హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరమని సినీ నటి, కాంగ్రెస్ నేత మాజీ ఎంపి విజయశాంతి తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటన రాజకీయంగా మారడంతో విజయశాంతి స్పందించారు. సినిమా ఇండస్ట్రీని నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బిజెపి కేంద్రమంత్రులు, నేతలు ఆరోపణ చేయడం మంచిది కాదన్నారు. ఈ ఘటనను బిజెపి నేతలు తనకు అనుకూలంగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. బిజెపికి చెందిన తెలుగు రాష్ట్రాల నేతల ప్రకటనల్లో ఇది కనిపిస్తుందన్నారు. సినీ పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావాలని విజయశాంతి పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తొక్కిసలాట ఘటనతో పాటు సినీపరిశ్రమ, ప్రతిపక్షాల విమర్శలపై సిఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నటుడు అల్లు అర్జున్ కూడా తనదైన శైలిలో స్పందించారు. రేవతి కుటుంబానికి రూ.25 కోట్ల పరిహారం ఇవ్వాలని అల్లు అర్జున్ ఇంటిపై జెఎసి నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే.