పచ్చి మతవాద పెట్టుబడిదారుల సామ్రాజ్యవాద పిచ్చి కుదరదు. వాళ్ళే వాణిజ్యవేత్తలైతే తమ కోసం, తమ తాబేదారుల కోసం వారి దోపిడీకి హద్దుండదు. అందుకు మిత్ర అమిత్ర దేశాలను కట్టడి చేస్తారు. స్వదేశ ప్రజల ఇక్కట్లనూ లెక్క చేయరు. పాత ఘనతను తిరిగి తెస్తామని మాయమాటలు చెప్తారు. నేటి అంతర్జాతీయ సమాజంలో ఈ గుణగణాల కలహ చక్రవర్తి డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ 25 నవంబర్ 2024 న సోషల్ మీడియాలో తన ఎన్నిక వాగ్దానాలను పునరుద్ఘాటించారు. కుర్చీనెక్కిన తొలి రోజే మెక్సికో, కెనడా, చైనాల నుండి వచ్చే వస్తువులపై భారీగా పన్నులు పెంచుతానన్నారు. దిగుమతులపై కొత్త సుంకాల విధింపుకు, ఆసియాలో అతిపెద్ద వ్యాపార భాగస్వాములతో సంబంధాన్ని మార్చుకుంటానని, అది వారి ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావాలను కలిగించగలదని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రతిజ్ఞ చేశాడు. రాబోయే పరిణామాలు అనిశ్చితం. అయినా తమ ఆర్థికాభివృద్ధికి అమెరికాకు అమ్మకాలపై ఆధారపడే ఆసియా దేశాలను దిగుమతి వస్తువులపై పెంచే పన్నులు దెబ్బతీస్తాయి.
2023లో అమెరికాకు అతి పెద్ద పది ఎగుమతి ఆసియా దేశాలు: 1. చైనా మొత్తం ఎగుమతులు 3.38 లక్షల కోట్ల డాలర్లు. అందులో అమెరికాకు 50,120 కోట్ల డాలర్లతో 14.8% 2. జపాన్ ఎగుమతులు 717,90 కోట్ల డాలర్లు. అమెరికాకు 14,510 కోట్ల డాలర్లతో 20.2% 3. దక్షిణ కొరియా ఎగుమతులు 63,220 కోట్ల డాలర్లు. అమెరికాకు 11,630 కోట్ల డాలర్లతో 18.4% 4. వియత్నాం ఎగుమతులు 35,470 కోట్ల డాలర్లు. అమెరికాకు 9,700 కోట్ల డాలర్లతో 27.4% 5. తైవాన్ ఎగుమతులు 43,240 కోట్ల డాలర్లు. అమెరికాకు 7,620 కోట్ల డాలర్లతో 17.6% 6. థాయిలాండ్ ఎగుమతులు 28,510 కోట్ల డాలర్లు. అమెరికాకు 4,850 కోట్ల డాలర్లతో 17% 7. మలేసియా ఎగుమతులు 31,260 కోట్ల డాలర్లు. అమెరికాకు 3,550 కోట్ల డాలర్లతో 11.3% 8. సింగపూర్ ఎగుమతులు 47,530 కోట్ల డాలర్లు. అమెరికాకు 4,490 కోట్ల డాలర్లతో 9.5% 9. ఇండియా ఎగుమతులు 43,140 కోట్ల డాలర్లు. అమెరికాకు 7,580 కోట్ల డాలర్లతో 17.6% 10. ఇండోనేసియా ఎగుమతులు 25,880 కోట్ల డాలర్లు. అమెరికాకు 2,320 కోట్ల డాలర్లతో 9%. చైనా వస్తువులపై ట్రంప్ విధించబోయే అధిక సుంకాలతో పరిశ్రమలు చైనా నుండి ప్రక్క దేశాలకు మారే అవకాశం ఉంది. దీంతో ఇతర ఆగ్నేయాసియా దేశాలకు లాభం చేకూరగలదు. ట్రంప్ పన్నులను నివారించడానికి కొన్ని దేశాలు తమ ఉత్పత్తిని బాగా తగ్గించవచ్చు. చైనా, కంబోడియా, వియత్నాం, మెక్సికో, బ్రెజిల్ ఇలా తగ్గించనున్నట్లు ప్రకటించాయి. లేదా ప్రోత్సాహకాలను కల్పించే ఇతర దేశాలకు తమ పరిశ్రమలను తరలించవచ్చు.
అమెరికా 2023లో, చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, ఇండియా, జపాన్‌ల నుండి ఎగుమతులలో ప్రథమ స్థానంలో, దక్షిణ కొరియా, ఇండోనేసియాల నుండి రెండవ స్థానంలో, మలేసియా, సింగపూర్‌లతో మూడవ స్థానంలో ఉంది. అత్యధికంగా మెక్సికో నుండి తర్వాత ఎక్కువగా చైనా, కెనడాల నుండి దిగుమతి చేసుకుంది. అమెరికా వస్తువులను పొందే మొదటి 10 దేశాలలో 6 ఆసియా దేశాలు. అమెరికా దిగుమతుల్లో వాటి శాతం 32. అనేక ఆసియా దేశాలతో అమెరికా వాణిజ్య లోటులో ఉన్నందున వస్తు సరఫరా పరస్పరం కాదు. అంటే అమెరికా ఆ దేశాలకు ఎగుమతి చేసే దానికంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది. 2024 మొదటి 9 నెలల్లో అమెరికా పెద్ద వాణిజ్య లోటు చైనాతో, తర్వాత మెక్సికో, వియత్నాంలతో ఉంది. వియత్నాంతో 9,060 కోట్ల డాలర్ల లోటు ఉంది. జపాన్, దక్షిణ కొరియాలతో వాణిజ్య లోటు మొదటి 10 స్థానాల్లో ఉంది. గత ఏడాది కాలంలో చైనా వస్తువుల దిగుమతి తగ్గించడంతో చైనాతో వాణిజ్య లోటు తగ్గింది. థాయ్‌లాండ్ వంటి దేశాలతో లోటు పెరుగుతోంది. వాణిజ్య లోటును తగ్గించడానికి దిగుమతులపై సుంకాలను పెంచాలనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు.
అయితే అతని పన్నుల పెంపును అమెరికన్లు చెల్లించవలసివస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరించారు. పెరిగిన దిగుమతుల ఖర్చులను కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయడం వల్ల స్వదేశంలో ధరలు పెరుగుతాయి. దిగుమతి పన్నుల ఖర్చులను వినియోగదారునిపై వేస్తామని ఆటోజోన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఫిలిప్ డేనియెల్ తెలిపారు. ఇప్పటికే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగింది. ట్రంప్ వలస జీవులపై కక్ష సాధింపునకు దిగనున్నారు. అమెరికా రాజకీయాలలో తలదూర్చకుండా, పాలన, విదేశీ విధానాలను ప్రశ్నించకుండా రెండు మూడు ఉద్యోగాలతో వెట్టిచాకిరి చేస్తూ, పొదుపు జీవితాలతో అటు అమెరికా, ఇటు స్వదేశీ ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి పాటు పడుతున్నవారు వలసజీవులు. ఆయన అర్థంలేని పంతాలకుపోతే అమెరికాకే నష్టం. సొంత ప్రజల కష్టాలూ పెరుగుతాయి. ఇప్పుడు ఆయన అమెరికా అధ్యక్షతను ఆహ్వానించిన విదేశీ పాలకులే రేపు ట్రంప్‌ను వ్యతిరేకించ గలరు.