జెరూసలెం: గాజాపై శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ సాగించిన వైమానిక దాడుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. మువాసీ ఏరియాలో ఇజ్రాయెల్ ప్రకటించిన మానవతా జోన్‌లోని శరణార్థి శిబిరంపై సోమవారం జరిగిన దాడిలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు సహాయం అందిస్తున్న కాన్వాయ్‌పై జరిగిన దాడిలో మృతి చెందారని నాసర్ ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి.
మువాసీలో కారుపై జరిగిన దాడిలో ఇద్దరు చనిపోయారు. వేరే దాడిలో ఒకరు చనిపోయారు. డెయిర్ అల్ బలా నగరంలో శరణార్థుల శిబిరంగా మారిన స్కూలుపై వైమానికదాడి వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అల్ అక్సా మార్టైర్స్ ఆస్పత్రి వెల్లడించింది. ప్రజల్లో కలిసి ఉంటున్న ఉగ్రవాదులపై నే తాము దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయాక మానవతా జోన్‌లో హమాస్ మిలిటెంట్‌ను టార్గెట్ చేసి దాడి చేసినట్టు పేర్కొంది.