ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. రైతుల పేరిట ఆ పార్టీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటుందని, కానీ వారి కోసం ఏమీ చేయదని, ఇతరులనూ చేయనివ్వదని ప్రధాని మోడీ ఆరోపించారు. తూర్పు రాజస్థాన్ కాలువ ప్రాజెక్ట్ (ఇఆర్‌సిపి)లో జాప్యం కాంగ్రెస్ ఉద్దేశానికి ప్రత్యక్ష దాఖలా అని ఆయన విమర్శించారు. జైపూర్‌లోని దాడియాలో ఒక బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, ‘తూర్పు రాజస్థాన్ కాలువ ప్రాజెక్టును కాంగ్రెస్ సుదీర్ఘ కాలం ఆలస్యం చేసింది. కాంగ్రెస్ ఉద్దేశాలకు ఇది కూడా ప్రత్యక్ష నిదర్శనం. వారు రైతుల పేరిట పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. కానీ, వారు రైతుల కోసం ఏమీ చేయరు, ఇతరులనూ చేయనివ్వరు’ అని విమర్శించారు. రాజస్థాన్ ప్రభుత్వం ఒక ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ‘ఏక్ వర్ష్ పరిణామ్ ఉత్కర్ష్’ కార్యక్రమంలో మాట్లాడిన మోడీ రూ. 46400 కోట్లు విలువ చేసే ఇంధన శక్తి, రోడ్, రైల్వేలు, నీటికి సంబంధించిన 24 ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
పార్వతి, కాళీసింధ్, చంబల్ ప్రాజెక్ట్ రాజస్థాన్‌లో 21 జిల్లాలకు సాగు నీరు, తాగు నీరు సౌకర్యం కల్పించడమే కాకుండా రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రెండింటి అభివృద్ధిని వేగిరపరుస్తుందని ప్రధాని తెలియజేశారు. చర్చలను ప్రోత్సహించడం బిజెపి విధానం కాగా, కాంగ్రెస్ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను ప్రోత్సహిస్తూనే ఉందని ఆయన చెప్పారు. ‘బిజెపి విధానం చర్చలే, సంఘర్షణ కాదు. మేము సహకారాన్ని విశ్వసిస్తాం, ప్రతికూలతను కాదు. మాకు పరిష్కారాలపై నమ్మకం ఉంది, అవరోధాలపై కాదు. అందువల్ల మా ప్రభుత్వం తూర్పు రాజస్థాన్ కాలువ ప్రాజెక్టును ఆమోదించి, విస్తరించింది కూడా. మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌లలో బిజెపి ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే పార్వతి కాళీసింధ్ చంబల్ ప్రాజెక్టుపై ఒప్పందం కుదుర్చుకోవడమైంది’ అని మోడీ తెలిపారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నర్మద నీటిని సరఫరా చేసేందుకు భారీ ప్రచారోద్యమాన్ని ప్రారంభించానని ప్రధాని మోడీ తెలియజేశారు. దానిని నిలువరించేందుకు కాంగ్రెస్, కొన్ని ఎన్‌జిఇలు రకరకాల ఎత్తుగడలు వేశాయని ఆయన ఆరోపించారు.
‘కాంగ్రెస్ నీటి సమస్యలు తగ్గించాలని ఎన్నడూ కోరుకోదు& మన నదుల జలాలు సరిహద్దుల పొడుగునా ప్రవహిస్తుంటాయి, కానీ మన రైతులు వాటి ప్రయోజనాల పొందలేదు. ఒక పరిష్కారం కనుగొనడానికి బదులు కాంగ్రెస్ రాష్ట్రాల మధ్య జల వివాదాలను ప్రోత్సహిస్తూనే ఉంది’ అని ఆయన చెప్పారు. ఎన్నికలు జరిగిన వివిధ రాష్ట్రాల్లో బిజెపి భారీగా ప్రజల మద్దతు పొందుతున్నదని కూడా ప్రధాని మోడీ తెలిపారు. ‘బిజెపి ఒక రాష్ట్రం తరువాత మరొక రాష్ట్రంలో భారీగా ప్రజల మద్దతు పొందుతున్నది. లోక్‌సభలో వరుసగా మూడవ విడత దేశానికి సేవ చేసే అవకాశాన్ని బిజెపి దేశం ఇచ్చింది. గడచిన 60 ఏళ్లలో దేశంలో ఇది సంభవించలేదు’ అని మోడీ చెప్పారు. ‘ప్రస్తుతం బిజెపి డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు సుపరిపాలనకు చిహ్నంగా మారుతున్నాయి. బిజెపి ఏ తీర్మానం చేసినా దానిని నెరవేర్చేందుకు నిజాయతీగా కృషి చేస్తుంటుంది. ఇప్పుడు దేశ ప్రజలు బిజెపి సుపరిపాలనకు గ్యారంటీ అని అంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం కృషిని కూడా మోడీ కొనియాడారు.