తమది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రజలు పదేళ్లు అవకాశం ఇస్తే బీఆర్‌ఎస్ నేతలు చేయాల్సిన అక్రమాలన్నీ చేశారని ఆరోపించారు. ఆరుగురం ఎమ్మెల్యేలం అవమానాలు భరిస్తూ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎండగట్టామని అన్నారు. పదేళ్లు అధికారం అనుభవించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి.. ఇవాళ అసెంబ్లీకి రోజుకో డ్రెస్ వేసుకొచ్చి నిరసన తెలుపుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ నేతల లాగా తాము కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టడం లేదని అన్నారు.అనాలోచితంగా, అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయదని అన్నారు. ప్రపంచంలో కాస్ట్లీ వాటర్ ఏదైనా ఉంది అంటే అది కాళేశ్వరం వాటర్ అన్నారు. గ్రావిటీ ద్వారా వచ్చే తుమ్మిడి హెట్టిని కాదని మూడు లిఫ్టులు పెట్టి కూలిపోయే ప్రాజెక్టు కట్టి అప్పులు చేశారని మండిపడ్డారు.
పది రాష్ట్రాలకు అప్పులు ఇవ్వాల్సిన స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని, అప్పుల కుప్పగా చేశారని అన్నారు. ఇప్పుడిప్పుడే తాము అన్నీ చక్కబెడుతున్నట్లు రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఈ సభ ద్వారా నిజాలు తెలియాలి, మీరు చేసిన నిర్వాకాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందని అభిప్రాయపడ్డారు. అప్పు తెచ్చి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కట్టారు. ఇంతవరకు ఎన్జీటీ క్లియరెన్స్ లేదు. అసలు ఏ అప్రూవల్ లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టు మొదలుపెట్టారని విమర్శించారు. ఆనాడు మంత్రులుగా ఉన్న ఎవరికీ కేసీఆర్కు ఎదురు చెప్పే దమ్ము, ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అయినా, యాదాద్రి పవర్ ప్లాంట్ అయినా, రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు అయినా ఒకే ఒక్కడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని నిర్మాణం మొదలుపెట్టాడని ఎద్దేవా చేశారు. పదిమంది సలహాలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి సూచనలు ఇచ్చే స్వేచ్ఛ మాతోపాటు ప్రతిపక్ష సభ్యులకు కూడా ఉందని అన్నారు. కానీ బీఆర్‌ఎస్ పాలనలో ఈ పరిస్థితి లేదని గుర్తుచేశారు.
‘యూజ్ లెస్ ఫెలో’ సభలో హరీశ్ రావు వ్యాఖ్యలపై దుమారం : సభలో హరీశ్ రావు వ్యాఖ్యలపై గందరగోళం ఏర్పడింది. రాష్ట్ర రుణాలపై స్వల్ప కాలిక చర్చ సమయంలో ఎవడయ్యా యూజ్ లెస్ ఫెలో దొంగ అన్నది అని హరీశ్ రావు అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నన్ను దొంగ అంటే నేను యూజ్ లెస్ ఫెలో అన్నాను ఇది తప్పా? వాళ్లు అనవద్దు కదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. దీంతో గందరగోళం మరింతగా పెరిగింది. ఈ క్రమంలో మాట్లాడిన శ్రీధర్ బాబు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడింది మైక్ లో మాట్లాడలేదని అది ఎవరికి వినబడలేదని కానీ హరీశ్ రావు మైక్ లో మాట్లాడింది అందరికీ వినిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనను దొంగ అంటేనే నేను అలా అన్నానని తనను అన్న సభ్యుడిని శ్రీధర్ బాబు సమర్థిస్తారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. తనపై రన్నింగ్ కామెంటరీ చేసిన సభ్యుడిని నేను అన్నానన్నారు. ఈ క్రమంలో ’రాజగోపాల్ రెడ్డి మీరు హోమ్ మినిస్టర్ అయ్యాక మైక్ ఇస్తారని. ఇప్పుడు మీకు హెలిజిబులిటి లేదన్నారు. మీరు హోం మంత్రి కావాలి. ఐ విష్ యూ షుడ్ హోమ్ మినిస్టర్ అని హరీశ్ రావు అన్నారు.
సభను నడిపే పద్దతి ఇది కాదన్నారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి హరీశ్ రావుతో సీనియర్ సభ్యుడు. ఆయన నాకు వ్యక్తిగతంగా దగ్గరి మిత్రుడు. ఆన్ రికార్డు మైక్ లో ఓ సభ్యుడిని యూజ్ లెస్ ఫెలో అనడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే మీరు జీర్ణించుకోవడం లేదు. ఇక్కడ మాట్లాడేదంతా తెలంగాణ ప్రజలు వింటున్నారు. మేమే అధికారంలో ఉంటామని మీరనుకున్నారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. సీఎం నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుడిని పట్టుకుని అలా మాట్లాడుతున్న హరీశ్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక మీ ఆటలు సాగవని, హరీశ్ రావుకు ఏమాత్రం ఈ సభపై, సభ్యుల గౌరవం, తెలంగాణ ప్రజలపై గౌరవం ఉన్నా బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఈ మాట మరో కొత్త సభ్యుడెవరైనా అంటే పోనిలే అనుకునే వాళ్లం కానీ హరీశ్ రావు లాంటి సీనియర్ సభ్యుడు ఇలాంటి మాట్లాడటం బాధకరమన్నారు. కాగా హరీశ్ రావు వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.