మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి
మన తెలంగాణ /వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లోతుకుంట ఆదర్శ పాఠశాలలో విద్యార్థులను చేతులు విరిగేలా దండించిన ప్రిన్సిపాల్ రహిసున్నీషా బేగం పై వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ మంగళవారం డిమాండ్ చేశారు. లోతుకుంట ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు ఇటీవల ఉదయం రాగి జావ తాగే సమయంలో ఇంకా ఎంతసేపు తాగుతారని ఇద్దరు విద్యార్థినిల పట్ల ప్రిన్సిపాల్ కిరాతకంగా ప్రవర్తిస్తూ విద్యార్థినుల చేతి వేళ్లు విరిగేలా దండించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై ఎఐవైఎఫ్ పాఠశాల విద్యార్థులను విషయం అడిగి తెలుసుకున్నారు. ఇంత దారుణంగా దండించిన ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేసి వారికి పూర్తిగా నయం అయ్యే వరకు ప్రభుత్వమే చికిత్స అందించాలని కోరారు. అనంతరం మండల విద్యాధికారి సుంకోజు భాస్కర్ కు కలిసి విద్యారంగ సమస్యల పై వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు బూడిద సాయిచరణ్, గణేష్,తదితరులు పాల్గొన్నారు.