మన తెలంగాణ/క్రీడా విభాగం: బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటికే మూడు టెస్టులు జరిగాయి. తొలి టెస్టులో టీమిండియా, రెండో టెస్టులో ఆస్ట్రేలియా జయకేతనం ఎగుర వేశాయి. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన రెండు టెస్టుల్లో టీమిండియా భారీ తేడాతో విజయం సాధించక తప్పదు. ఫైనల్ అవకాశాలను నిలబెట్టుకోవాలంటే ఈ రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలవడం తప్పించి టీమిండియాకు మరో మార్గం కనిపించడం లేదు. తొలి టెస్టు మినహా భారత్ ఏ మ్యాచ్‌లోనూ తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయింది. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. అడిలైడ్ వేదికగా జరిగిన డేనైట్ టెస్టులో టీమిండియా ఆటగాళ్లు చెత్త బ్యాటింగ్‌తో తేలిపోయారు.
ఈ మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య టీమ్ ఆస్ట్రేలియాకు కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. ఇలాంటి స్థితిలో రానున్న మ్యాచ్‌లు టీమిండియాకు సవాల్ వంటివేనని చెప్పాలి. బ్యాటింగ్ వైఫల్యం జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. ఓపెనర్లతో పాటు టాప్ ఆర్డర్ బ్యాటర్లు పూర్తిగా నిరాశ పరుస్తున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేలవమైన బ్యాటింగ్‌తో సతమతమవుతున్నాడు. అతను ఫామ్‌ను కోల్పోవడం జట్టుకు సమస్యగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన యశస్వి వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా తయారైంది. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ బాగానే ఆడుతున్నా భారీ స్కోర్లు సాధించలేక పోతున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా గురువారం నుంచి రెండు జట్ల మధ్య బాక్సింగ్‌డే టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా ఓపెనర్లు జట్టుకు శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది.
సీనియర్లు గాడిలో పడాల్సిందే..
ఇక ఈ సిరీస్‌లో సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ తదితరులు పేలవమైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నారు. కోహ్లి మూడు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. జట్టు భారీ ఆశలు పెట్టుకున్న కోహ్లి పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నాడు. ఒక్క ఇన్నింగ్స్‌లోనూ మెరుగైన స్కోరును సాధించలేక పోయాడు. కనీసం మిగిలిన రెండు టెస్టుల్లోనైనా కోహ్లి మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక కెప్టెన్ రోహిత్‌ది కూడా ఇలాంటి పరిస్థితే. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లలోనూ రోహిత్ తేలిపోయాడు. జట్టును ముందుండి నడిపించలేక పోతున్నాడు. అతని వైఫల్యం జట్టుకు అతి పెద్ద సమస్యగా తయారైంది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కూడా సత్తా చాటలేక పోతున్నాడు. మిగిలిన మ్యాచుల్లోనైనా గిల్ తన బ్యాట్‌కు పనిచెప్పక తప్పదు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. ఇలా కీలక ఆటగాళ్లందరూ ఫామ్‌లేమీతో సతమతమవుతుండడం భారత్‌కు సమస్యగా మారింది. ఈ లోపాన్ని సరిదిద్దుకుంటేనే టీమిండియాకు సిరీస్‌లో గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.