నాణేనికి బొమ్మా బొరుసూ ఉన్నట్లుగానే సమాజంలో మంచీ చెడూ కూడా పక్కపక్కనే ఉంటాయి. ఏది మంచో, ఏది చెడో గుర్తించి మసలుకోవడంపైనే మన తెలివితేటలు ఆధారపడి ఉంటాయి. నానాటికీ కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానమూ ఇంతే. దీంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అన్ని దుష్ప్రయోజనాలూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెచ్చుమీరుతున్న సైబర్ నేరాలకు ఈ సాంకేతిక పరిజ్ఞానమే ఆధారభూతమవుతోంది. కొత్తరకం పరిజ్ఞానాన్ని ఇట్టే అందిపుచ్చుకుని అవకాశాలు వెతుక్కోవడంలో భారతీయులు ముందుంటారు.
మూడు దశాబ్దాల క్రితం సమాచార సాంకేతిక పరిజ్ఞానం కొత్తగా వెలుగుచూసినప్పుడు సంబంధిత కోర్సులను అందరికంటే ముందుగా అభ్యసించి అవకాశాలను వెతుక్కుంటూ పాశ్చాత్య దేశాల్లో పాగా వేసినవారిలో అగ్రగణ్యులు మనవాళ్లే. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఐటి రంగంలో భారతీయులు అగ్రస్థానాల్లో ఉండటానికి కారణం వారి ముందుచూపే. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరా చేసుకుని మోసాలు చేయడంలోనూ మనవాళ్లు ఆరితేరిపోయారనేదే విచారించదగిన అంశం. లింక్ పంపించి దాన్ని క్లిక్ చేస్తే కోట్ల రూపాయలు వచ్చి ఒళ్లో వాలతాయని నమ్మించి మోసం చేయడం, పిన్ నంబర్ చెబితే వెంటనే ఖాతాలో లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామంటూ బురిడీ కొట్టించడం పాత పద్ధతి. అమాయక జనాన్ని మోసం చేస్తే వచ్చే లాభం అంతంతమాత్రంగానే ఉంటుంది కాబట్టి, బాగా చదువుకున్నవారినే టార్గెట్ చేసుకుని, వలలోకి లాగి కోట్ల రూపాయలు కాజేస్తున్న సైబర్ నేరగాళ్ల బెడద ఇప్పుడు ఎక్కువైపోయింది.
ఇటీవల భాగ్యనగరానికి చెందిన ఓ డాక్టర్‌ను ట్రేడింగ్ బిజినెస్ పేరిట సైబర్ నేరగాళ్లు బుట్టలో వేసుకుని, 34 విడతలుగా పదకొండు కోట్లకు పైనే తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. మరో సంఘటనలో ఓ వితంతు మహిళని ట్రాయ్ అధికారులమంటూ బెదిరించి ఐదున్నర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ రెండు సంఘటనల్లోనూ బాధితులు, మోసగాళ్లు భారతీయులే కావడం, పైగా విద్యాధికులే కావడం విశేషం. తాజాగా డిజిటల్ అరెస్టు పేరిట బెదిరింపులు ఎక్కువయ్యాయి. సైబర్ నేరగాళ్లు తమను తాము పోలీసులమనో, కోర్టు అధికారులమనో పరిచయం చేసుకుని నకిలీ అరెస్టు వారెంట్లు లేదా సమన్లు పంపించి బెదిరిస్తారు. ఆన్‌లైన్‌లో జరిమానా చెల్లిస్తే గండం గట్టెక్కవచ్చని నమ్మబలుకుతారు. ఈ తరహా డిజిటల్ అరెస్టులపై అవగాహన లేకపోవడంతో బాధితులు నిజమేనని నమ్మి మోసపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సైబర్ నేరగాళ్ల ఆగడాలు రానురాను పెచ్చుమీరుతున్నాయి.
ఇటీవల ఒడిశాకు చెందిన ఓ రిటైర్డ్ డాక్టర్‌ను బురిడీ కొట్టించి కోటి రూపాయలు కాజేసిన నిందితుడు నిజామాబాద్‌లో పట్టుబడ్డాడు. మరో సంఘటనలో సైబర్ ముఠాలకు ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని చేరవేసి, పరోక్షంగా సైబర్ నేరాలకు సహకరిస్తున్న ఓ యువకుడిని నిర్మల్‌లో పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపడంలో రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అవిశ్రాంతంగా కృషి సలుపుతోంది. గత నెలలో రాష్ట్రంలో పలు నేరాలతో సంబంధం ఉన్న 48 మందిని అరెస్టు చేసి, కటకటాల వెనక్కు నెట్టారు. ఉద్యోగాలపేరిట ఇక్కడి యువతకు గాలం వేసి, కంబోడియాకు తరలించి వారి చేత సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠాలోని కీలక వ్యక్తిని అరెస్టు చేయడం ఇటీవల తెలంగాణ సైబర్ పోలీసులు సాధించిన ఘనవిజయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ఇటీవల ‘మన్ కీ బాత్’ లో ప్రధాని ఆందోళన వెలిబుచ్చడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.
బాధితులు సకాలంలో పోలీసులకు సమాచారం చేరవేయడంలో జాప్యం చేయడం, నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంలో బ్యాంకు అధికారుల ఉదాసీన వైఖరి కూడా మోసగాళ్లకు వరంగా మారుతున్నాయి. ఈ విషయంలో పోలీసులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేస్తే తప్ప నేరాలకు ముకుతాడు పడే అవకాశం లేదు. సైబర్ నేరాలపై ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు పోలీసులు శ్రమిస్తున్నా ఫలితం అంతగా కానరావడం లేదు. ఈ విషయంలో పోలీసులతోపాటు బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడుం బిగించవలసిన అవసరం ఉంది. సైబర్ మోసాలపై హైస్కూలు స్థాయి నుంచి కోర్సులు ప్రవేశపెట్టే విషయాన్ని ప్రభుత్వాలు పరిశీలించాలి. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ సైబర్ సెల్ ఏర్పాటు చేసి, నిపుణులను నియమించడం వల్ల సాధ్యమైనంత వరకూ నేరాల వ్యాప్తిని నిరోధించవచ్చు.