దేశంలో మురుగునీటి, సెప్టిక్ ట్యాంక్ కార్మికుల్లో 67 శాతం మందికి పైగా షెడ్యూల్డ్ కులం (ఎస్‌సి) కేటగరీకి చెందినవారేనని అధికారిక డేటా వెల్లడించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథావలె మంగళవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, ‘జాతీయ యాంత్రీకరణ పారిశుద్ధ పర్యావరణ వ్యవస్థ (నమస్తే) పథకం కింద పేర్కొన్న 54574 మంది మురుగునీటి, సెప్టిక్ ట్యాంక్ కార్మికులలో 37060 మంది ఎస్‌సి కేటగరీకి చెందినవారని తెలియజేశారు. ఆ గణాంకాల ప్రకారం, 15.73 శాతం మంది కార్మికులు ఒబిసిలకు, 8.31 శాతం మంది ఎస్‌టిలకు చెందినవారు కాగా, కేవలం 8.05 శాతం మంది సాధారణ కేటగరీ నుంచి వచ్చినవారు.
33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా 57758 మంది కార్మికులను జాబితాలో చేర్చగా వారిలో 54574 మందిని ధ్రువీకరించడమైంది. ఒడిశా, తమిళనాడు వంటి రాష్ట్రాలకు సంబంధిత డేటాను కేంద్ర నమస్తే డేటాబేస్‌లో సంకలన ప్రక్రియ ప్రస్తుతం సాగుతోంది. కేంద్ర గృహవసతి, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఒహెచ్‌యుఎ) సహకారంతో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాక 202324లో ప్రారంభించిన నమస్తే పథకం లక్షం పారిశుద్ధ కార్మికుల భద్రత, గౌరవం పరిరక్షణ, సాధికారత జరిగేలా చూడడం. ఈ పథకం కింద కార్మికుల భద్రత పెంపునకు, సాంఘిక ఆర్థిక అవకాశాల కల్పనకు వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.