మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైడ్రా ఆవిర్భవించిన 2024 జులై నాటికి నిర్మాణాలను పూర్తి చేసుకొని సామాన్యులు నివాసం ఉంటున్న వారి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్ళదని కమిషనర్ రంగనాథ్ భరోసానిచ్చారు. ఈ నిబంధన వాణిజ్య సముదాయాలకు వర్తించదని తేల్చి చెప్పారు. సంబంధిత ప్రభుత్వ విభాగాల అనుమతులున్న నిర్మాణాల జోలికి కూడా హైడ్రా వెళ్లదన్నారు. హైడ్రా ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఆక్రమ నిర్మాణాలను తొలగిస్తామని కమిషనర్ చెప్పా రు. గ్రేటర్ హైదరాబాద్‌లోని కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువుకు వచ్చే వరద కాలువ పనులు పూర్తి చేయకుండా అక్కడ వాసవి నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టడం పట్ల రంగనాథ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మూసాపేట్ కాముని చెరువులో మట్టిపోసినవారిని వదిలిప్టెది లేదని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు.
చెరువులో నిర్మాణాలు చేపడితే కూల్చి వేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి మండలం మూసాపేట, ఖైతలాపూర్ పరిధిలోని కాముని చేరువుతో పాటు మైసమ్మ చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు. కాముని చెరువులో నిర్మాణ వ్యర్థాలతో పాటు మట్టిని నింపి కొంతమంది ఆక్రమిస్తున్నారని, చెరువులకు అనుసంధానంగా వుండే కాలువల కబ్జాపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కమిషనర్ మంగళవారం క్షేత్ర స్థాయిలో ఆ చెరువులను, అక్కడి కాలువలను, ఆక్రమణలను, పూడ్చివేతలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. పేరున్న నిర్మాణ సంస్థ ఆ చెరువుల్లో, చెరువుల కాలువల్లోనూ పూడ్చేసినట్టు కమిషనర్ గుర్తించారని స్థానికులు వెల్లడించారు. చెరువు కాబ్జాపై స్థానికులు సంఘటితమై.. ఫిర్యాదు చేయడమే కాకుండా.. చెరువును కాపాడడంలో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తామని చెప్పడం చాలా శుభ పరిణామమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పారు.
కాముని చెరువు, మైసమ్మ చెరువు పరిసరాల్లో నివాసితులు చెరువులు కబ్జా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మైసమ్మ చెరువు పరిసరాలను కమిషనర్ పరిశీలించారు. 17 మీటర్ల వెడల్పుతో నిర్మించ తలపెట్టిన వరద కాలువను పూర్తి స్థాయిలో వెంటనే నిర్మించాలని నిర్మాణ సంస్థకు సూచించారు. వరద కాలువను మళ్లించడం వల్ల దిగువన వున్న సఫ్దార్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ బస్తీలు వర్షా కాలంలో మునిగిపోయాయని స్థానికులు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వచ్చే వర్షా కాలనికి ఆ యిబ్బంది లేకుండా కాముని చెరువు, మైసమ్మ చెరువుల మధ్య వున్న వరద కాలువ నిర్మాణ పనులను పూర్తి చేసేలా చూడాలని స్థానిక అధికారులను కమిషనర్ ఆదేశించారు.