Friday, January 17, 2025

భూత్పూర్‌లో భూకుంభకోణం

- Advertisement -
- Advertisement -

1068 ఎకరాల్లో సగానికి పైగా కబ్జా
ధరణి పేరుతో కబ్జా పర్వం
గత ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా భూదాన్ భూముల కొనుగోలు
అప్పటి జిల్లా కలెక్టర్లు, తహశీల్దార్ల హస్తం
ఈడి భూత్పూర్ భూములపై విచారిస్తే పెద్ద పెద్ద తలకాయలు వెలుగులోకి వచ్చే ఛాన్స్

దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాల్టీ, మండల పరిధిలో భూదాన్ భూములను పంచుకుతిన్నారు. ఎకరా పది ఎకరాలు కాదు.. ఏకంగా వందల ఎకరాలను కబ్జా చేశారు. ఈ వ్యవహారంలో కొందరు ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్లు, తహశీల్దార్ల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వందల కోట్ల రూపాయల విలువ చేసే భూదాన్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పటి భూత్పూర్ తహశీల్దార్ భూదాన్ భూముల రికార్డులను తారుమూరు చేసి రియల్టర్లకు అప్పగించారు. ఎన్‌ఒసిల పేరుతో జడ్చర్ల సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో కొన్ని భూదాన్ భూములను రిజిష్టర్ చేసుకున్నారు. ఈ రిజిష్టర్ డాక్యుమెంట్ ఆధారంగా భూత్పూర్ తహశీల్దార్ ధరణిలో రిజిష్టర్ చేసి ఆ భూములకు అధికారికంగా పట్టదారు పుస్తకాలు పంపిణీ చేశారు. వీటి ఆధారంగా గత సర్కార్ హయాంలో ఇచ్చిన రైతు బంధు డబ్బులు నొక్కేశారు.ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలను ‘మన తెలంగాణ’ ఉమ్మడి జిల్లా ప్రతినిధి సేకరించారు.

భూత్పూర్ మున్సిపాల్టీ,’ మండల పరిధిలోని భూత్పూర్, మదిగట్ట, యల్కిచర్ల, బొట్ల మడుగు, తాటిపర్తి, కప్పెట, అమిస్తాపూర్, హస్నాపూర్, పేట మెల్గర, రేవులపల్లి, పోతుల మడుగు, అన్నాసాగర్, గోప్లాపూర్, చితల దివిటిపల్లి, దివిటిపల్లి తదితర గ్రామాల్లో 1068 ఎకరాలు భూదాన్ భూములు ఉన్నాయి. మదిగట్లలో సర్వే నెంబర్ 211లో 30 ఎకరాలు, యల్కిచర్లలో సర్వే నెంబర్ 465, 66, 594, 597, 596, 598లో 103 ఎకరాలు, అదే గ్రామంలో సర్వే 460లో 8 ఎకరాలు, 533 సర్వే నెంబర్‌లో 3.23 ఎకరాలు, 420 సర్వే నెంబర్‌లో 3 ఎకరాలు, 665, 698 సర్వే నెంబర్‌లో 5.11 ఎకరాలు, 750 సర్వే నెంబర్‌లో 2.20 ఎకరాలు, 411 సర్వే నెంబర్‌లో 5 ఎకరాలు, 422, 364, 329 సర్వేనెంబర్లలో 10.20 ఎకరాలు, 521 సర్వే నెంబర్‌లో 3 ఎకరాలు, 534 సర్వే నెంబర్‌లో 3 ఎకరాలు, 212 సర్వే నెంబర్‌లో 2.35 ఎకరాలు, 700 సర్వే నెంబర్‌లో 31.12 ఎకరాలు, ఎల్కిచర్ల గ్రామంలోనే సర్వే నెంబర్ 753, 755, 756, 757 సర్వే నెంబర్‌లో 7.18 ఎకరాలు భూధాన్ భూమి ఉంది.

అలాగే అదే గ్రామంలోని 713 సర్వేనెంబర్‌లో 1.29 ఎకరాలు,697లో 11.14 ఎకరాలు,749లో 0.20 గుంటలు, 665లో 1.20 ఎకరాలు, 212లో 2.35 ఎకరాలు, 697లో 17.33 ఎకరాలు, 712లో 4.37 ఎకరాలు, 713లో ఎకరా, 758లో 1.06 ఎకరాలు, 749, 750, 752లో 6.33 ఎకరాలు ఉంది. బొట్లమడుగు గ్రామంలో ఉన్న దాదాపు పదెకరాలు ఎక్కడ ఉన్నాయో రికార్డులే లేవు. తాటిపర్తిలో సర్వే నెంబర్ 177లో ఎస్‌టిలకు చెందిన 20 ఎకకాలు, బిసిలకు చెందిన 10 ఎకరాలు, ఒసిలకు చెందిన 5 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. కపెట గ్రామంలో 6 ఎకరాలు మాయమయ్యాయి. భూత్పూర్ మండల పరిధిలోని 2.33, 1.11 లో 5 ఎకరాలు, భూత్పూర్‌లో సర్వే నెంబర్ 28, 339, 293, 248, 242, 241లో 19 ఎకరాలు, సర్వే నెంబర్ 373లో 0.26,5 ఎకరాలు, 215 సర్వే నెంబర్లో 10 ఎకరాలు, 137లో 9.2. ఎకరాలు, హస్నాపూర్‌లో దాదాపు 28 ఎకరాలు, కపెటలో దాదాపు 20 ఎకరాలు, పోతుల మడుగులో 4 ఎకరాలు, అన్నాసాగర్‌లో 21 ఎకరాలు, గోప్లాపురంలో 60 ఎకరాలు, చితల దివిటిపల్లిలో 54 ఎకరాలు మొత్తం 1068 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది.

భూదాన్ చట్టం ఏమి చెబుతోందిః
మహాత్మాగాంధీ శిష్యుడు ఆచార్యవినోభాబావే తెలంగాణలో జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ఆయన పాదయాత్ర పోచంపల్లికి చేరుకుంది. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో కొందరు సమస్యలు చెప్పుకునే క్రమంలో భూమి సమస్య వచ్చింది. ఈ సందర్భంగా వినోభాభావే భూస్వాములు, ధనవంతుల నుంచి భూములు పేదలకు ఇవ్వాలని కోరగా రామచంద్రారెడ్డి అనే భ భూస్వామి తనకున్న భూమిలో 100 ఎకరాలు భూమిని ఉచితంగా భూదాన్ కింద ఇచ్చారు. రామచంద్రారెడ్డి త్యాగాన్ని చూసిన వినోబాభావే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపట్టారు. తెలంగాణ నుంచి ప్రారంభమైన ఆయన పాదయాత్ర దేశవ్యాప్తంగా 80 వేల కిలోమీటర్లు సాగింది. వినోబాభావే పిలుపు మేరకు 44 లక్షల ఎకరాలు భూదాన్ భూములు ప్రభుత్వానికి రాసిచ్చారు.

మొదటసారిగా తెలంగాణలో యాక్ట్ నెంబర్ 13, 1965 చట్టం ప్రకారం భూదాన్, గ్రామ్‌దాన్ భూములకు చట్టబద్ధత కల్పించారు. ఈ చట్టప్రకారం భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పడింది. ఇందులో కమిటీ ఛైర్మన్‌తోపాటు కమిటీ మెంబర్లు ఉంటారు. ఈ యజ్ఞబోర్డు ఈ భూములను కాపాడే బాధ్యతను అప్పగించింది. ఈ చట్టం ప్రకారం భూదాన్ భూములను దానం చేయడంతో ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయగా మరికొన్నింటిని ఇంటి స్థలాల కోసం పంపిణీ చేసింది. ఈ చట్టం ప్రకారం భూదాన్ భూములను తీసుకున్న వారి నుంచి ఎవరు కొనుగోలు చేసినా, విక్రయించినా అవి చట్టరీత్యా చెల్లనేరవని చట్టంలో స్పష్టంగా ఉంది.

భూత్పూర్‌లో జరిగిందిదే ః
భూత్పూర్ మండలంలో మొత్తం 1068 ఎకరాలు భూములను అప్పట్లో త్యాగపురుషులు భూదాన్ కింద రాసిచ్చారు. ఈ భూములను అప్పట్లో పేదలకు పంపిణీ చేశారు. అయితే వీటిలో కొన్ని వ్యవసాయానికి యోగ్యంలో ఉండగా మరికొన్ని పనికి రాకుండా ఉండడంతో రైతులు వాటిని మర్చిపోయారు. అయితే 2014 నుంచి 2023 వరకు ఈ పదేళ్లలో రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోవడంతో ఇక్కడి భూములకు రెక్కలు వచ్చాయి. భూత్పూర్ మీదుగానే హైదరాబాద్=బెంగుళూరు 44 నెంబర్ జాతీయ రహదారితో పాటు, ఇటీవల 167 నెంబర్ చించోలి జాతీయ రహదారి కూడా భూత్పూర్ మీదుగానే మంజూరైంది. రెండు జాతీయ రహదారులు ఉండడంతో పాటు హైవే పక్కన ఉండడంతో భూత్పూర్ బంగారమైంది. ఇక్కడి భూముల ధరలకు రెక్కలు రావడంతో భూ రాబంధులు కన్నేశారు.

చక్రం తిప్పిన భూత్పూర్ రెవెన్యూ అధికారులు ః
గత ప్రభుత్వ హయాంలో భూత్పూర్ మండలంలోని భూదాన్ భూములను పెద్దఎత్తున కబ్జా చేశారు. తహశీల్దార్ కార్యాలయంలోని తహశీల్దార్, డిటిలను మచ్చిక చేసుకొని అందిన కాడికి భూదాన్ భూములను కబ్జాలు చేసి రికార్డులనే తారుమారు చేశారు. భూదాన్ భూములను క్రయవిక్రయాలు చేయకూడదనే నిబంధన ఉన్నా ధరణిలోని లొసుగులను ఆసరా చేసుకొని యథేచ్ఛగా కబ్జా చేశారు. యజ్ఞబోర్డుల నుంచి, అప్పటి కొందరు కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల నుంచి ఎన్‌ఓసిలు తెప్పించుకొని భూదాన్ భూములను ధరణిలో రిజిష్టర్ చేసుకోగా, ప్లాట్లుగా చేసుకున్న భూములను జడ్చర్ల సబ్ రిజిష్ట్రా కార్యాలయంలో రిజిష్టర్ చేసుకున్నారు. ఈ వ్యవహారంలో వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. భూదాన్ భూముల రికార్డులను సైతం భూత్పూర్ మండల కార్యాలయంలో గత అధికారి ఒకరు కార్యాలయం మార్చి కొత్త కార్యాలయంలోకి రికార్డులను మార్చే క్రమంలో మాయం చేశారు. దీంతో వీటికి సంబంధించి పూర్తి సమాచారం కూడా అక్కడ లేకపోవడం గమనార్హం. ఈ కుంభకోణం బయటికి రాకుండా రికార్డులను సైతం మాయం చేశారు. ఈ వ్యవహారంలో అప్పటి ప్రభత్వంలోని పలువురు కలెక్టర్లు, జెసిలు, తహశీల్దార్‌ల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

ఈడి, సిబిఐ, సిబిసిఐడి విచారిస్తే కుంభకోణం వెలుగులోకి ః
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, నాగారంలో జరిగిన 40 ఎకరాల భూదాన్ భూముల వ్యవహారంలో ఒక ఐఎఎస్ అధికారిని అరెస్ట్ చేసిన ఈడి భూత్పూర్ భూములపై విచారిస్తే పెద్ద పెద్ద తలకాయలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వందల ఎకరాల భూదాన్ భూములు అన్యాక్రాంతం జరిగి వందల కోట్లు రూపాలయలు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూములపై సిబిఐ, సిబిసిఐడి పూర్తిగా విచారిస్తే భూదాన్ భూముల బకాసురులు బయటికి వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News