Wednesday, December 25, 2024

త్వరలో రీజినల్ రింగ్ రోడ్డు పనులకు టెండర్లు: డిప్యూటీ సిఎం భట్టి

- Advertisement -
- Advertisement -

పంట రుణాల పంపిణీలో వేగం పెంచండి
సంక్షేమ, వ్యవసాయ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నాం
మ్యాచింగ్ గ్రాంట్లు, సబ్సిడీ పథకాలు మంజూరు చేసి సహకరించండి
ప్రజాభవన్ లో జరిగిన బ్యాంకర్స్ సమావేశములో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
మన తెలంగాణ/హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని, త్వరలో టెండర్లు పిలవబోతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విస్తృతమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణను చూస్తారని, దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూడబోతుందని ఆయనన్నారు. సోమవారం ప్రజాభవన్‌లో జరిగిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రభుత్వం మూసీ పునర్జీవం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీకి, ఫార్మా కంపెనీల నిర్మాణం పెద్ద ఎత్తున చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ రైజింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ కోణంలో బ్యాంకర్లు దీర్ఘ దృష్టితో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు.

వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలని ఆయన బ్యాంకర్లకు సూచించారు. సకాలంలో రైతులకు రుణాలు ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదని అన్నారు. సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నామని, గత ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున డబ్బును ప్రజల్లోకి వదులుతోందని, అందుకు అనుగుణంగా మ్యాచింగ్ గ్రాంట్‌లు, సబ్సిడీ పథకాలు మంజూరు చేసి రాష్ట్ర ప్రజలకు సహకరించాలని సూచించారు. 2024 ఖరీఫ్ సీజన్‌లో రూ. 54,480 కోట్ల రుణాలు లక్ష్యం కాగా 44,438 కోట్లు, 81.57 శాతం విడుదల చేశారు. రబీ రుణాల పంపిణీకి నెలరోజుల సమయం ఉన్నందున వేగం పెంచాలని డిప్యూటీ సిఎం కోరారు. ఏ రాష్ట్ర అర్థికాభివృద్ధికైనా బ్యాంకర్లు వెన్నుముక లాంటివారని అన్నారు. జిడిపి పెరుగుదలకు కీలక భూమిక పోషిస్తున్న బ్యాంకర్లకు అభినందనలు తదెలిపారు.

రీ పెమెంట్ పెరిగింది.. అప్పులు ఇవ్వడం తగ్గింది
బ్యాంకర్‌లకు రీపేమెంట్ పెరిగిందని, అప్పులు ఇవ్వడం తగ్గిందని ఇది సహజానికి విరుద్ధంగా ఉందని డిప్యూటీ సిఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల వ్యవధిలోనే 21 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద బ్యాంకులకు జమ చేసిందని, బ్యాంకర్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. టర్మ్ లోన్స్ విషయంలో లక్ష్యానికి మించి పని చేయడం అభినందనీయమని అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ ఎగ్జిబిషన్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, యాంత్రికరణ రుణాల విషయంలో బ్యాంకర్‌లు లిబరల్ గా ఉండాలని కోరారు. ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణలోనూ బ్యాంకర్‌లు లిబరల్ గా ఉండాలన్నారు.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్‌లు శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ పరిశ్రమల ద్వారా ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని, పెద్ద మొత్తంలో వస్తువుల ఉత్పత్తి జరిగి జిడిపి పెరుగుదలకు ఉపయోగపడుతుందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు రుణాలు ఇవ్వడం మూలంగా కొద్ది మంది చేతిలో ఆర్థిక వ్యవస్థ కేంద్రీకృతమవుతుందని, కార్పొరేట్ కంపెనీలతోపాటు చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు విరివిగా రుణాలు ఇవ్వాలని భట్టి విక్రమార్క కోరారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 20 వేల కోట్ల వడ్డీలేనీ రుణాలు ఇస్తుందని, రాబోయే ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ఒప్పందం
స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి వారితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ స్వయం సహాయక సంఘాల ద్వారా 4000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని గ్రీన్ పవర్ ఉత్పత్తికి బ్యాంకర్‌లు పెట్టుబడులు సమకూర్చాలని కోరారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ద్వారా రైతులకు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాలకు సంక్షేమ పథకాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు విడుదల చేస్తున్న నేపథ్యం లో సబ్సిడీ పథకాలు, మ్యాచింగ్ గ్రాంట్ ల రూపంలో పెద్ద సంఖ్యలో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News