హైదరాబాద్: దేశ వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వ్యాపారాలు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లుగా దేశ ప్రతిష్ఠతను పెంపొందించిందని, కానీ.. అదానీ, ప్రధాని కలిసి ప్రపంచం ముందు భారతదేశం పరువు తీస్తున్నారని సీఎం మండిపడ్డారు. అదానీ వ్యవహారంపై కేంద్ర తీరును ఖండిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ చలో రాజ్ భవన్ పేరుతో నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం రోడ్డపై బైఠాయించి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సిఎం రేవంత్ రెడ్డి.. ‘అదానీ సంస్థలు లంచాలు ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇది మనదేశ గౌరవానికి భంగం కలిగించడమే. అదానీపై విచారణ జరగాలి. జేపీసీలో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారు. అయినా కేంద్రం స్పందించడం లేదు. అందుకే దేశవ్యాప్తంగా రాజ్‌భవన్‌ల ముట్టడి కార్యక్రమం చేపట్టాం’ అని తెలిపారు.