‘జీవితాన్ని ఆమోదించొచ్చు లేదంటే మార్చుకోవచ్చు. కానీ, అది ఆమోదయోగ్యంగా లేనప్పుడు ఖచ్చితంగా మార్చి తీరాలి’ అని నల్లజా తి ప్రజల తరఫున ఎలుగెత్తి చాటిన ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ కవయిత్రి నిక్కీ జియోవానీ ఈ నెల 9వ తేదీన తన 81వ ఏట క్యాన్సర్‌తో మరణించారు. 1960ల్లో చెలరేగిన బ్లాక్ ఆర్ట్ మూవెంట్‌లో ఆమెదే ప్రధాన గొంతుక. ఐదు దశాబ్దాలపాటు సాగిన సుదీర్ఘ ప్రయాణంలో ప్రేమ, ఏకాంతం, లింగ, జాతి వివక్ష సహా అనేక అంశాలపై అక్షర శరసంధానం చేశారు. టెన్నెసీలోని నాక్స్‌విల్‌లో 1943లో జన్మించిన యొలాండే కర్నేలియా జియవానీకి నిక్కీ అనే నిక్ నేమ్‌ను ఆమె పెద్ద అక్క పెట్టింది. నాష్‌విల్, కొలంబియాల్లో చదువుకున్న ఆమె పాతికేళ్లు వచ్చేసరికి ‘బ్లాక్ ఫీ లింగ్’, ‘బ్లాక్ టాక్ అండ్ బ్లాక్ జడ్జిమెంట్’ పేరిట 1968లో కవితా సంకలనాలు వెలువరించారు. ఆఫ్రికన్ -అమెరికన్ కవుల్లో శిఖరాయమానంగా నిలిచే ఆమెకి ఎన్నో బహుమతులు లభించాయి. తన బాల్యం, నల్లజాతీయులపై వివక్ష, పౌరహక్కులు సాహిత్యంలో ప్రధాన భాగం సంతరించుకున్నాయి. తన కవిత్వంతో ఎందరో విద్యార్థులు, కళాకారులు, కార్యకర్తల్లో స్ఫూర్తి నింపారు.
దేశీరాజు