హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక సారి మాత్రమే రైతు భరోసా రూ.7600 కోట్లు ఇచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద రూ.73 వేల కోట్లు జమ చేసిందని మంత్రి తుమ్మల చెప్పారని, మంత్రి తుమ్మల స్వయానా రైతు అని, మాతు ఆత్మీయ మిత్రుడు అని తెలిపారు. రైతు భరోసా విధి విధానాలపై స్వల్పకాలిక చర్చ జరిగిన సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. రైతు బంధు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రైతుల బంధులో రూ. 21, 283 కోట్లు దుర్వినియోగం జరిగిందని మంత్రి అన్నారని, 2019-20లో సాగు విస్తీర్ణం 141 లక్షల ఎకరాలని మంత్రే చెప్పారన్నారు.
2020-21లో సాగు విస్తీర్ణం 204 లక్షల ఎకరాలు అని మీరు ఇచ్చి నివేదికలో ఉందని, రైతుబంధు ఇవ్వడం వల్లే సాగు విస్తీర్ణం రెండు కోట్ల ఎకరాలకు పెరిగిందని కెటిఆర్ ప్రశంసించారు. సాగు విస్తీర్ణం పెరగాలనే ఉద్దేశంతోనే రైతు బంధు ఇచ్చామని, ప్రభుత్వం ఇచ్చిన నోట్ అదే చెబుతోందని ఆయన వివరించారు. గతంలో జరిగిన తప్పులు ఎత్తిచూపితే మీకు ఇబ్బందిగా ఉందని, అసెంబ్లీ సమావేశాలు పది రోజులు పొడిగించాలని కెటిఆర్ కోరారు. మంత్రి కోరినట్లు ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మిషన్ భగీరథపై చర్చ చేపట్టాలన్నారు. నల్లగొండ జిల్లా అభివృద్ధిపై కూడా ఒక రోజు చర్చ చేపట్టాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.