వాషింగ్టన్: అమెరికాకు త్వరలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని పనామాకు హెచ్చరించడం వివాదంగా మారింది. పనామా కాలువను ఉపయోగించుకొనే అమెరికన్ నౌకలకు మితిమీరిన ఛార్జీలు వసూలు చేస్తున్నారని ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు. “పనామా కెనాల్ అమెరికాకు కీలకమైన జాతీయ ఆస్తి. జాతీయ, ఆర్థిక భద్రతకు అత్యంత కీలకం. ఉదారంగా ఇచ్చిన విరాళం విషయంలో నైతిక చట్టపరమైన సూత్రాలు పాటించకపోతే, పనామా కాలువను మాకు తిరిగి ఇచ్చేయాలి, ఈమేరకు అధికారులకు సూచించండి” అని పేర్కొనడం సంచలనం సృష్టించింది. ఇంతకు ముందు తాజాగా పనామా కెనాల్‌ను ఆక్రమిస్తామంటూ ట్రంప్ హెచ్చరించగా, పనామా దేశాధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తీవ్రంగా స్పందించారు. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకొంటామని స్పష్టం చేశారు. ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఆయన ఎక్స్‌లో ఈ మేరకు వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. తాము కాల్వలో ప్రయాణించే నౌకల నుంచి ఖర్చులకు అనుగుణంగా ఫీజులు వసూలు చేస్తామని, దీనిని నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు.
సప్లైడిమాండ్ ఆధారంగా ఇది ఉంటుందన్నారు. అంతేకానీ అడ్డగోలుగా టారిఫ్‌లు విధించబోమన్నారు. ట్రంప్ దీనిపై మరో పోస్టు చేశారు. పనామా కాల్వలో అమెరికా పతాకం ఉన్నట్టున్న ఫోటోను పెట్టి “యునైటెడ్ స్టేట్స్ కెనాల్‌కు స్వాగతం” అని క్యాప్షన్ జత చేయడంతో వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయింది. నౌకాయాన భారం తగ్గిస్తూ అట్లాంటిక్ ఫసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయప్రయాసలతో పనామా కాల్వను 1914లో నిర్మించింది. దీనిని తొలుత అమెరికాయే నిర్వహించింది. కానీ పనామా దేశంలోదీనిపై తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు చెలరేగడంతో 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్ ఈ కాల్వ తటస్థంగా ఉండాలని, ఎటువంటి ముప్పు వచ్చినా, అమెరికాకు రక్షించుకొనే హక్కు ఉంటుందని తదితర షరతులతో పనామా దేశానికి అప్పగించారు.