లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలరు ప్రతిపాదిస్తున్న రెండు బిల్లులను పరిశీలించనున్న పార్లమెంటరీ కమిటీలో ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారి కాంగ్రెస్ ప్రతినిధులుగా ఉండనున్నారని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నుంచి కల్యాణ్ బెనర్జీ, డిఎంకె నుంచి పి విల్సన్ కమిటీలో ఉండవచ్చునని ఆ వర్గాలు సూచించాయి. పార్లమెంట్ సంయుక్త కమిటీలో గరిష్ఠ సంఖ్యలో సభ్యులు కలిగి ఉండనున్న బిజెపి తన ఎంపికలపై నోరు మెదపడం లేదు. అయితే, సీనియర్ ఎంపి రవిశంకర్ ప్రసాద్, అనురాగ్ ఠాకూర్ పేర్లను కమిటీ సభ్యత్వానికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపి మిత్ర పక్షాల్లో శివసేనకు చెందిన శ్రీకాంత్ షిండే, జెడి (యు)కు చెందిన సంజయ్ ఝా ఆ కీలక కమిటీలో సభ్యులు కావచ్చునని ఆ వర్గాలు సూచించాయి.
జెపిసిలో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపిలు ఉంటారు. సంయుక్త కమిటీకి బిల్లులు పంపాలని కోరుతూ లోక్‌సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న ప్రభుత్వానికి చాలా వరకు పార్టీలు తమ నిర్ణయాలను తెలియజేశాయి. కమిటీ సభ్యుల పేర్లు, చైర్‌పర్సన్‌పై స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారు. జెపిసికి కాంగ్రెస్ ఇతర నామినీల్లో సుఖ్‌దేవ్ భగత్, రణ్‌దీప్ సుర్జేవాలా ఉన్నారు. టిఎంసికి చెందిన సాకేత్ గోఖలే, డిఎంకెకు చెందిన టిఎం సెల్వగణపతి కూడా కమిటీలో భాగం కావచ్చు. కమిటీలో బిజెపి నామినీగా పిపి చౌదరి పేరు పరిశీలిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్‌లో తమ అధిక సంఖ్యా బలం కారణంగా కాషాయ పార్టీ, దాని మిత్ర పక్షాలు ఆధిక్యంతో ఉంటాయి. సుప్రసిద్ధ న్యాయవాది అయిన రవిశంకర్ ప్రసాద్ గత మోడీ ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. చౌదరి మంత్రివర్గంలో ఉప మంత్రిగా ఉన్నారు. బిజెపికి పెద్ద మిత్ర పక్షం అయిన తెలుగు దేశం పార్టీ (టిడిపి) నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు గాని, జిఎం హరీష్ బాలయోగి గాని కమిటీలో ఉండవచ్చు.
బిజూ జనతా దళ్ (బిజెడి) నుంచి ప్రతినిధిగా మానస్ రంజన్ మంగరాజ్ ఉందవచ్చు. రాజ్యాంగ సవరణ అవసరమైన బిల్లుతో సహా ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ (ఒఎన్‌ఒఇ) బిల్లులు రెండూ జమిలి ఎన్నికల నిర్వహణకు యంత్రాంగాన్ని నిర్దేశిస్తున్నాయి. వాటిని తీవ్ర చర్చ అనంతరం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సవరణ బిల్లు, ఒక సాధారణ బిల్లు ముసాయిదా చట్టాలను ఫెడరల్ వ్యవస్థపై దాడిగా ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆ ఆరోపణను ప్రభుత్వం తోసిపుచ్చింది. కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ, ఆ బిల్లులు ‘రాజ్యాంగవ్యతిరేకమైనవి’ అని అభివర్ణించారు. బిజెపి, టిడిపి, జెడి (యు), శివసేన వంటి దాని మిత్ర పక్షాలు ఆ బిల్లులను గట్టిగా సమర్థించాయి.