Thursday, December 19, 2024

బ్రెయిన్ స్ట్రోక్‌కు ఆరోగ్య జీవనశైలే రక్ష

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ (Global Burden of Diseases – GBD) అధ్యయనం ప్రకారం భారత దేశంలో అత్యధిక మరణాలకు రెండవ సాధారణ కారణం స్ట్రోక్. స్ట్రోక్ అనేది రక్తం గడ్డకట్టడం (క్లాట్) లేదా దెబ్బతిన్న రక్తనాళం కారణంగా మెదడుకు రక్తప్రసరణలో అంతరాయం కలిగినప్పుడు సంభవించే వైద్య అత్యవసర పరిస్థితి. ఆక్సిజన్, పోషకాలను స్వీకరించడానికి మెదడుకు స్థిరమైన రక్తప్రవాహం అవసరం. కాగా స్ట్రోక్ (కొన్నిసార్లు ‘మెదడు దాడి’ అని కూడా అంటారు) కేవలం కొన్ని నిమిషాల్లోనే తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ప్రతి 40 సెకన్లకు ఒక స్ట్రోక్, ప్రతి 4 నిమిషాలకు ఒక మరణంతో భారత దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1,85,000 మంది స్ట్రోక్‌లకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే బ్రెయిన్ స్ట్రోక్ సంఘటనలలో 68.6% మన దేశంలోనే సంభవిస్తున్నాయి. స్ట్రోక్‌కు గురైన వారిలో దాదాపు 70.9% మృత్యువాతపడుతుండగా, 77.7% వైకల్యం సర్దుబాటు చేయబడిన జీవిత సంవత్సరాలు (Disability Adjusted Life Years – DALY) గడపాల్సి వస్తుంది. GBD 2010 స్ట్రోక్ ప్రాజెక్ట్ మరొక ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే దాదాపు 52 లక్షలు లేదా 31 శాతం స్ట్రోక్‌లు 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో సంభవిస్తున్నాయి. స్ట్రోక్ భారం భారతదేశంలో ఎక్కువగా ప్రత్యేకించి యువకులు, మధ్యవయస్కులలో ఉంటున్నది. డబ్లుహెచ్‌ఒ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు అరవై ఐదు లక్షల మంది స్ట్రోక్ కారణంగా మరణిస్తున్నారు. అందుచేత ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలకు ఇది మూడవ ఆరోగ్య సమస్యగా పరిగణించబడుతోంది. 25 సంవత్సరాలు దాటిన ప్రతి నలుగురిలో ఒక వ్యక్తికి జీవితకాలంలో ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. గుండెపోటు (హార్ట్ అటాక్) మరియు బ్రెయిన్ స్ట్రోక్ (మెదడుకు యొక్క రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడడం లేదా చిట్లడంతో పాటు ఒక భాగానికి ఆక్సిజన్ చేరకపోవడం వలన ఆ భాగం యొక్క కణ మరణానికి దారి తీయడంతో మెదడులోని ఒకటి లేదా అనేక భాగాలు దెబ్బతినడం) రెండూ కూడా రక్త ప్రసరణలో ఆకస్మిక కోత కారణంగా ఏర్పడే వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు. గుండెకు సరఫరా అయ్యే రక్త ప్రసరణలో అకస్మాత్తుగా అవరోధం ఏర్పడడంతో గుండెపోటు సంభవిస్తే మెదడులో రక్త ప్రసరణలో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడడంతో స్ట్రోక్ సంభవిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. అలా సంభవించినప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పూర్తిగా తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. పూర్తి అంతరాయం ఏర్పడిన కొన్ని నిమిషాల్లో, మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. బ్రెయిన్ స్ట్రోక్ అధిగమించడం అనేది తక్షణ వైద్య సహాయంపై ఆధారపడి ఉంటుంది. తక్షణ చికిత్సతో 80 శాతం స్ట్రోక్‌లను నివారించవచ్చు. ఈ సంఘటన తరువాత ప్రతి క్షణం కూడా రోగి మనుగడకు అత్యంత అమూల్యమైనది. మెదడుకు రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడినప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది. ఇది మెదడును దెబ్బతీయడంతో పాటు కండరాలకు సంకేతాలను పంపకుండా నిరోధించవచ్చు. పర్యవసానంగా పక్షవాతం రావడమేకాక ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కండరాలలో కదలికను కోల్పోయే అవకాశం ఉంటుంది. స్ట్రోక్ కొన్ని సార్లు తాత్కాలిక లేదా శాశ్వత వైకల్యాలకు కూడా కారణమవుతుంది. మెదడులో రక్త ప్రవాహం నిలిచిపోయిన వ్యవధి, దాని కారణంగా ప్రభావితమైన శరీరభాగాన్ని బట్టి సంక్లిష్టతలు ఆధారపడి ఉంటాయి. కండరాల కదలిక కోల్పోవడాన్ని ‘పక్షవాతం’ అంటారు. శరీరంలోని అన్ని అవయవాలను నియంత్రించడంతో పాటు మెదడు నుండి సంకేతాలను చేరవేసే సమాచార వ్యవస్థగా పనిచేసే నాడీ మండలంలో సమస్య ఏర్పడినప్పుడు అది పక్షవాతానికి కారణమవుతుంది. ఇలాంటి సందర్భాలలో తక్షణ వైద్య చికిత్సతో 80 శాతం స్ట్రోక్‌లను నివారించవచ్చు. స్ట్రోక్ సంకేతాలు, లక్షణాలను త్వరగా గుర్తించడం, ప్రాథమిక లక్షణాలు కనిపించిన 3 గంటలలోపు అత్యవసర చికిత్స అందించడం చాలా ముఖ్యం. పక్షవాతం అనేది స్ట్రోక్ అత్యంత సాధారణ సమస్యలలో ఒకటి, ఇది 90 శాతం మంది స్ట్రోక్ రోగులను ప్రభావితం చేస్తుంది. ఇది సాధారణంగా దెబ్బతిన్న మెదడు అవతల వైపు శరీర భాగాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా పక్షవాతం ప్రభావం ముఖం (మూతి ఒక వైపు వంకర పోవడం), చెయ్యి, కాలు, ఒక వైపు మొత్తం శరీర భాగంపై ఉంటుంది. స్ట్రోక్ ఇతర లక్షణాలలో రోగి మాట్లాడటం లేదా మింగడంలో సమస్య, సరిగ్గా ఆలోచించలేకపోవడం లేదా తార్కికత్వం లోపించడం, స్పృహ కోల్పోవడం, ద్వంద్వ దృష్టి లాంటివి ఎదుర్కొనవచ్చు. అయితే సంఘటన సంభవించిన వెంటనే స్పందించి అత్యవసర చికిత్స అందించడం, వైద్యుని సలహా మేరకు మందులు తీసుకోవడంతో పాటు తగిన వ్యాయామాలు చేయడం ద్వారా శరీరంలో కోల్పోయిన కదలికను తిరిగి పొందడమే కాక స్ట్రోక్-ప్రేరిత పక్షవాతం నుండి కోలుకోవడం సాధ్యమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News