Saturday, December 21, 2024

ఉభయ సభల్లో నిరసనలు.. పార్లమెంట్ నిరవధిక వాయిదా

- Advertisement -
- Advertisement -

ఉభయ సభల్లో కొనసాగిన నిరసనలు
ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల పోటాపోటీ ఆందోళనలు
ఎగువ సభలో ఎక్కువగా చోటు చేసుకున్న రభస

న్యూఢిల్లీ : అధికార, ప్రతిపక్ష సభ్యుల పోటాపోటీ నిరసనల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు అవమానంపై పార్లమెంట్ లో ఏ గేట్ల దగ్గరా ప్రదర్శనలు నిర్వహించరాదన్న లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఆదేశాలపైన ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల నిరసనల నేపథ్యంలో లోక్‌సభ శుక్రవారం నిరవధికంగా వాయిదా పడింది. శుక్రవారం ఉదయం లోక్‌సభ సమావేశమైన వెంటనే ‘ఒక దేశం, ఒకే ఎన్నికల’కు సంబంధించిన బిల్లుల పరిశీలనకు పార్లమెంట్ సంయుక్త కమిటీ ఏర్పాటు నిమిత్తం తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌ను స్పీకర్ కోరారు. పార్లమెంట్ గేట్ల వద్ద ప్రదర్శనలు, నిరసనలను నిషేధిస్తున్న ఆదేశాలను స్పీకర్ చడువుతుండగా సభలో ‘జై భీమ్’ నినాదాలు ప్రతిధ్వనించాయి. నిరసనలు కొనసాగుతుండడంతో స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.

సభ కార్యకలాపాలు ప్రారంభం కావడానికి ముందుగానే కాంగ్రెస్ సభ్యులు ‘జై భీమ్, జై జై భీమ్’ అంటూ నినాదాలు చేయనారంభించారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాల నడువ ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభ చాంబర్‌లోకి అడుగు పెట్టారు. మేఘ్వాల్ తీర్మానాన్ని ప్రవేశపెడుతుండగా, మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకుపోయారు. పార్లమెంట్ సెషన్ చివర్లో సంప్రదాయం ప్రకారం, ‘వందే మాతరం’ గీతం వినిపిస్తుండగా నిరసనకారులైన ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో ఉండిపోయారు. టిఎంసి మినహా, డిఎంకె, ఎన్‌సిపి సహా చాలా వరకు ప్రతిపక్షాల సభ్యులు తమ సీట్లలో నుంచి నిరసనల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రా సభకు హాజరయ్యారు.

అర్థవంతమైన చర్చ, విచ్ఛిన్నకర అవరోధం మధ్య తేడా గుర్తించాలన్న ధన్‌ఖడ్
రాజ్యసభ కూడా శుక్రవారం నిరవధికంగా వాయిదా పడింది. శాసనపరమైన కార్యకలాపాల కన్నా ఎక్కువ గలభా దృశ్యాలతోనే సభ సెషన్‌ను ముగించవలసి వచ్చింది. సభ్యులు తమ ప్రవర్తనను ఒకసారి అవలోకించుకుని. అర్థవంతమైన చర్చ, విచ్ఛిన్నకర అవరోధం మధ్య తేడాను గుర్తించాలని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ విజ్ఞప్తి చేశారు. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రెండు బిల్లుల పరిశీలించే జెపిసికి రాజ్యసభ సభ్యులు 12 మందిని నామినేట్ చేయడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించిన తరువాత సభ నిరవధికంగా వాయిదా పడింది. చైర్మన్ ముగింపు ఉపన్యాసం ఇస్తూ, ‘మనం రాజకీయ విభేదాలు విడనాడి పార్లమెంటరీ చర్చ పవిత్రతను పునరుద్ధరించాలని మన ప్రజాస్వామ్య వారసత్వం కోరుతోంది’ అని చెప్పారు. నవంబర్ 25న మొదలైన శీతాకాల సమావేశాల్లో సభ కేవలం 43 గంటల 27 నిమిషాలు పని చేసిందని, కేవలం 40.03 శాతం ఉత్పాదకత నమోదైందని ఆయన తెలియజేశారు. సభా నాయకుడు జెపి నడ్డా, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, ఎన్‌డి గుప్తా, తిరుచ్చి శివ, జైరామ్ రమేష్ సహా ఇతర నేతల సూచనను పరిగణనలోకి తీసుకుని తాను ముగింపు వ్యాఖ్యలు చేస్తున్నట్లు ధన్‌ఖడ్ తెలిపారు.

‘మన రాజ్యాంగం 75వ వార్షికోత్సవంతో ఈ సెషన్‌ను మనం ముగిస్తున్నందున తీవ్ర పునరాలోకనం చేసుకోవలసిన స్థితిని ఎదుర్కొంటున్నాం. చారిత్రక సంవిధాన్ సదన్‌లో సంవిధాన్ దివస్‌ను మనం వేడుకగా జరుపుకోవడం ప్రజాస్వామిక విలువలను పునరుద్ఘాటించడానికి ఉద్దేశించినదని, కానీ ఈ సభలో మన చర్యలు విభిన్న కథనాన్ని చెబుతున్నాయి. ఈ కఠోర వాస్తవం ఇబ్బందికరమైంది. ఈ సెషన్ ఉత్పాదకత కేవలం 40.03 శాతంగా ఉన్నది. కేవలం 43 గంటల 27 నిమిషాలు పని చేసింది. పార్లమెంటేరియన్లుగా మనం దేశ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాం. అది సరైనది కూడా. ఈ నిరంతర అంతరాయాలు మన ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని క్రమంగా హరిస్తున్నాయి’ అని ధన్‌ఖడ్ అన్నారు. ఎగువ సభ చమురుక్షేత్రాల సవరణ బిల్లును, బాయిలర్ల బిల్లు 2024ను ఆమోదించిందని, భారత, చైనా సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి ప్రకటన చేశారని, కానీ ఆ విజయాలను ‘మన వైఫల్యాలు’ క్రీనీడలోకి చేర్చాయని ఆయన పేర్కొన్నారు.

‘పార్లమెంటరీ పరిశీలనకు ముందే మీడియా ద్వారా నోటీసులు అంతకంతకు ప్రచారం అవుతున్న ధోరణి, 267 నిబంధనకు పట్టుబట్టడం మన వ్యవస్థాగత గౌరవాన్ని మరింత దెబ్బ తీస్తున్నది’ అని ధన్‌ఖడ్ చెప్పారు. ఉదయం సభ సమావేశమైనప్పుడు ప్రతిపక్ష సభ్యుల నిరసనలు చోటు చేసుకున్నాయి. ఆ గలభా నడుమ సభ వాయిదా పడింది. సభలో ప్రతిష్టంభన అంతం చేయడానికి చైర్మన్ సభా నాయకుడు జెపి నడ్డా, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, వివిధ ప్రతిపక్షాల నేతలతో కూడా సమావేశం జరిపారు. సభ మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు జమిలి ఎన్నికల బిల్లులను పరిశీలించే జెపిసికి ఎగువ సభ సభ్యులను నామినేట్ చేసేందుకు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌ను చైర్మన్ కోరారు. తీర్మానాన్ని సభ మూజువాణి వోటుతో ఆమోదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News