Sunday, December 22, 2024

కేజ్రీవాల్ ప్రాసిక్యూషన్‌కు ఇడికి అనుమతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మద్యం విధానం కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ప్రాసిక్యూషన్ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)కి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా నుంచి అనుమతి లభించింది. కీలకమైన ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. బిజెపి ఊపు మీద ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో నాలుగవ విడత అధికారం చేపట్టాలని ఆప్ లక్షంగా పెట్టుకున్నది. నవంబర్ 6 నాటి సుప్రీం కోర్టు తీర్పును ఉటంకిస్తూ ఇడి మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) 2002 కింద కేజ్రీవాల్ ప్రాసిక్యూషన్‌కు ఈ నెల 5న అనుమతి కోరింది. ఎక్సైజ్ పాలసీ ‘రూపకల్పన, అమలులో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని’ తాను కనుగొన్నట్లు ఇడి లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాసిన లేఖలో తెలియజేసింది.

సివిల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) కింద నిర్దేశించినట్లుగా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా మనీ లాండరింగ్‌కు సంబంధించి ప్రభుత్వ అధికారులను ప్రాసిక్యూట్ చేయజాలరని సుప్రీం కోర్టు నవంబర్ 6న తీర్పు ఇచ్చింది. అంతకు ముందు ప్రభుత్వ అధికారులపై ఇడి దాఖలు చేసిన చార్జిషీట్లు (ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు)కు ప్రాసిక్యూషన్ అనుమతి అవసరం లేదు. సిబిఐ, రాష్ట్ర పోలీస్ శాఖ వంటి ఇతర దర్యాప్తు సంస్థలకు అది తప్పనిసరి. ఆరోపిత ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్, అవినీతి కేసుల్లో అర్వింద్ కేజ్రీవాల్‌ను ఇడి, సిబిఐ వరుసగా మార్చి 21న, జూన్ 26న అరెస్టు చేశాయి. ఆయనకు ఆ రెండు కేసుల్లో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News