అందరి సూచనలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం ఏ ఒక్క రైతును తగ్గించే
ఆలోచన లేదు అసెంబ్లీలో వ్యవసాయ తుమ్మల నాగేశ్వర్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. జనవరి ఫస్ట్ నాటికి రైతుబంధు విధివిధానాలు రూపొందిస్తామని వివరించారు. పట్టాదారుల బ్యాంకు ఖాతాలను సేకరించి రైతుబంధు పోర్టల్‌ను అప్డేట్ చేస్తున్నామని తెలియజేశారు. రైతు భరోసా విధి విధానాలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా శనివారం శాసనసభలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. బిఆర్ఎస్ ప్రభు త్వం రైతుబంధు పథకం ప్రారంభించిందని, ధరణి పోర్టల్‌లో ఉన్న వివరాల ప్రకారం రైతుబంధు ఇచ్చారని, రైతుబంధు కింద ఇప్పటివరకు రూ.80,453 కోట్లు ఇచ్చిందని స్పష్టం చేశారు. భూమి ఉన్నవారు సాగు చేసినా, చేయకపోయినా రైతుబంధుకు అర్హులయ్యారని తుమ్మల మండిపడ్డారు.
సిసిఎల్ఎ నుంచి అందిన భూవిస్తీర్ణంలో మార్పులు చేయడానికి అనుమతి లేదన్నారు. 202324లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.7625 కోట్లు చెల్లించిందన్నారు. 2018 నుంచి పంటల సర్వే వ్యవసాయ శాఖ బాధ్యతగా మారిందన్నారు. ఎఇఒలు యాప్‌లు సాయంతో పంటల నగదు సర్వే ప్రారంభించారన్నారు. తాము ఇచ్చిన నోట్లో రైతు భరోసాపై ఏమీ చెప్పలేదు. గత ప్రభుత్వంలో జరిగిన విధివిధానాలే సభ ముందు ఉంచామని, బిఆర్ఎస్ ఏది చెబితే అది అమలు చేయాలనే ఆలోచన వారికి ఉందన్నారు. ఏ పంటకు ఎంత ఇస్తామనేది ఇంకా నిర్ణయించలేదని, సభలో సభ్యుల సూచనల తర్వాతే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. పత్తి, చెరకుకు ఏం చేయాలనేది సభ్యులు చెబితే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతుబంధులో కోతలు విధిస్తామని తాము చెప్పలేదని, ప్రజలు, సభ్యుల అభిప్రాయం ప్రకారం విధివిధానాలు నిర్ణయిస్తాంమని వెల్లడించారు. ‘రైతు భరోసా’లో ఒక్క రైతును కూడా తగ్గించే ఆలోచన లేదు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతోన్న ‘రైతు భరోసా’ పథకంలో భాగంగా ఏ ఒక్క రైతును తగ్గించే ఆలోచన తమకు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు.