Thursday, January 16, 2025

లగచర్లపై చర్చ పెట్టమంటే పారిపోయారు:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

లగచర్ల రైతుల అరెస్టుపై అసెంబ్లీలో చర్చపెట్టమంటే కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోయిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్‌కు వచ్చిన కెటిఆర్ మాట్లాడారు. తెలంగాణ అత్యున్నత సభైన శాసనసభలో కొడంగల్ రైతుల గురించి చర్చ పెట్టమంటే రేవంత్ పారిపోయారని అన్నారు. 35 రోజులుగా కొండగల్ రైతులు జైలులోనే మగ్గుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమ రైడర్ షిప్ తగ్గిందని ఎల్ అండ్ టీ వంటి అంతర్జాతీయ సంస్థ సీఎఫ్‌ఓ అంటే ఆయనను జైల్లో పెడతామని ముఖ్యమంత్రి నియంతృత్వ ధోరణితో ఉన్నారని ఆరోపించారు.

సంగారెడ్డి జైల్లో ఉన్న కొడంగల్ రైతులు, అలాగే చర్లపల్లి జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీకి వందసార్లు పోయినా వంద పైసలు కూడా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం తేలేకపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవ చేశారు. తనపై ఎవరూ మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వారిని జైళ్లల్లో పెడుతున్నారని ఆగ్రహించారు.ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వారినీ వదిలిపెట్టడం లేదని ధ్వజమెత్తారు.భూములు ఇవ్వబోమని చెప్పిన రైతులను జైల్లో పెట్టేందుకు అసలు రేవంత్ రెడ్డి ఎవరంటూ కేటీఆర్ ప్రశ్నించారు. నియంత, చక్రవర్తి, రారాజులా రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని, అలాగే పాలన చేస్తున్నారని మండిపడ్డారు.

ఎంతవరకైనా వెళ్తాం…
సిఎం రేవంత్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా తెలంగాణ రైతుల కోసం పోరాటం చేస్తూనే ఉంటామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి దోస్తు అదానీ టీషర్టులు తాము వేసుకుని వస్తే అసెంబ్లీలోకి అగుడుపెట్టనీయలేదని మండిపడ్డారు. లగచర్ల రైతులు, గిరిజన ఆడబిడ్డలపై అర్ధరాత్రి దాడులు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వారిపై వేధింపుల గురించి చర్చించాలని పట్టుపడితే సభను వాయిదా వేసి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి పారిపోయారని అన్నారు. లగచర్ల రైతుల తరఫున బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని, తామంతా వారి వెంటే ఉండి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News