తెలుగు ప్రజలకు సినిమాలతో బలమైన బంధముంది. మద్రాస్ వెళ్లిన తెలుగు యాత్రికులు ఎన్‌టి రామారావును చూడకుండా వచ్చేవారు కాదు. పొద్దుటే ఆయన బాల్కనీ నుండి దర్శనం ఇస్తుండేవారు. బాగున్నారా.. పంటలు బాగా పండుతున్నాయా అని పలకరించేవారు. తొలినాళ్ల నుండి సినిమా ప్రేక్షకులకు నటీనటుల పట్ల ఆరాధ్య భావన ఉంటోంది. ప్రతి ఒక్కరిలో ఎవరో ఒక అగ్ర హీరో, హీరోయిన్‌లపై కొద్దో గొప్పో అభిమానం కూడా చూస్తుంటాం. అభిమాన సంఘాల హడావుడి సంగతి సరేసరి. అయితే ఈ దృశ్యం క్రమంగా మసకబారుతోంది. నటులుగా తమకు సమాజంపై బాధ్యత ఉంటుందని భావించే సినీతరం తగ్గిపోయింది. తప్పు పనులు చేయకూడదు, చేస్తే వాటి ప్రభావం తమ వ్యక్తిత్వంపై, సినీప్రస్థానంపై పడుతుందనే ఆలోచన, భయం ఇప్పటి సినిమావాళ్లలో తక్కువగా ఉంది.
సినిమాల్లో వ్యాపారధోరణి పెరిగి ప్రేక్షకులు, అభిమానులు అనే పదాలు సినిమా విజయానికి, రాబడికి వాడుకో బడుతున్నాయి. నేటి సినిమావాళ్లు ప్రజలకు ఇచ్చేదేమీ లేకున్నా, జనం సొమ్ముతో బడ్జెట్‌ను ఎలా రాబట్టుకోవాలో అనే ఆలోచనే వారికి ప్రధానమైంది. ఇలా క్రమంగా పాత విలువలకు దూరమవుతూ సినీజీవులు రకరకాల సమస్యలను సృష్టిస్తున్న ఉదంతాలు ఈ మధ్య వరుస కడుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఉత్పన్నమైన కొన్ని సంఘటనలు రాజకీయ దుమారాన్నికూడా రేపాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు సినిమావాళ్లతో మంచి సంబంధాలనే నెరుపుతుంటాయి. ఎన్నికల ప్రచారానికి వాడుకోవచ్చని మర్యాద ఇస్తుంటారు. అయితే ఈ మధ్య లోబడ్జెట్ సినిమాలు పెరిగి పెద్దనటుల సినిమాలు తగ్గిపోతున్నాయి. పాన్ ఇండియా సినిమాలపై పెట్టిన డబ్బు కోసం యువతను ఆకర్షించే పనిలోపడి పరిశ్రమ కుటుంబ ప్రేక్షకులకు దూరమవుతోంది.
దీనివల్ల సినిమావాళ్లపై రాజకీయ పార్టీలకు గురి కూడా తగ్గిపోతోంది. వారిని ప్రత్యేకంగా చూడాలనే అవసరం కూడా ఇప్పుడు కానరావడం లేదు. దీనికి కారణం సినిమావాళ్ల తీరే ప్రధానమని చెప్పుకోవచ్చు. తమ హీరోలను ఏమైనా అంటే ఊరుకొనేది లేదు అనే వీరాభిమాన ప్రేక్షకులు కూడా కరువవుతున్నారు. ఈ మధ్య హీరో నాగార్జున ఫంక్షన్ హాల్‌ను హైడ్రా యంత్రాలు నిట్టనిలువునా కూల్చేసినా అడిగేనాథుడే లేకుండాపోయాడు. తప్పు ఆయనదా కాదా అనే విషయం పక్కనపెడితే ప్రముఖ హీరోగా పేరు, గుర్తింపు ఉన్నా ఆయన్ని తాకడానికి ప్రభుత్వం వెనుకాడలేదు. పైగా హైదరాబాద్ చెరువుల పరిరక్షణకు బయలుదేరిన ఆ ప్రభుత్వ సంస్థ ఏకంగా నాగార్జున షెడ్ల నేలమట్టంతోనే తన పనికి శ్రీకారం చుట్టింది. చెరువు ఒడ్డుపై 2010లో నిర్మించిన ఈ కట్టడం కోర్టు స్టేపై కొనసాగి 14 ఏళ్ల తర్వాత ఆగస్టు 24 న కూల్చబడింది. ఈ చర్యతో సినిమావాళ్లంటే గొప్పేమీ కాదని ప్రభుత్వం చేతల ద్వారా రుజువు చేసింది.
మామూలు మనుషులకు, సినిమావాళ్లకు తేడా ఏమి లేదని మొత్తం సినీ పరిశ్రమకే రేవంత్ సర్కారు షాకిచ్చింది. దెబ్బ మీద దెబ్బగా నాగార్జున కుటుంబాన్ని మంత్రి కొండా సురేఖ అక్టోబర్ 3 న వార్తల్లోకి లాగారు. నాగార్జున కొడుకు విడాకుల విషయంలో కెటిఆర్ ప్రమేయం ఉందంటూ ఆవిడ సినీరంగానికి, రాజకీయాలకు కొత్త ముడివేశారు.సినీ పరిశ్రమ యావత్తు మంత్రి మాటల పట్ల మూకుమ్మడిగా తీవ్ర అభ్యంతరం తెలపగా చిన్న మాటతో ఆమె కథ ముగించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని కెటిఆర్ కోర్టుకు వెళ్లారు. కానీ నాగార్జున పరివారం మాత్రం ఇది ఇంతటితో ఆగితే చాలనుకున్నారు. ప్రభుత్వంలో ఉన్న ఒక మహిళా మంత్రితో యుద్ధానికి దిగితే మరింత చిక్కుల పాలవడమే అని వారు అనుకున్నారేమో. ఇలా ఘనమైన అక్కినేని వారసత్వం తల దించుకోక తప్పలేదు.
నటుడు మోహన్ బాబు పదవ తేదీన ఒక టివి ఛానల్ రిపోర్టర్‌పై దాడి చేయడం అత్యంత హేయమైన సంఘటనగా చెప్పుకోవాలి. 2007లో ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. 1995 -2000 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1993 నుండి ఓ విద్యాసంస్థను నడుపుతున్నారు.అలాంటి వ్యక్తి విలువలన్నీ మరచి తీవ్ర ఆవేశంతో ఛానల్ మైకును లాక్కొని విలేకరి తలపై తీవ్రంగా కొట్టిన దృశ్యాలు అందరు చూశారు. 72 ఏళ్ల వయసులో సహనం, సంయమనాన్ని మరిచిన ఆయన ఈ దుశ్చర్యతో తీవ్ర విమర్శను ఎదుర్కోక తప్పలేదు. విలేకరులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ‘మోహన్ బాబు పరారీ -పోలీసు బృందాల గాలింపు’ అని టివి స్క్రోలింగ్స్ వచ్చాయి. ఐదు రోజుల తర్వాత ఆయన దిగి వచ్చి హాస్పిటల్‌కు వెళ్లి ఆ విలేకరి ముందు పశ్చాత్తాపం ప్రకటించక తప్పలేదు.
ఇక ఇప్పుడు ఫోకస్ అంతా అల్లు అర్జున్‌పై పడింది.డిసెంబర్ 4 రాత్రి మొదలయ్యే పుష్ప 2 ప్రీమియర్ షోకు వచ్చిన ఓ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. హీరో అల్లు అర్జున్ రాకతో ఏర్పడ్డ తొక్కిసలాటలో ఇల్లాలు చనిపోగా, ఓ బాలుడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్లో అల్లు అర్జున్ పేరు కూడా చేర్చారు.13వ తేదీన ఆయనను పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించగా అదే రోజు సాయంత్రం మధ్యంతర బెయిల్ లభించింది.14 ఉదయం విడుదలై ఇంటికి చేరుకున్నారు. విషాదంలో ఉన్న కుటుంబాన్ని హీరో పరామర్శించకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు ఆయన అరెస్టు, విడుదలపై సినీ పరిశ్రమ చేస్తున్న సందడి అతిగా ఉందని అంటున్నారు.
అయితే రకరకాల వీడియో క్లిప్పింగ్స్‌తో నెటిజన్లు ఈ సందర్భానికి రాజకీయ రంగు పులుముతున్నారు. సినిమా కార్యక్రమంలో అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి పేరును మరిచిపోయి తడబడడం ఒక వీడియోలో ఉంది. ఈ అరెస్టుతో రేవంత్ బదులు తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. సినిమా పరిశ్రమలో బలమైన ఈ కుటుంబం రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ను తికమక పెట్టినా ఆశ్చర్యం లేదు. అల్లు అర్జున్ అరెస్టు విడుదల చూస్తుంటే రాష్ట్రం లోపలేస్తే కేంద్రం విడిపించినట్లుంది. ఇదే కోణంలో విభేదాలు పెరగవచ్చు. ఈ సంఘటనల నేపథ్యంలో- ఫక్తు వ్యాపారంగా మారిన సినీ పరిశ్రమపై ప్రభుత్వం కఠినంగానే ఉండాలి. ప్రీమియర్ షోలు, మొదటి వారాల ప్రదర్శనల టికెట్ల ధరల పెంపు, భారీ ప్రమోషన్ ఫంక్షన్లకు అనుమతి లాంటి విషయాలను పునఃసమీక్షించాలి. పుష్ప తొక్కిసలాట తర్వాత ఇకపై స్పెషల్ షోలు, అధిక ధరలు ఉండవని మంత్రి కోమటి రెడ్డి అన్నట్లు వార్తల్లో వచ్చింది. ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంటే ప్రేక్షకుల బాధలు తీరుతాయి. పరిశ్రమ కూడా బాగుపడుతుంది.
బి.నర్సన్ 94401 28169