పార్లమెంటు ఉభయ సభల్లోనూ, ఆవరణలోనూ గడచిన మూడు రోజులు చోటు చేసుకున్న సంఘటనలు సభ్యసమాజాన్ని విస్తుపోయేలా చేశాయంటే అతిశయోక్తి కాదు. అధికార, విపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలగడమే కాదు, ఈ ఆందోళనలు శ్రుతిమించి పార్లమెంటు ప్రాంగణంలో సభ్యులు ఒకరినొకరు తోసుకోవడం, కొందరు గాయాలపాలు కావడం.. దరిమిలా పోలీసు స్టేషన్లకు వెళ్లి పరస్పరం కేసులు పెట్టుకోవడం ప్రజాస్వామికవాదులను కలవరానికి గురి చేసింది. అంతకుమించి, ఈ గలభాకు, అల్లర్లకు భారత రాజ్యాంగ నిర్మాత, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను కేంద్ర బిందువుగా చేసుకోవడం విచారకరం, గర్హనీయం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ అంబేద్కర్ పేరును పదే పదే జపించే బదులు, దేవుడిని తలచుకున్నా ఏడేడు జన్మల స్వర్గప్రాప్తి లభించేదంటూ వ్యాఖ్యానించారని, ఇది అంబేద్కర్‌ను అవమానించడమేనని కాంగ్రెస్ సభ్యులు ఆ మరునాడు సభలో ధ్వజమెత్తారు. ఇందుకు అమిత్ షా క్షమాపణ చెప్పడంతోపాటు, రాజీనామా చేయాలని పట్టుబట్టడంతో గలభా మొదలైంది. హోం మంత్రి వ్యాఖ్యల తాలూకు వీడియోను సైతం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అంతటితో ఆగని విపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. ప్రతిపక్ష సభ్యుల దాడిని అడ్డుకునేందుకు అధికారపక్ష సభ్యులు.. హోం మంత్రి ప్రసంగంలోని కొన్ని పదాలను మాత్రమే తీసుకుని కాంగ్రెస్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందంటూ ఎదురుదాడి మొదలుపెట్టడంతో పరిస్థితి వేడెక్కింది.
తాను అంబేద్కర్‌ను అవమానించలేదని, ఆయన పట్ల తనకూ, తమ పార్టీకీ ఎంతో గౌరవముందనీ అమిత్ షా స్పష్టం చేసినా, ప్రధాని సైతం జోక్యం చేసుకుని అంబేద్కర్ పట్ల తమకున్న గౌరవప్రపత్తులను వెల్లడించినా ఆందోళనలు ఆగలేదు. ఈ నేపథ్యంలో గతంలో అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ప్రధాని సహా ఎన్‌డిఎ సభ్యులు సోదాహరణంగా ఏకరవు పెట్టడం మొదలుపెట్టడంతో రెండు రోజులుగా ఉభయ సభలూ స్తంభించిపోయాయి. దీనికి కొసమెరుపుగా, పార్లమెంటు ఆవరణలో జరిగిన గలభా, తోపులాట ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చిపెట్టేదిలా ఉంది. ఈ సంఘటనలో ఇద్దరు బిజెపి ఎంపిలు గాయపడి ఆస్పత్రి పాలుకాగా, తోపులాటలో తాను కిందపడి గాయపడ్డానంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చెప్పుకొచ్చారు. లోక్‌సభలో విపక్ష నేతపై అధికారపక్ష సభ్యులు హత్యాయత్నం కేసు పెట్టడం, ప్రతిగా తమ పార్టీ అధ్యక్షుడిపై అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ సభ్యులు సైతం కేసు పెట్టడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
పార్లమెంటు సాక్షిగా గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్ఠను మసకబారేలా చేశాయనడంలో సందేహం లేదు. డాక్టర్ అంబేద్కర్ కేంద్రంగా సాగుతున్న ఈ గలభా, అల్లర్లు ఆయనకూ, ఆయన ఆశయాలకూ మచ్చతెచ్చేవే. తన సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానంలో అంబేద్కర్ కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పక్షాల ఏకపక్ష, స్వార్ధపూరిత, దళిత వ్యతిరేక, కులపక్షపాత ధోరణులను ఎండగడుతూనే వచ్చారు. ఈ విషయంలో ఆయన పార్టీలపరంగా ఎలాంటి సానుకూల ధోరణినీ కనబరచలేదు. ఒక పార్టీకి ఆయన దగ్గరని కానీ, మరొక పార్టీకి దూరమని గానీ చెప్పలేం. అలాంటిది, ఆయన మరణానంతరం అంబేద్కర్ సిద్ధాంతాలనూ, ఆశయాలను అన్ని పార్టీలూ అందిపుచ్చుకుని, వాటి సాధన కోసం కృషి చేస్తున్నామని, దళిత బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ కోసం పాటు పడుతున్నామని చెప్పుకోవడం చూస్తూనే ఉన్నాం. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలూ ఇందుకు మినహాయింపేమీ కాదు.
వాడవాడలా అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పి, ఆయన జయంతి, వర్ధంతుల నాడు పూలదండలతో ముంచెత్తినంత మాత్రాన ఆ మహనీయుడి ఆశయ సాధన సిద్ధించినట్లేనని భావిస్తే అంతకన్నా హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదు. ఉన్నతమైన చర్చలతో, పటుతరమైన చట్టాలకు రూపకల్పన చేసే వేదికలుగా చట్టసభలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ విషయాన్ని విస్మరించి, సభా సాంప్రదాయాలను మంటగలుపుతూ, ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతూ, ఉన్నత స్థానంలో ఉన్న స్పీకర్‌ను అగౌరవపరుస్తూ అంబేద్కర్ ఆశయాలకు మచ్చతెచ్చేలా ప్రవర్తిస్తున్న సభ్యుల ప్రవర్తనలో మార్పు రావాలి. ప్రజాప్రతినిధులు హుందాగా, సభ్యతతో వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వేదికలుగా చట్టసభలకు శోభ చేకూరుతుంది. నూట నలభై కోట్ల భారతీయుల ఆశలు, ఆకాంక్షలకూ ప్రతిరూపమైన పార్లమెంటు ప్రతిష్ఠను నిలబెట్టడం సభ్యుల బాధ్యత. సంకుచిత రాజకీయాలను పక్కనబెట్టి, ప్రభుత్వమూ, ప్రతిపక్షమూ సమన్వయంతో ముందుకు సాగితేనే అది సాధ్యపడుతుంది.