విపక్షాల నిరసన, వాకౌట్ మధ్య అసెంబ్లీలో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ-(బిఎసి) సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అజెండాతో సోమవారం మధ్యాహ్నం స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో బిఎసి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల పాల్గొనగా, బిఆర్‌ఎస్ పార్టీ తరఫున హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంఐఎం తరపున వచ్చిన అక్బరుద్దీన్ ఒవైసి హాజరయ్యారు. అయితే సమావేశం నుంచి బిఆర్‌ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి. బయటకు వచ్చిన తరువాత హరీశ్ రావు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. బిఎసి అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదంటూ, ఏమీ తెల్చకపోవడంతో బయటకు వచ్చామని అన్నారు.
బిఎసి లేకుండానే 2 బిల్లులు ప్రవేశపెట్టి, చర్చ పెట్టడం సంప్రదాయ విరుద్ధమని, కనీసం బిఎసి మీటింగ్‌లో ఎన్ని రోజులు సభ నడుపుతారో కూడా స్పష్టంగా చెప్పడం లేదని పేర్కొన్నారు. సభ కనీసం 15 రోజులు నడపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాత్రం 3, 4 రోజులు సభ నడుపుతామని చెబుతోందని, ఇలా అయితే ప్రజా సమస్యలపై చర్చ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రభుత్వ ఆంక్షలపై హరీశ్ రావు మండిపడ్డారు. తొలిరోజు టీ షర్టులతో వస్తే ఎందుకు ఆపారని మీటింగ్‌లో నిలదీశామని తెలిపారు. టీషర్టుతో పార్లమెంటుకు రాహుల్ వెళ్లట్లేదా..? అని నిలదీశారు. లగచర్ల రైతులకు బేడీలపై చర్చించాలంటే స్పందించట్లేదన్నారు. సభలో పర్యాటకం కంటే లగచర్ల రైతులపై చర్చే ముఖ్యమని చెప్పామన్నారు. ఎంఎల్‌ఎల ప్రొటోకాల్ ఉల్లంఘనలపైన స్పీకర్ హమీ ఇచ్చారని తెలిపారు. పుట్టిన రోజులు, పెళ్లిలు ఉన్నందుకు సభ వాయిదా వేయడంపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య మేరకు మాట్లాడే సమయం ఇవ్వాలని కోరామని చెప్పారు. ప్రతి రోజూ జీరో అవర్ ఉండాలని కోరినట్లు హరీశ్‌రావు తెలిపారు.
పదేళ్లు పాలించిన లీడర్లకు ఈ విషయం కూడా తెలియదా..? : డిప్యూటీ సిఎం భట్టి
అసెంబ్లీ నిబంధనల మేరకే బిఎసి సమావేశం జరిగిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బిఎసి సమావేశంలో బిఆర్‌ఎస్ నేతలు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్ని రోజులు నడుపాలన్నది స్పీకర్ నిర్ణయిస్తారని, పదేళ్లు పాలించిన పార్టీ నాయకలకు ఈ విషయం కూడా తెలియదా..? అని ప్రశ్నించారు. హరీష్ రావు చెప్పినట్లు సభ పనిదినాలు ఉండాలంటే ఎలా..? అని అడిగారు. తాను ఎల్‌ఒపిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం చేసింది తనకు తెలియదా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.