Sunday, January 19, 2025

తీరు మారని బ్యాటర్లు..

- Advertisement -
- Advertisement -

భారత్‌ను వెంటాడుతున్న బ్యాటింగ్ వైఫల్యం

మన తెలంగాణ/ క్రీడా విభాగం: కొంత కాలంగా టెస్టుల్లో టీమిండియాకు బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టులతో పాటు తాజాగా జరుగుతున్న బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలను బ్యాటింగ్ ఇబ్బందులు తప్పడం లేదు. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌తో సహా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌ల వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా పరిగమించింది. జట్టును ముందుండి నడిపించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఘోరంగా విఫల మవుతున్నాడు.

రోహిత్ ఇప్పటి వరకు ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలోనూ నిరాశ పరిచాడు. ఒక్కసారి కూడా మెరుగైన స్కోరును సాధించలేక పోయాడు. తాజాగా మూడో టెస్టులోనూ విఫలమయ్యాడు. కేవలం పది పరుగుతు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక మరో కీలక ఆటగాడు విరాట్ కోహ్లిది కూడా ఇలాంటి పరిస్థితే. కోహ్లి కూడా ఈ సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత రికార్డు కలిగిన కోహ్లి ఈసారి మాత్రం అలాంటి బ్యాటింగ్‌ను కనబరచ లేకపోతున్నాడు. మూడు టెస్టుల్లోనూ పూర్తిగా తేలిపోయాడు. ఈ సిరీస్‌లో జట్టు కోహ్లిపైనే భారీ ఆశలు పెట్టుకుంది. అయితే విరాట్ మాత్రం చెత్త బ్యాటింగ్‌తో జట్టుకు భారంగా మారాడు.

వరుస వైఫల్యాలు చవిచూస్తున్న అతన్ని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ రోజురోజుకు జోరందుకుంటోంది. మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, వెంగ్‌సర్కార్, శ్రీకాంత్, అనిల్ కుంబ్లే తదితరులు కోహ్లి బ్యాటింగ్ వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరీస్‌లో అతని బ్యాటింగ్ చాలా పేలవంగా ఉందని, కోహ్లి ఇలా ఆడతాడని తాము ఊహించలేదని వారు విమర్శిస్తున్నారు. యువ ఆటగాళ్లు యశస్వి, గిల్ కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నారు. ఇద్దరు రెండు టెస్టుల్లో పూర్తిగా విఫలమయ్యారు. వీరి వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారుతోంది. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొవడంలో గిల్, యశస్విలు విఫలమవుతున్నారనే చెప్పాలి.

అపార ప్రతిభ దాగివున్న ఇద్దరు ఒక్క మ్యాచ్‌లో కూడా తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్ కనబరచక పోవడం గమనార్హం. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ది కూడా ఇలాంటి పరిస్థితే. అతను కూడా పూర్తిగా చేతులెత్తేస్తున్నాడు. జట్టుకు అండగా నిలువడంలో విఫలమవుతున్నాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇలా టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ విఫతమవుతుండడంతో భారత్‌కు సిరీస్‌లో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే రెండో టెస్టులో ఓడిన భారత్ మూడో టెస్టులోనూ కష్టాల్లో చిక్కుకుంది. దీనికి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News