హైదరాబాద్: కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో విఫలమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో అందుబాటులో లేకపోవడంతో బుమ్రా కెప్టెన్సీలో టీమిండియా ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా వచ్చిన తరువాత రెండో టెస్టులో ఓడిపోగా మూడో టెస్టు డ్రాగా ముగిసింది. అటు కెప్టెన్, ఇటు బ్యాటర్‌గా రోహిత్ విఫలమవుతున్నాడు. రోహిత్ గత మూడు ఇన్నింగ్స్‌లలో 10, 03, 06 పరుగులు చేశారు. దీంతో రోహిత్ శర్మపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. కెప్టెన్ రోహిత్‌కు మాజీ కోచ్ రవిశాస్త్రి సలహాలు ఇచ్చాడు.
అతడు దూకుడుతోనే బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని తెలిపారు. రోహిత్ ప్రమాదకర బ్యాట్స్‌మెన్ కావడంతో ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాలన్నారు. రోహిత్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తుండడంతో డిఫెన్స్ ఆడాలా, ఎదురుదాడి చేయాలా? అనే ఆలోచన వస్తే రెండోది ఎంచుకోవాలని రవిశాస్త్రి సూచించారు. అతను తన సహజ శైలిలో ఆడితే పరుగులు రావడంతో పాటు బౌలర్లకు వణుకు పుడుతుందన్నారు. రోహిత్ బ్యాటింగ్‌లో తన ప్లాన్‌ను మార్చాలన్నారు. ఆరో స్థానంలో వచ్చే బ్యాట్స్‌మెన్లు ఎదురు దాడి చేయడానికే ప్రయత్నం చేస్తారన్నారు. నాలుగో టెస్టులోనూ కె ఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయడమని మంచిదని సూచించారు.