హైదరాబాద్: ఫార్ములా ఈ-రేస్ విషయంలో అణాపైసా అవినీతి జరగలేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్ఎ కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలతోనే ఈ కేసులో అవినీతి లేదని తేలిందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్బులు పంపిన విధానం తప్పు అని పొన్నం అన్నారని గుర్తు చేశారు. ఈ కేసుపై రేవంత్ ప్రభుత్వం ముందుకు వెళ్తే న్యాయపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ఈ కేసులో ఎసిబికి కేసు పెట్టే అర్హత లేదన్నారు. హెచ్ఎండిఎ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని, హెచ్ఎండీఎకు ఆ మేరకు స్వతంత్రత ఉందన్నారు.
మంత్రిగా తాను ఫార్ములా ఈ-రేస్ విషయంలో విధాన నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం లోపం ఉందని, సిఎంను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని, తనపై కేసు నిలవదన్నారు. తాము లీగల్‌గా ముందుకు వెళ్తానని చెప్పారు. సభలో ప్రభుత్వం తప్పులను బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీశ్ రావు బయటపెట్టినందుకు సిట్ వేశారన్నారు. రేవంత్ కింద పనిచేసే సిట్‌తో న్యాయం జరగదని, ఓఆర్ఆర్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. కోకాపేట భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు. తనని ఏ కేసులో జైలుకు పంపాలో ప్రభుత్వానికి అర్థం కావడంలేదన్నారు.