో మొదలుపెట్టి, కాలం చేస్తున్న రకరకాల గారడీలను తన కవిత్వంతో చెప్పడం, హెచ్చరించడం, ఒక్కోసారి ధిక్కరిస్తూ సమాజానికి దిశ నిర్దేశం చేస్తున్నాడు. ధ్వంసమవుతున్న మానవ విలువలు, ప్రపంచీకరణ పరిణామాలు, ఓ మధ్య తరగతి కవి అంతఃసంఘర్షణ, సామాన్యుడి కన్నీటి దృశ్యాలు, వలస కుటుంబాల వెతలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, తెలంగాణ వెతలను రకరకాల కోణాల్లో కవిత్వీకరిస్తూ ప్రజల ముందు నిలబడ్డాడు. మారుతున్న కాలాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూ, ఎలా నడవాలో దారి చూపిస్తూ ఆయన కవిత్వం సాగుతోంది.

ప్రపంచీకరణ ప్రభావం, దేశీయ వృత్తి, ఉపాధులు గల్లంతై, వలసలు, రైతులు గోసలు, బతుకుదెరువు కోసం ఇతర దేశాలకు వలసపోయి ఇబ్బందులుపడుతున్న సంఘటనలు జగన్నాథంకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ‘వాళ్లు ఏమి అడిగారు’ అనే కవిత ద్వారా ఇచ్చిన హామీలను, వాగ్దానాలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నాడు. నేల మీద నిలిచి నింగివైపు దృష్టి సారించి వర్తమానాన్ని సమీక్షించుకుంటూ మానవ పునరుజ్జీవనం కోరుకుంటున్న కవిత ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’. ‘సహజత్వం చావు దెబ్బతిన్నది, అసహజత్వం అందలమెక్కింది’ అని చెబుతూ ‘మనిషిని ఉన్నతుడ్ని చేయాలి కానీ, మనిషి మనసును అమాంతం మింగేసేలా, మర మనిషిని సృష్టించుకోవడమే పెను విషాదం’గా భావించాడు. ‘వయ్యి పడిపోయిన నుయ్యిలోంచి, నన్ను తీసి ప్రాణమిచ్చిన చెయ్యి, ముడి ఖనిజంలాటి నన్ను, అక్షరాల సుత్తె దెబ్బల ఉలితో, పదిమందికి ఉపయోగపడేలా, చెక్కిన వడి శిల్పాన్ని’ అని ఆత్మవిశ్వాసంతో ప్రకటించుకుంటాడు.

న్యాయంగా తోచని ప్రతిదాన్ని ప్రశ్నిస్తాడు. సామాజిక నిబద్ధత గురించి కూడా ఎక్కువగా మాట్లాడింది తానే. తన జీవిత సూత్రాన్ని స్పష్టంగా చెబుతాడు. సెలవులేదు, మాట్లాడుకోవాలి, కాలం ఒక ప్రవక్త, గుడ్డి కొంగలు, పైసల బతుకమ్మ తదితర కవితలు మానసిక వ్యవస్థలు కల్పించే భ్రమలపై దునుమాడడం జగన్నాథం కవిత్వంలో కనిపిస్తుంది. జన జీవితంలోని వైరుధ్యాలను బయటకు తెచ్చి ప్రజలను పీడించే దుష్ట వ్యవస్థను అంతం చేయడానికి కవిత్వాన్ని ఉద్యమంగా చేసుకున్నాడు. ఆలోచనా సరళి, ఆచరణ శీలతలో మార్పులు తీసుకు వస్తాయనే ఆరాటం కలవాడు. వాడుక భాషతోనే సామాజిక సత్యాన్ని తెలియజెప్పిన కవితా సంపుటి ఇది. వ్యక్తుల జీవితాలను యథాతథంగా ఆవిష్కరించడం జూకంటికి అలవాటు. తనలో జరుగుతున్న సంఘర్షణను రాజీ లేకుండా కవిత్వీకరిస్తున్న కవులలో అతను ముందున్నాడు.

ఖమ్మం ఈస్థటిక్స్ వారి ఉత్తమ కవిత సంపుటి పురస్కారం ఈసారి “ఒక కప్పు చాయ్ నాలుగు మెసేజీలు” జూకంటి జగన్నాథం సంకలనానికి అందజేశారు

కోడం పవన్‌కుమార్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News