మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, కీసర మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల (సనత్‌నగర్, కూకట్‌పల్లి)లో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. ఆదివారం రాత్రి నిద్రించే సమయంలో ఎలుకలు కరవడంతో ఐదుగురు గాయపడ్డారు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థినులు సోమవారం ఉదయం ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, హాస్టల్ సిబ్బంది, ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ప్రిన్సిపాల్ మహాలక్ష్మి విద్యార్థినును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయంలో గురుకుల సిబ్బంది గోప్యత పాటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత శనివారం ఐఏఎస్ అధికారి మకరంద్ ఉన్నతాధికారులతో గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా ఈ పాఠశాలను సందర్శించారు. గురుకులంలో విద్యార్థుల వసతి గదులను, వంటశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది జరిగి రెండు రోజులు గడవక ముందే విద్యార్థినులు ఎలుకల దాడిలో గాయపడటం కలకలం రేపింది.
ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీశ్‌రావు
కీసర జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థినులను ఎలుకలు కరిచినట్లు తెలుసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాలికల వసతి గృహాంలో ఎలుకలు కొరికి అయిదుగురు విద్యార్థినులు ఆస్పత్రిపాలవడం దారుణమన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎలుకల కాట్లు, కుక్కకాట్లు, పాము కాట్లు, కరెంట్ షాకులతో విద్యార్థులు తల్లడిల్లుతున్నా పట్టించుకోని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. గురుకుల బాట కార్యక్రమం ఎట్లుందంటే, మాటలు కోటలు దాటాయన్నారు. కాళ్లు తంగెళ్లు దాటవు అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. గురుకుల బాట డొల్లతనం 24 గంటలు గడవక ముందే బయటపడిందని అన్నారు. ప్రచారం పేరిట ఒక్కరోజు తమాషా చేయడం కాదు..గురుకులాల్లో విద్యార్థులకు పాములు, ఎలుకలు, కుక్క కాట్లు లేకుండా చూడాలని సూచించారు.