భారతీయ జనతా పార్టీ (బిజెపి) మనుధర్మ శాస్త్రాన్ని పాటిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి అనసూయ సీతక్క విమర్శించారు. కుల, మత, ధనిక అంతరాలను సూచించే మనుధర్మ శాస్త్రాన్ని బిజెపి అనుసరిస్తుందని తెలిపారు. గురువారం నాడిక్కడ మంత్రి మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు దారుణమని అన్నారు. అంబేద్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడం అంటే అంబేద్కర్‌ను అవమానించడమేనని అన్నారు. దేశంలో వ్యాపారవేత్త అదానీ, ప్రధాని మోడీ, బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ పార్టీ చూస్తోందని ఆరోపించారు. ప్రతి పౌరుడి సమానత్వం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాడుతున్నారని అన్నారు.
దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. అట్టడుగు వర్గాలకు అంబేద్కర్ దేవుడని అన్నారు. రాజ్యంగాన్ని తొలగించాలనే బీజేపీ కుట్ర బయటపడిందని తెలిపారు. అంబేద్కర్ ఔనత్యాన్ని చాటింది నెహ్రూ అని అన్నారు. గాంధీ కుటుంబ పార్టీ అంటున్న మోడీ, మూడు సార్లు సీఎంగా, మూడు సార్లు పీఏంగా ఎందుకు ఉన్నారని సీతక్క మోడీని నిలదీశారు. అంబేడ్కర్ పేరు లేకుండా చేసే కుట్రను బిజెపి చేస్తోందని అన్నారు. భవిష్యత్‌లో ఒకే ఎన్నిక, ఒకే పార్టీ, ఒకే వ్యక్తి అనే కుట్రకు బీజేపీ తెరలేపిందని తెలిపారు.