Monday, December 16, 2024

పుస్తకాల దీపాల వైపు

- Advertisement -
- Advertisement -

‘పుస్తకాలు దీపాలవంటివి. వాటి వెలుతురు మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తాయి’-డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
హైదరాబాద్ బుక్ ఫెయిర్ డిసెంబర్ 19 నుండి మొదలై 29 వరకు జరుగుబోతోంది. ఇది 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్. ఈ సందర్భంగా 350 పుస్తకాల స్టాల్స్‌లో వందల వేల పుస్తకాలు కొలువుదీరనున్నాయి. ఆ పది రోజులు పుస్తకాల పండుగే. మరో వైపు పుస్తకాలు, వాటి అవసరం, ప్రాధాన్యత, వాటి ప్రభావం ఇత్యాది అంశాలపై ప్రసంగాలు ఉంటాయి. ఇంకోవైపు కొత్త పుస్తకాలు, వాటి ఆవిష్కరణలు అదొక సందడి. బుక్ ఫెయిర్‌లో అందరం కలుసుకుంటాం. కబుర్లు, కొత్తగా అప్పుడే పరిచయమయ్యేవాళ్ళు కొందరైతే, ఎప్పట్నుంచో పేరు వింటూ, వారి రచనలు చదువుతూనే ఉన్నా మునుపు కలుసుకోకుండా ఉన్నవాళ్లు, హఠాత్తుగా బుక్ ఫెయిర్‌లో కనపడేవాళ్ళు కొందరు. ఆ పది రోజులూ పది సెకన్లలా గడిచిపోతాయి.
ఇదంతా పుస్తకాల సంరంభం. సంబురం. ఈ ఆధునిక యుగంలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకూ అందరూ టివి, సెల్, ఇంటర్నెట్‌కు అలవాటుపడిపోయి పుస్తకపఠనం మరచిపోతున్నారు. ‘చిరిగిన చొక్కానైనా తొడుక్కో గానీ ఓ మంచి పుస్తకం కొనుక్కోమని’ పుస్తకాలప్రాధాన్యత గురించిన చెప్పిన మంచి మాట. ఆధునికత పేరుతో ఎన్ని వచ్చినా పుస్తక పఠనానికి అవేమీ సరిరావు. పుస్తకాల అధ్యయనం ఒక తపన, తీరని విజ్ఞాన దాహం. పుస్తకం జీవితాన్ని ఆదర్శంగా నడిపించే నిజమైన చోదకశక్తి. పుస్తకానికి, దాని ద్వారా ఆర్జించిన విజ్ఞానానికి మరణం లేదు. పుస్తక అధ్యయనం వికాసాన్ని, విజ్ఞానాన్ని ఈ సమాజానికి అందిస్తుంది. మనిషిలో ఒత్తిడి తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. పఠనం వివిధ భాషలపై పట్టును పెంచుతుంది.
ఈ రోజుల్లో ప్రపంచ వీక్షణానికి పుస్తకం తొలిమెట్టు. పుస్తకపఠనం వల్ల ఉన్న చోటినుంచే ఈ ప్రపంచాన్ని చూడగలం. పుస్తక పఠనం లేకపోతే ఈ సమాజం కలం లేని, కాగితంలేని మేధస్సు లేని విధంగా నిర్జీవ సమాజంగా సాగుతుంది. సమాజం పునర్జీవం పొందాలంటే పుస్తకాలను చదవాల్సిందే. పుస్తకాలు మనిషిలోని భావాలకు, ఊహలకు అక్షర రూపం ఇచ్చి కవులుగా, రచయితలుగా, శాస్త్రవేత్తలుగా, సాహితీ వేత్తలుగా, మేధావులుగా తీర్చిదిద్దుతాయి. నిన్నటి చరిత్ర నుంచి రేపటి చరిత్రకు పుస్తకాలే ఊపిరి. ఈ పుస్తకాల ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. మానవ విలువలను పెంపొందించడానికి పుస్తకాలు ప్రేరణ కలిగిస్తాయి. పుస్తకం చదివితే విభిన్న వ్యక్తుల వ్యక్తిత్వాలు, ప్రదేశాలు వాటి వివరాలు వేర్వేరు కోణాల్లో వారివారి ఆలోచనలు, అభిప్రాయాలు తెలుస్తాయి. మంచి, చెడు, పెద్దలతో ఎలా నడుచుకోవాలో పుస్తక పఠనం ద్వారా తెలుస్తుందనేది సత్యం.
తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే చదివే అలవాటు చేయడానికి బొమ్మల కథలతో కూడిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. స్టోరీ టెల్లింగ్ ఆడియో, వీడియోలను చూపించాలి. పుస్తకం నేటి సమాజంలో ఒక వ్యక్తి జీవితంలో భాగంగా భావించాలి.
నేడు మన కంటే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఎన్నో రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ అవకాశం ఉన్నా అక్కడివారు పుస్తకాలంటే అభిమానం చూపుతారు. కొత్త పుస్తకాలను వారి పుస్తక భాండాగారాలలో ఉంచుతారు. మన జీవితాన్ని తీర్చిదిద్దే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. నిత్యం వార్తా పత్రికల నుండి మొదలుపెట్టి వీలయినన్ని పుస్తకాలను చదివే అలవాటు మనలో విజ్ఞానాన్ని పెంచి మన మేధస్సుకు మంచి పదును పెంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మంచి ప్రతిభను కలిగిస్తుంది. పుస్తకోత్సవాలు పుస్తకాలను ఒకచోటకు చేర్చి, అందర్నీ కలిపి జ్ఞాన వాతావరణాన్ని పెంపొందించడం కోసం కృషి చేస్తాయి. ఇటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా జరగాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అందులో ఒక భాగం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News