Saturday, January 18, 2025

ఈశాన్యంలో పర్యాటకానికి భారీ సవాళ్లు

- Advertisement -
- Advertisement -

పర్యాటకం నిస్సందేహంగా ప్రపంచంలో అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న పరిశ్రమ. ఆర్థిక అభివృద్ధి విస్తరణకు ఉద్యోగాల కల్పన ద్వారా ఆదాయం, పంపిణీలో అసమానతల తగ్గింపునకు పర్యాటకానికి గల సత్తాను గుర్తించి చాలా వరకు ప్రభుత్వాలు దానిని ప్రోత్సహిస్తుంటాయి. ఈశాన్య భారతంలో రెవెన్యూ సాధనకు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ప్రధాన రంగంగా పర్యాటకానికి నిధులు సమకూరుస్తున్నారు. ఈశాన్యంలో ప్రతిపాదిత థాయ్ పెట్టుబడిలో ప్రధాన ప్రోత్సాహక రంగాల్లో ఒకటిగా పర్యాటకం స్థానం పొందింది.

ఈశాన్యంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు ప్రోత్సహించడం, ‘లుక్ ఈస్ట్ పాలసీ’ (ఎల్‌ఇపి తూర్పు వైపు దృష్టి) ప్రధానంగా ఆస్కారం ఇచ్చే ప్రాంతంగా ప్రచారం చేయడం అనే రెండు అంచెల లక్షాలతో కేంద్ర ప్రభుత్వం ఈశాన్యంలోని రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన పలు చర్యలు తీసుకున్నాయి. సర్కూట్లు, మార్కెటింగ్ పటిష్టత వంటి రాష్ట్రాల మధ్య, అంతర్ రాష్ట్ర పర్యాటక ప్రణాళికల సమన్వయానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యంతో ఈశాన్య రాష్ట్రాల పర్యాటక ఫోరమ్ (ఎన్‌ఇఎస్‌టి నెస్ట్)ను ఈశాన్య మండలి (ఎన్‌ఇసి) 2008లో ఏర్పాటు చేసింది.

ఈశాన్య భారతంలోని విభిన్న సంస్కృతులు, భాష, కళ, సంగీతం, ఆహార్యం, పండుగలు, మతం, జంతుజాలం, వృక్షజాలం ప్రపంచం అంతటి నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ప్రకృతి రమణీయకతకు అది పేరొందిన ప్రాంతం, ప్రపంచంలో సంపన్న జీవభౌగోళిక ప్రాంతాల్లో ఒకదాని మధ్యలో అది ఉంది. అది ఆర్థిక వనరుల ఖజానా కూడా. దానికి సాంస్కృతిక, జాతిపరమైన వారసత్వ సంపద ఉంది. దానితో అది పర్యాటకులకు ప్రీతిపాత్రమైన ప్రదేశం అవుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పనకు పర్యాటకానికి ఇతోధిక శక్తి ఉన్నది.

ఈశాన్య భారతం కేవలం జంతుజాలం, వృక్షజాలం సమ్మిశ్రమంగానే కాకుండా జీవ వైవిధ్యంలో అసాధారణంగా సుసంపన్నం కావడం కూడా అందుకు కారణం. అంతేకాకుండా, ఈశాన్యంలోని వివిధ ప్రదేశాల్లో వన్యప్రాణి అభయారణ్యాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించగలవు. పర్యాటక పరిశ్రమ పరంగా ఆర్థిక అభివృద్ధికి విశేష అవకాశాన్ని కాపాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో ఈ రంగం ప్రాధాన్యాన్ని అన్వేషించడం ఒక సవాల్. ఈశాన్య భారతానికి సంబంధించి, ఈ ప్రాంతానికి సాంస్కృతిక వారసత్వ సంపద, ప్రకృతి రమణీయకతతో పర్యాటకానికి అపార అవకాశం ఉన్నప్పటికీ పర్యాటకం అభివృద్ధికి సరైన చొరవ ఇంత వరకు తీసుకోలేదు. ఈశాన్య ప్రాంతంలో పర్యాటక ప్రోత్సాహానికి ఒక సమీకృత దృక్పథం తక్షణావసరం.
సమర్థమైన, సముచిత అనుసంధానం ఒక పర్యాటక ప్రదేశం అభివృద్ధికి ముఖ్యమైన అంశాల్లో ఒకటి.

ఇందు నిమిత్తం, భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆర్‌సిఎస్‌ఉడాన్ పథకాన్ని ప్రారంభించింది. అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రాంతీయ గగనయాన అనుసంధానానికి వీలు కల్పించడం/ పటిష్టం చేయడం దాని ప్రాథమిక లక్షం. దిగ్గజ ప్రదేశాలు సహా ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలకు అనుసంధానాన్ని మరింత మెరుగుపరిచే ధ్యేయంతో చాంపియన్ సర్వీస్ సెక్టార్ స్కీమ్ (సిఎస్‌ఎస్‌ఎస్) కింద సాధ్యత లోటు నిధుల భర్తీ (విజిఎఫ్) రూపంలో ఆర్థిక సహాయం అందజేయడానికి పౌర విమానయాన మంత్రిత్వశాఖతో పర్యాటక మంత్రిత్వశాఖ సహకరించుకుంటున్నది. అయితే, ఈ పథకాలు సరిగ్గా పని చేయడం లేదు. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ సమీపంలోని పక్యాంగ్ విమానాశ్రయం 4646 అడుగుల ఎత్తులో గ్యాంగ్‌టక్‌కు దాదాపు 31 కి.మీ దూరంలో ఉన్నది. పక్యాంగ్ విమానాశ్రయం భారత్‌లోని అత్యంత ఎత్తైన ఐదు విమానాశ్రయాల్లో ఒకటి.

అది ఈశాన్య భారతంలో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన తొలి హరిత విమానాశ్రయం కూడా. సిక్కిం రాష్ట్రంలోని ఏకైక విమానాశ్రయం అది. ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఆర్భాటం గా 2018 సెప్టెంబర్ 24న ఆ విమానాశ్రయానికి ప్రారంభోత్సవం చేశారు. అయితే, దృశ్యమాన విమాన నిబంధనావళి (విఎఫ్‌ఆర్) విమానాశ్రయంగా ప్రణాళిక రచన, రూపకల్పన చేసినప్పటికీ తెలిసిన వాతావరణ పరిస్థితుల కారణంగా వాణిజ్య విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. నిర్వాసితులైన స్థానిక గ్రామస్థుల ఆందోళన, విమానం తిరిగే ప్రదేశం సమస్యలతో పాటు ఆ దృశ్యమాన సమస్యల కారణంగా మొత్తం ప్రాజెక్టు వృథా ప్రయాసగా మారింది. పర్యాటకం అభివృద్ధికి అనుసంధానం ఒక ప్రధాన అంశం.

కానీ స్థానిక సమాజాల ప్రమేయానికి అవకాశం కల్పించడం మరింత ముఖ్యం. పర్యాటక, పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం, గత మార్చి 31 వరకు సిక్కిం రికార్డు స్థాయిలో 2,90,401 మంది పర్యాటకులను స్వాగతించింది. వారిలో 2,56,537 మంది దేశీయ అతిథులు కాగా, 30,864 మంది విదేశీ సందర్శకులు. 2023 అక్టోబర్‌లో విధ్వంసకర ఆకస్మిక వరదల వల్ల అపారంగా నష్టపోయిన సిక్కిం అతిథేయ పరిశ్రమ పునర్నిర్మాణానికి ఈ పెరుగుదలను ఒక కారణంగా పేర్కొన్నారు.

ఈశాన్య భారతం రమణీయకత అన్వేషణకు నదీ విహారయాత్రను ఒక విలక్షణ, విశ్రాంతికర మార్గం, ప్రకృతి ప్రేమికులు, సాహసాభిలాషులకు ప్రముఖమైన నదీ విహారయాత్ర ప్రదేశాలు అనేకం ఈ ప్రాంతంలో ఉన్నాయి. బ్రహ్మపుత్ర నదీ విహారయాత్ర పర్యాటకులకు బాగా ఇష్టమైనది. దీనిని ప్రపంచంలో అత్యంత రమణీయమైన నదీ విహార యాత్రల్లో ఒకటిగా పరిగణిస్తుంటారు. ఈ విహారయాత్ర అసోం మధ్య భాగంలో మిమ్మల్ని తీసుకువెళుతుంది. మీరు ఈ ప్రాంత వారసత్వ సంపదను అన్వేషించగలరు. తేయాకు తోటలు సందర్శించగలరు, స్థానిక జీవన విధానాన్ని అనుభవించగలరు. మీరు ఒంటికొమ్ము ఖడ్గమృగాలు, ఏనుగులు, పులులు సహా ఈ ప్రాంతంలోని సుప్రసిద్ధ వన్యప్రాణులు కొన్నిటిని మీరు చూడగలరు. ప్రపంచంలో అత్యంత సుదీర్ఘ నదీ విహారయాత్ర గంగా విలాస్. ఇది ఉత్తరప్రదేశ్‌లోని కాశీ నుంచి బంగ్లాదేశ్ మీదుగా అసోంలోని దిబ్రూగఢ్ వరకు ఉత్సుకత కలిగించే 3,200 కిమీ దూరం సాగుతుంది.

గంగా విలాస్ నదీ విహార యాత్ర టిక్కెట్ ధర మొత్తం 51 రోజుల ప్రయాణానికి ప్రయాణికునికి రూ. 50 నుంచి రూ. 55 లక్షల వరకు ఉంది. రోజుకు గంగా విలాస్ విహారయాత్ర టిక్కెట్ ధర పర్యాటకునికి సుమారు రూ.25 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉంది. లగ్జరీ విహారయాత్రను అంతర లగ్జరీ రివర్ క్రూజెస్ నిర్వహిస్తుండడం ఇందుకు కారణం. అటువంటి అధిక ధర పర్యాటక కార్యక్రమం స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదం చేయకపోవచ్చునని, ఉపాధి కల్పించకపోవచ్చునని విమర్శకులు అంటున్నారు. అటువంటి విహారయాత్ర సాధ్యతనూ ప్రశ్నిస్తున్నారు.

నాగాలాండ్ పర్వతసానువుల్లో నడక నుంచి త్రిపురలోని పురాతన శిథిలాలను అన్వేషించడం వరకు ఈశాన్య భారతంలో విలక్షణమైన, సంప్రదాయేతర అనుభవాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని ఇతర సంప్రదాయేతర పర్యాటక విశేషాలు.
ఎగువ అసోం అత్యంత నాణ్యమైన టీకి ప్రసిద్ధి, అది దిబ్రూగఢ్, తీన్‌సుకియా, జోర్హట్ టీ ఎస్టేట్‌ల అన్వేషణకు సందర్శకులకు అవకాశం కల్పిస్తుంది. ఎగువ అసోంలో సందర్శించదగిన కొన్ని పాప్యులర్ టీ ఎస్టేట్‌లలో మనోహరి టీ ఎస్టేట్, మన్‌కోట్ట టీ ఎస్టేట్, నాందంగ్ టీ ఎస్టేట్, దెహింగ్ టీ ఎస్టేట్ ఉన్నాయి. దిబ్రూగఢ్ టీ ఎస్టేట్ అసోంలో ఉన్న చారిత్రక టీ ఉద్యానం. అది భారత్‌లోని అత్యంత ప్రాచీన టీ ఎస్టేట్‌లలో ఒకటి. దిగువ అసోం సుప్రసిద్ధ బార్పేట, గోల్పార తేయాకు తోటలు సహా పెక్కు టీ ఎస్టేట్‌లకు నెలవు. సందర్శకులు మార్గనిర్దేశక తేయాకు తోటల్లో పర్యటించవచ్చు, ఈ ప్రాంతంలోని టీ చరిత్ర తెలుసుకోవచ్చు, వివిధ రకాల టీల రుచి చూడవచ్చు.

హల్మరి టీ ఎస్టేట్, మానస్ నేషనల్ పార్క్ కూడా దిగువ అసోంలో పాప్యులర్ పర్యాటక ప్రదేశాలు. అంబికానగర్ టీ ఎస్టేట్, భుబన్ లోయ టీ ఎస్టేట్ కచార్‌లో టీ పర్యాటకానికి పాప్యులర్ ప్రదేశాలు. త్రిపురేశ్వరి టీ ఎస్టేట్, హీరాచెర్ర టీ ఎస్టేట్ త్రిపురలో టీ పర్యాటకానికి పాప్యులర్ ప్రదేశాలు. మావ్లిన్‌గోట్ టీ ఎస్టేట్, లకీర్‌స్యూ టీ ఎస్టేట్ మేఘాలయలో టీ పర్యాటకానికి పాప్యులర్ ప్రదేశాలు. ఇక తెమి టీ ఎస్టేట్ సిక్కిం రాష్ట్రంలో గల ప్రకృతి రామణీయకత గల తేయాకు తోట. ఆ తోట ఎక్కువ నాణ్యమైన టీకి ప్రసిద్ధి, సందర్శకులు తేయాకు తోటల్లో మార్గనిర్దేశక పర్యటనలు జరిపేందుకు అవకాశం కలిగిస్తుంది, వారు టీ తయారీ ప్రక్రియ గురించి తెలుసుకోవచ్చు, రకరకాల టీలను రుచి చూడవచ్చు. సందర్శకులు నేరుగా ఎస్టేట్ నుంచి టీ కొనవచ్చు, ఆన్‌సైట్ గెస్ట్ హౌస్‌లో బస చేయవచ్చు.

టీ పర్యాటకం వృద్ధి చెందుతున్న పరిశ్రమ, సందర్శకులకు తేయాకు తోటల అన్వేషణకు అవకాశం కల్పిస్తుంది, వారు టీ తయారీ ప్రక్రియ నేర్చుకోవచ్చు, రకరకాల టీలను రుచి చూడవచ్చు. విలక్షణమైన, ప్రకృతి రమణీయకత ప్రదేశాలు అనేకం ఉన్నప్పటికీ దేశంలోని ఈశాన్య ప్రాంతం భారత్‌లో ఇప్పటికీ అత్యల్పంగా సందర్శిస్తున్న ప్రదేశంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధికి ఆర్థిక సహాయం అందజేస్తున్నా, ప్రోత్సహిస్తున్నా, మార్కెటింగ్ చేస్తున్నా, రాష్ట్రాల్లో ప్రదర్శనలు, పర్యాటకం అభివృద్ధి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పత్రం భారత ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకాన్ని పరిశీలిస్తోంది. పర్యాటకుల రాక అసోంలో అధికంగాను, నాగాలాండ్‌లో తక్కువగా ఉన్నట్లు విదితం అవుతోంది. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో పర్యాటక రంగాల వాటా అసోంలో అధికంగా ఉన్నది.పర్యాటకుల రాక వృద్ధి రేటుకు సంబంధించినంత వరకు అరుణాచల్‌ప్రదేశ్‌లో వృద్ధి రేటు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 55 శాతం అధికంగా ఉన్నది. పర్యాటక జనాభా సాంద్రత (డిటిపి), తలసరి పర్యాటకుల రాక (పిసిటి) సిక్కింలో వరుసగా 101.57 శాతం, 1.19 శాతం అధికంగా, నాగాలాండ్‌లో 1.35 శాతం, 0.01 శాతం కనిష్ఠంగా ఉన్నాయి. ఈశాన్య పర్యాటకం అభివృద్ధికి, రాష్ట్రాల మధ్య సమానంగా లేని ప్రదర్శనకు ప్రధాన అవరోధాలు అనేక ఈశాన్య రాష్ట్రాల్లో తగినన్ని నిధులు లేకపోవడం, మౌలిక వసతులు, రవాణా కొరత, ప్రత్యామ్నాయ రవాణా వనరుల కొరత, మార్కెటింగ్, సరిహద్దు సమస్యలు, ఉగ్రవాద ప్రభావం, పర్మిట్ వ్యవధి, ఇన్నర్ లైన్ పర్మిట్. పర్యాటకం అభివృద్ధి కోసం అవరోధాలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.

గీతార్థ పాఠక్

ఈశాన్యోపనిషత్

(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక,
రాజకీయ అంశాల విశ్లేషకుడు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News