అల్లు అర్జున్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
అల్లు అర్జున్ అన్నమాటలు వెనక్కి తీసుకోవాలి : ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్
అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది : ఎంపీ చామల కిరణ్ కుమార్
అల్లు అర్జున్ తీరులో కనీస పశ్చాత్తాపం లేదు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా తన ఇమేజ్ దెబ్బతీశారంటూ అర్జున్ మాట్లాడటం సరికాదన్నారు. శనివారం జరిగిన ప్రెస్మీట్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై కోమటి రెడ్డి స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనడం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిన్నదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
అల్లు అర్జున్ అన్నమాటలు వెనక్కి తీసుకోవాలి : ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్
ప్రజా ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్ తెలిపారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సామాన్యులను కష్టపెడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని ప్రజలకు ధైర్యం, భరోసా కల్పించే ప్రయత్నం చేస్తే స్వాగితించాల్సింది పోయి, వెంటనే సీనీ నటుడు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని బలుమూరు వెంకట్ ప్రశ్నించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై నటుడు అల్లు అర్జున్ ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుని అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఎవరు తప్పు చేసినా ప్రజా ప్రభుత్వంలో న్యాయం, ధర్మం వైపు అండగా నిలవాల్సిన బాధ్యత సీఎంకు ఉంటుందని అదే విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టమైన వైఖరిని అసెంబ్లీ సమావేశాల్లో తెలియజేస్తే ఆ వెంటనే అర్జున్ మీడియా సమావేశం పెట్టడం సరిగాదని వెంకట్ మండి పడ్డారు.
అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది : భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్
సినీ ప్రముఖులు వ్యాపారం చేసుకుంటే తప్పులేదని, అదే సమయంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరముందని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ సూచనలు చేస్తే అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తుందని దానిలో భాగంగానే అల్లుఅర్జున్ సినిమాకు టికెట్ రేట్లు పెంచి ఆదుకున్న విషయాన్ని చామల గుర్తుచేశారు. సంధ్య థియేటర్ వద్ధ జరిగిన ఘటన గురించి సీఎం వాస్తవాలు ప్రజలకు వెల్లడిస్తే హీరో అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి ఎవరో రాసిచ్చిన నోట్ చదివి వెళ్లిపోయారు తప్ప బాధ్యతగా వ్యవహరించలేదని చామల కిరణ్ కుమార్ తెలిపారు. అల్లు అర్జున్ ప్రజలకు ఏం సందేశం చెప్పాలనుకుంటున్నారో కనీస అవగహన లేకుండా ప్రవర్తిస్తున్నారని చామల విమర్శించారు. ప్రముఖులు భయటకు వెళ్లినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా బాధ్యతగా ఉండాలని సీఎం రేవంత్ చెప్పినప్పుడు హీరోను టార్గెట్ చేస్తున్నారనడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు హీరోలను రియల్ హీరోలుగా అనుకుంటారు కనుక నిజ జీవితంలోనూ సీనీ హీరోలు సినిమాలోనే కాదు నిజ జీవితంలోనూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
అల్లు అర్జున్ తీరులో కనీస పశ్చాత్తాపం లేదు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
అల్లు అర్జున్ తీరులో కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. అల్లు అర్జున్ రేవతి కుటుంబంపై కనీస సానుభూతి చూపించకుండా అసెంబ్లీలో సీఎం రేవంత్ మాటలను తప్పుబట్టడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. ఆరోజు తొక్కిసలాటలో మహిళతో పాటు బాబు కూడా చనిపోయారని అనుకుని పోలీసులు అల్లు అర్జున్‌కి చెప్పే ప్రయత్నం చేసినా వినలేదని, ఆఖరికి డీసీపీ వచ్చి మీరు వెళ్లాల్సిందే అని చెప్పిన తర్వాత కూడా థియేటర్ బయట షో చేసుకుంటూ వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్నటి ప్రెస్ మీట్ లో ఆయన తీరు వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప, బాధిత కుటుంబం గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తినందుకు సభా వేదికగా ఆన్ రికార్డ్ జరిగింది ఓ మానవీయ కోణంలో చూడాలని రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేసినందుకు ఏదో జరిగిపోయిందని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు బాధితుల ప్రాణాలు మీ పేరు ప్రతిష్టల కంటే ఎక్కువా అని ప్రశ్నించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ తన కొడుకు మూడీగా ఉన్నాడని బాధ పడుతున్నాడని, కానీ ఆస్పత్రిలో ఆ చిన్నారి ఉలుకుపలుకు లేకుండా ఉన్నాడని, ఆ విషయం ఎందుకు ఆలోచించట్లేదన్నారు. జరిగిన సంఘటనకు చింతించాల్సింది పోయి రేవంత్ రెడ్డిని తప్పుబట్టే ప్రయత్నం చేయడం సబబు కాదని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.